సాక్షి, కర్నూలు: జిల్లా అంతటా సమైక్య పోరు తీవ్రరూపం దాలుస్తోంది. ఏడో రోజు మంగళవారం కూడా ఆందోళనలు సరికొత్త పంథాలో నిర్వహించారు. నిరసన రూపాలు వేరైనా.. అందరూ సమైక్య వాదాన్ని భుజానికెత్తుకున్నారు.
కర్నూలులో ఉద్యోగులు విధులు బహిష్కరించి సమైక్యాంధ్రకు మద్దతుగా నడుం బిగించారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా విద్యార్థులు ర్యాలీలతో హోరెత్తించారు. వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. ఆర్టీసీ బస్సులు అధిక శాతం డిపోలకే
పరిమతమయ్యాయి. సమైక్యాంధ్ర జేఏసీ పీలుపులో భాగంగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో 18, 44వ జాతీయ రహదారులను దిగ్బంధించారు. పార్టీ జిల్లా కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి.. కర్నూలు, పాణ్యం, కోడుమూరు నియోజకవర్గాల సమన్వయకర్తలు ఎస్వీ మోహన్‌రెడ్డి, గౌరు చరితారెడ్డి, మణిగాంధీలు తుంగభద్ర బ్రిడ్జిపై బైఠాయించి నిరసన తెలిపారు.
ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు రహదారిపైనే వంటావార్పు నిర్వహించి అక్కడే సహపంక్తి భోజనాలు చేశారు. ఆదోనిలో షరామామూలుగా ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. సోనియా, కేసీఆర్, ముఖ్యమంత్రి కిరణ్, బొత్స సత్యనారాయణకు వ్యతిరేకంగా ఆందోళనలు మిన్నంటాయి. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, రాజకీయ జేఏసీ ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ, నిరసన ఊరేగింపు, రాస్తారోకోలు చేపట్టారు. ఎమ్మెల్యే మీనాక్షినాయుడు, మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి కూడా సైకిల్ మోటర్ల ర్యాలీలో పాల్గొన్నారు.
పభుత్వ, మున్సిపల్ ఉద్యోగులు విధులు బహిష్కరించి నల్ల బ్యాడ్జీలు ధరించి ఆందోళన కార్యక్రమాల్లో పాల్పంచుకున్నారు. ఆళ్లగడ్డ పట్టణంలో నాయీబ్రహ్మణులు, తలారులు, ఉద్యోగుల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ కొనసాగింది. మండల కేంద్రమైన ఆలూరులో జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యమకారులు సమైక్యాంధ్రను కోరుతూ అర్ధనగ్న ప్రదర్శన చేశారు. ఆస్పరిలో రాష్ట్రాన్ని సమైక్యాంగానే ఉంచాలని కోరుతూ రెవెన్యూ ఉద్యోగులు సామూహిక సెలవు ప్రకటించారు. ఆత్మకూరు పట్టణంలో తెలంగాణకు నిరసనగా నాయీబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో మౌన ప్రదర్శన నిర్వహించారు. వెలుగోడు పట్టణంలోని పొట్టిశ్రీరాములు సెంటర్‌లో తెలంగాణకు నిరసనగా ఎంపీడీఓ, తహశీల్దార్, గ్రామపంచాయతీ ఉద్యోగులు రాస్తారోకో నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. కోడుమూరులో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు తరగతులు బహిష్కరించి కోట్ల సర్కిల్‌లో ఆందోళన చేపట్టారు. మెడికల్ షాప్స్ అసోసియేషన్, ఆర్‌ఎంపీ వైద్యుల అసోసియేషన్, వర్క్ చార్జ్‌డ్ ఎంప్లాయీస్ యూనియన్, విద్యుత్ కార్మికుల అసోసియేషన్‌ల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించి సోనియాగాంధీ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. నంద్యాలలో హిజ్రాలు ర్యాలీ నిర్వహించారు. ఏపీఎన్‌జీఓలు అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లి తాళాలు వేశారు. ఎమ్మిగనూరులో ఏపీ ఎన్‌జీవోస్, ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో వివిధ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు, ఉద్యోగులు పట్టణంలో భారీ ర్యాలీ చేపట్టారు.
అనంతరం శివ సర్కిల్‌లో గంటపాటు బైఠాయించి నిరసన తెలిపారు. సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతుగా స్థానిక సిటికేబుల్ నిర్వాహకులు వినోద చానల్స్ ప్రసారాలను పూర్తిగా నిలిపేశారు. ఇదిలాఉండగా కోవెలకుంట్ల మండలంలో నిర్వహించిన ఇఫ్తార్ విందుల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే చల్లా రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. కుమారుడు రాహుల్‌ను ప్రధానిని చేసేందుకే సోనియాగాంధీ విభజనకు శ్రీకారం చుట్టారని విమర్శించడం గమనార్హం.
దిగ్బంధం
Published Wed, Aug 7 2013 3:28 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement
Advertisement