న్యూఢిల్లీ : గత రెండు రోజులుగా పార్లమెంట్‌ను అడ్డుకుంటున్న సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు, మంత్రులు ఎలాంటి వ్యూహం అనుసరించాలనే దానిపై మల్లగుల్లాలు పడుతున్నారు. దీనిపై సమావేశమైన ఎంపీలు ఏకాభిప్రాయానికి రాలేకపోయారు. దీంతో ఎవరికి వారే యమునా తీరు అన్న చందంగా ప్రవర్తిస్తున్నారు.
తమ తమ ప్రాంత ప్రయోజనాల మేరకు సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు వ్యవహరిస్తున్నారు. తాజాగా సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు, మంత్రులు ఈరోజు ఉదయం ఎంపీ లగడపాటి రాజగోపాల్ నివాసంలో సమావేశమయ్యారు. సమైక్యాంధ్ర ఉద్యమం, భవిష్యత్ కార్యాచరణ, పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తున్నారు.
మరోవైపు కర్నూలు జిల్లా నేతలు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అపాయింట్మెంట్ కోరారు. విభజనతో రాయలసీమకు తలెత్తే సమస్యలను వీరు ఈ సందర్భంగా ప్రధానికి వివరించనున్నట్లు సమాచారం. కేంద్రమంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో రాయలసీమ నేతలు నిన్న సోనియాగాంధీని కలిసిన విషయం తెలిసిందే. కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, ఎంపీ ఎస్పీవై రెడ్డి, రాష్ట్ర న్యాయ శాఖ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి పార్టీ అధినేత్రితో సమావేశమై విభజన తప్పదంటే రాయలసీమను ప్రత్యేక రాష్ట్రం చేయాలని కోరారు.