samaikayanadhra
-
అరగుండుతో ఎమ్మెల్యే నిరసన
-
వైద్యాధికారిణి పద్మావతిపై దాడి
తూ.గో: మంత్రి తోట నరసింహ అనుచరులు వీరంగ సృష్టించారు. జిల్లాకు చెందిన ఓ వైద్యాధికారిణిపై మంత్రి అనుచరులు బుధవారం దాడికి దిగడంతో స్థానికంగా కలకలం రేగింది. సమైక్యాంధ్రకు మద్దతుగా దీక్ష చేస్తున్న మంత్రి సతీమణి వాణికి వైద్య పరీక్షలు నిర్వహించేందుకు వచ్చిన వైద్యాధికారిణి పద్మావతిపై మంత్రి అనుచరులు దాడికి పాల్పడ్డారు. పద్మావతిపై పేడ, వాటర్ ప్యాకెట్లతో దాడి చేయడంతో షాక్ గురైన ఆమె పోలీసుల సహాయంతో అక్కడి నుంచి వెనుదిరిగారు. ఐదు రోజులుగా దీక్ష చేస్తుంటే ఇప్పుడా వచ్చేది అని నిలదీసిన మంత్రి అనుచరులు ఆమెను నిర్భందించేందుకు యత్నించారు. దీంతో చేసేది లేక వైద్యాధికారిణి వెళ్లిపోయారు. అంతకుముందుమంత్రి సతీమణి దీక్షను భగ్నం చేసేందుకు పోలీసులు విఫలయత్నం చేశారు. సమైక్యవాదులు పోలీసులను అడ్డుకోవడంతో ఆమె దీక్ష యథావిధిగా కొనసాగిస్తున్నారు. -
ప్రజల అభీష్టం మేరకే రాజీనామాలు: కొండ్రు
హైదరాబాద్ : సమైక్యాంధ్రకు మద్దతుగా మరో ఇద్దరు మంత్రులు రాజీనామాలు చేశారు. మంత్రులు కొండ్రు మురళి, శత్రుచర్ల విజయరామరాజు సోమవారం తమ మంత్రి పదవులకు రాజీనామా చేశారు. ఈమేరకు వారు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డిని కలిసి తమ రాజీనామా పత్రాలు సమర్పించారు. ప్రజాభీష్టం మేరకే తాము పదవులకు రాజీనామాలు చేసినట్లు కొండ్రు మురళి తెలిపారు. రాష్ట్ర విభజనపై సీపీఐ, బీజేపీ, టీడీపీ తమ నిర్ణయాన్ని మార్చుకుంటే.... కాంగ్రెస్ నిర్ణయాన్ని మార్చుకునేలా చేస్తామని కొండ్రు మురళి అన్నారు. ఇప్పటికే సగం మంది సీమాంధ్ర మంత్రులు తమ పదవులకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. కాగా రాష్ట్ర విభజన ప్రకటన అనంతరం తొలిసారి సచివాలయానికి వచ్చిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డికి సమైక్య సెగ తగలింది. సీమాంధ్ర ఉద్యోగులు కళ్లకు గంతలు కట్టుకుని తమ నిరసన తెలిపారు. -
కృష్ణుడి వేషధారణలో సభకు ఎంపీ శివప్రసాద్
న్యూఢిల్లీ : రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ టీడీపీ ఎంపీ శివప్రసాద్ సోమవారం వినూత్నంగా తన నిరసన తెలిపారు. కృష్ణుడి వేషధారణలో ఆయన లోక్‌సభకు హాజరయ్యారు. లోక్‌సభ వాయిదా అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర విభజన నిర్ణయంతో సీమాంధ్ర అట్టుడుకుతుందని పద్యాల ద్వారా సభకు తెలియ చేశానన్నారు. రాష్ట్రంలోని పరిస్థితిని కళారూపం ద్వారా సోనియాగాంధీకి వివరించాలని కృష్ణుడి వేషంలో సభకు హాజరైనట్లు తెలిపారు. టీడీపీ మరో ఎంపీ కొనకళ్ల నారాయణ మాట్లాడుతూ సీమాంధ్రకు అన్యాయం జరిగితే సహించేది లేదని హెచ్చరించారు. అన్ని పక్షాలతో చర్చించి సముచిత నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు. కాంగ్రెస్ ఎంపీలు డ్రామాలు ఆడుతున్నారని కొనకళ్ల మండిపడ్డారు. కాగా రాజ్యసభలో టీడీపీ ఎంపీల నిరసన కొనసాగుతోంది. స్పీకర్ పోడియం వద్ద నిలబడి ఎంపీలు హరికృష్ణ, సుజనా చౌదరి, సీఎం రమేష్ ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ సేవ్ ఆంధ్ర ప్రదేశ్ అంటూ నినాదాలు చేస్తూ తమ నిరసన తెలియ చేస్తున్నారు. -
అనంతలో సామూహిక సెలవు ప్రకటించిన జాక్టో
అనంతపురం : అనంతపురం జిల్లావ్యాప్తంగా 13వ రోజు కూడా సమైక్య ఆందోళనలు కొనసాగుతున్నాయి. సమైక్యాంధ్ర కోసం జాక్టో సోమవారం సామూహిక సెలవు ప్రకటించింది. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ విద్యుత్ ఉద్యోగులు మౌన ప్రదర్శన చేశారు. పీటీసీ నుంచి వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. కాగా వైఎస్ జగన్, విజయమ్మ రాజీనామాలకు సంఘీభావంగా అనంతపురం జిల్లలో 48 గంటల బంద్ కొనసాగుతోంది. ధర్మవరంలో 3వేలమందితో రెండ్ల సంఘం సమైక్యా ర్యాలీ నిర్వహించి, రోడ్డుపై వంటావార్పు చేస్తున్నారు. కాగా ధర్మవరం తారకరామాపురానికి చెందిన ఆకుల టివిలో విభజన వార్తలు చూసి తట్టుకోలేక గుండెపోటుతో మృతి చెందిగా, గుంతకల్లులో ఆందోళనలో పాల్గొన్న రహమాన్ అనే వ్యక్తి సమైక్యాంధ్రకు అనుకూలంగా నినాదాలు చేస్తూ ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. రెహమాన్ పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో కర్నూలు ఆసుపత్రికి తరలించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు వ్యాపార, వాణిజ్య సముదాయాలు మూతపడ్డాయి. జిల్లావ్యాప్తంగా ఆర్టీసీ, ప్రైవేటు బస్సులు రోడ్డెక్కలేదు. అన్ని వర్గాల ప్రజలు ఉద్యమంలో పాల్గొనడంతో జిల్లా హోరెత్తుతోంది. విద్యార్థి, ఉపాధ్యాయ, ఉద్యోగ, న్యాయవాదుల రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. అలాగే టీడీపీ సోమవారం జిల్లా బంద్‌కు పిలుపునిచ్చింది. -
మంత్రి పదవికి తోట నర్సింహం రాజీనామా
హైదరాబాద్ : స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి పదవికి తోట నర్సింహం రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను గురువారం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డికి అందచేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా తోట నర్సింహం రాజీనామాను సమర్పించారు. ఇప్పటికే సీమాంధ్ర మంత్రులు గంటా శ్రీనివాసరావు, ఏరాసు ప్రతాపరెడ్డి, టీజీ వెంకటేశ్ తమ రాజీనామాలను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అందచేసిన విషయం తెలిసిందే. మరోవైపు సీమాంధ్రలో తొమ్మిదో రోజు కూడా నిరసనలు, ఆందోళనలు కొనసాగుతున్నాయి. ర్యాలీలు, ధర్నాలు, మానవ హారాలతో సీమాంధ్ర ప్రజలు తమ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. -
లగడపాటి నివాసంలో సీమాంధ్ర నేతల భేటీ
-
లగడపాటి నివాసంలో సీమాంధ్ర నేతల భేటీ
న్యూఢిల్లీ : గత రెండు రోజులుగా పార్లమెంట్‌ను అడ్డుకుంటున్న సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు, మంత్రులు ఎలాంటి వ్యూహం అనుసరించాలనే దానిపై మల్లగుల్లాలు పడుతున్నారు. దీనిపై సమావేశమైన ఎంపీలు ఏకాభిప్రాయానికి రాలేకపోయారు. దీంతో ఎవరికి వారే యమునా తీరు అన్న చందంగా ప్రవర్తిస్తున్నారు. తమ తమ ప్రాంత ప్రయోజనాల మేరకు సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు వ్యవహరిస్తున్నారు. తాజాగా సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు, మంత్రులు ఈరోజు ఉదయం ఎంపీ లగడపాటి రాజగోపాల్ నివాసంలో సమావేశమయ్యారు. సమైక్యాంధ్ర ఉద్యమం, భవిష్యత్ కార్యాచరణ, పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తున్నారు. మరోవైపు కర్నూలు జిల్లా నేతలు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అపాయింట్మెంట్ కోరారు. విభజనతో రాయలసీమకు తలెత్తే సమస్యలను వీరు ఈ సందర్భంగా ప్రధానికి వివరించనున్నట్లు సమాచారం. కేంద్రమంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో రాయలసీమ నేతలు నిన్న సోనియాగాంధీని కలిసిన విషయం తెలిసిందే. కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, ఎంపీ ఎస్పీవై రెడ్డి, రాష్ట్ర న్యాయ శాఖ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి పార్టీ అధినేత్రితో సమావేశమై విభజన తప్పదంటే రాయలసీమను ప్రత్యేక రాష్ట్రం చేయాలని కోరారు. -
గుండె పగిలింది..
వింజమూరు, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజన అనివార్యమనే విషయాన్ని జీర్ణించుకోలేని ఓ సమైక్యవాది గుండె ఆగిపోయింది. సమైక్యాంధ్ర ఉద్యమంలో చురుకైన పాత్ర పోషిస్తున్న గుండెడమడకలకు చెందిన చీమల నారాయణరెడ్డి(61) సోమవారం అర్ధరాత్రి మృతి చెందారు. ఉద్యమంలో భాగంగా శనివారం గ్రామంలో నిర్వహించిన నిరసన కార్యక్రమానికి ఆయన నేతృత్వం వహించారు. అనంతరం ఇంటికి చేరుకున్న ఆయన అదేరోజు రాత్రి అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే కుటుంబ సభ్యులు నెల్లూరులోని నారాయణ ఆస్పత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ సోమవారం అర్ధరాత్రి మృతి చెందాడు. విభజన కారణంగా వచ్చే నష్టాలను రచ్చబండ వద్ద అందరికీ నారాయణరెడ్డి వివరించే వారని గ్రామస్తులు తెలిపారు. ఆయనకు భార్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వైఎస్సార్సీపీ నేత అయిన నారాయణరెడ్డి గుండెమడకలలోని కోదండరామస్వామి దేవస్థానం ధర్మకర్తగా వ్యవహరిస్తున్నారు. ఘననివాళి..: చీమల నారాయణరెడ్డి మృతదేహానికి వైఎస్సార్సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు గణపం బాలకృష్ణారెడ్డి మంగళవారం నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన వెంట పార్టీ మండల కన్వీనర్ గువ్వల కృష్ణారెడ్డి, నేతలు బయ్యపురెడ్డి రామకోటారెడ్డి, ఎం.విజయకుమార్‌రెడ్డి, మద్దూరి లక్ష్మీప్రసాద్‌రెడ్డి, గోపిరెడ్ది రమణారెడ్డి, ముక్కమల్ల శ్రీనివాసులురెడ్డి, వెలుగోటి రమేష్‌నాయుడు, దాట్ల విజయభాస్కర్‌రెడ్డి, లెక్కల శ్రీనివాసులురెడ్డి ఉన్నారు. -
దిగ్బంధం
సాక్షి, కర్నూలు: జిల్లా అంతటా సమైక్య పోరు తీవ్రరూపం దాలుస్తోంది. ఏడో రోజు మంగళవారం కూడా ఆందోళనలు సరికొత్త పంథాలో నిర్వహించారు. నిరసన రూపాలు వేరైనా.. అందరూ సమైక్య వాదాన్ని భుజానికెత్తుకున్నారు. కర్నూలులో ఉద్యోగులు విధులు బహిష్కరించి సమైక్యాంధ్రకు మద్దతుగా నడుం బిగించారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా విద్యార్థులు ర్యాలీలతో హోరెత్తించారు. వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. ఆర్టీసీ బస్సులు అధిక శాతం డిపోలకే పరిమతమయ్యాయి. సమైక్యాంధ్ర జేఏసీ పీలుపులో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో 18, 44వ జాతీయ రహదారులను దిగ్బంధించారు. పార్టీ జిల్లా కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి.. కర్నూలు, పాణ్యం, కోడుమూరు నియోజకవర్గాల సమన్వయకర్తలు ఎస్వీ మోహన్‌రెడ్డి, గౌరు చరితారెడ్డి, మణిగాంధీలు తుంగభద్ర బ్రిడ్జిపై బైఠాయించి నిరసన తెలిపారు. ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు రహదారిపైనే వంటావార్పు నిర్వహించి అక్కడే సహపంక్తి భోజనాలు చేశారు. ఆదోనిలో షరామామూలుగా ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. సోనియా, కేసీఆర్, ముఖ్యమంత్రి కిరణ్, బొత్స సత్యనారాయణకు వ్యతిరేకంగా ఆందోళనలు మిన్నంటాయి. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, రాజకీయ జేఏసీ ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ, నిరసన ఊరేగింపు, రాస్తారోకోలు చేపట్టారు. ఎమ్మెల్యే మీనాక్షినాయుడు, మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి కూడా సైకిల్ మోటర్ల ర్యాలీలో పాల్గొన్నారు. పభుత్వ, మున్సిపల్ ఉద్యోగులు విధులు బహిష్కరించి నల్ల బ్యాడ్జీలు ధరించి ఆందోళన కార్యక్రమాల్లో పాల్పంచుకున్నారు. ఆళ్లగడ్డ పట్టణంలో నాయీబ్రహ్మణులు, తలారులు, ఉద్యోగుల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ కొనసాగింది. మండల కేంద్రమైన ఆలూరులో జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యమకారులు సమైక్యాంధ్రను కోరుతూ అర్ధనగ్న ప్రదర్శన చేశారు. ఆస్పరిలో రాష్ట్రాన్ని సమైక్యాంగానే ఉంచాలని కోరుతూ రెవెన్యూ ఉద్యోగులు సామూహిక సెలవు ప్రకటించారు. ఆత్మకూరు పట్టణంలో తెలంగాణకు నిరసనగా నాయీబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో మౌన ప్రదర్శన నిర్వహించారు. వెలుగోడు పట్టణంలోని పొట్టిశ్రీరాములు సెంటర్లో తెలంగాణకు నిరసనగా ఎంపీడీఓ, తహశీల్దార్, గ్రామపంచాయతీ ఉద్యోగులు రాస్తారోకో నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. కోడుమూరులో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు తరగతులు బహిష్కరించి కోట్ల సర్కిల్లో ఆందోళన చేపట్టారు. మెడికల్ షాప్స్ అసోసియేషన్, ఆర్ఎంపీ వైద్యుల అసోసియేషన్, వర్క్ చార్జ్డ్ ఎంప్లాయీస్ యూనియన్, విద్యుత్ కార్మికుల అసోసియేషన్ల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించి సోనియాగాంధీ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. నంద్యాలలో హిజ్రాలు ర్యాలీ నిర్వహించారు. ఏపీఎన్జీఓలు అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లి తాళాలు వేశారు. ఎమ్మిగనూరులో ఏపీ ఎన్జీవోస్, ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో వివిధ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు, ఉద్యోగులు పట్టణంలో భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం శివ సర్కిల్లో గంటపాటు బైఠాయించి నిరసన తెలిపారు. సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతుగా స్థానిక సిటికేబుల్ నిర్వాహకులు వినోద చానల్స్ ప్రసారాలను పూర్తిగా నిలిపేశారు. ఇదిలాఉండగా కోవెలకుంట్ల మండలంలో నిర్వహించిన ఇఫ్తార్ విందుల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే చల్లా రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. కుమారుడు రాహుల్‌ను ప్రధానిని చేసేందుకే సోనియాగాంధీ విభజనకు శ్రీకారం చుట్టారని విమర్శించడం గమనార్హం.