
జిల్లాల జగడం
* ములుగులో కాంగ్రెస్ నేత ఆత్మహత్యాయత్నం
* సిరిసిల్లలో కేటీఆర్ ఇంటి ముట్టడి
నెట్‌వర్క్: కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ వేగవంతమైన తరుణంలో మా ప్రాంతాన్నీ జిల్లా చేయాలంటూ శుక్రవారం ఆందోళనలు ఉధృతమయ్యాయి. వరంగల్ జిల్లాలోని జనగామ, ములుగులను జిల్లాలుగా చేయాలని ఆయా జిల్లా సాధన సమితిల ఆధ్వర్యంలో రోడ్లపైకి వచ్చారు. ఆదిలాబాద్ జిల్లాలో నిర్మల్‌ను తమ నుంచి వేరు చేయవద్దని, నిర్మల్ జిల్లా వద్దనే డిమాండ్ వినిపించారు. కరీంనగర్ జిల్లా సిరిసిల్లలోనూ ఆందోళన జోరు పెంచారు. జనగామలో జేఏసీ చైర్మన్ ఆరుట్ల దశమంతరెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన జాతీయ రహదారుల దిగ్బధం ఉద్రిక్తతకు దారితీసింది.
టీఆర్‌ఎస్ శ్రేణులు సైతం ఆందోళనలో పాల్గొన్నాయి. మున్సిపల్ చైర్‌పర్సన్ గాడిపెల్లి ప్రేమలతారెడ్డి ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో మహిళలు వచ్చారు. పోలీసులు, పారామిలటరీ బలగాలు పెద్ద ఎత్తున మోహరించాయి. గురువారం అర్ధరాత్రి నుంచే జనగామను తమ అధీనంలోకి తీసుకున్నారు. తెల్లవారుజామున 3.30కే జేఏసీ నాయకుల ఇళ్లకు వెళ్లి నిద్ర లేపి మరీ అరెస్టు చేశారు. ఆగ్రహం చెందిన ఉద్యమకారులు, మహిళా సంఘాల వారు 144 సెక్షన్‌ను ధిక్కరిస్తూ రహదారుల పైకి వచ్చారు. ప్రధాన చౌరస్తాలో బైఠాయించి రాస్తారోకో చేశారు. 200 మంది మహిళలు బోనాలతో తరలివచ్చి ఆందోళన చేయగా, పోలీసులు వారిపై దురుసుగా ప్రవర్తించారు.
దీంతో పలువురు వృద్ధులు ఎస్సై రవీందర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పెంబర్తిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా విద్యార్థి విభాగం నాయకులు బాల్దె మహేందర్ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. సూర్యాపేట రహదారిలో జనగామ డిపో ఆర్టీసీ బస్సు అద్దాలను ఆందోళనకారులు ధ్వంసం చేశారు. అక్రమ అరెస్ట్‌లు, ఎస్సై రవీందర్ తీరును నిరసిస్తూ శనివారం జనగామ బంద్‌కు పిలుపునిస్తున్నట్లు జేఏసీ నాయకులు తెలిపారు. ఇదే జిల్లాలోని ములుగును జిల్లాగా చేయాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం, జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో జాతీయ రహదారిని దిగ్బంధించారు.
కాంగ్రెస్ నియోజకవర్గ అధికార ప్రతినిధి అహ్మద్‌పాషా ధర్నా వద్ద ఒంటికి నిప్పంటిం చుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. పోలీసులు అడ్డుకుని ఆస్పత్రికి తరలించారు. ఆదిలాబాద్ జిల్లాలోనే నిర్మల్‌ను కొనసాగించాలని ఆదిలాబాద్ జిల్లా సంరక్షణ సమితి సభ్యులు శుక్రవారం ఆదిలాబాద్‌లో శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్‌ను ఘెరావ్ చేశారు. ఆయన కాన్వాయ్ ఎదుట బైఠాయించారు. విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తానని మండలి చైర్మన్ హామీ ఇచ్చారు. కరీంనగర్ జిల్లాలోని సిరిసిల్ల జిల్లాను ప్రతిపాదించి.. ఆ తర్వాత రద్దు చేయడంపై ప్రజలు, వివిధ పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు భగ్గుమన్నారు.
ప్రజాసంఘాలు, న్యాయవాదులు, రాజకీయ పార్టీలు, ముస్లింలు మహాధర్నా, రాస్తారోకో చేపట్టారు. మంత్రి కేటీఆర్ ఇంటిని బీజేపీ, బీజేవైఎం, ప్రజాసంఘాలు ముట్టడించాయి. సిరిసి ల్ల జిల్లా కోసం ఐదు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న అర్బన్ బ్యాంక్ చైర్మన్ గాజుల బాల య్య ఆరోగ్యం క్షీణించడంతో పోలీసులు తెల్లవారుజామున దీక్షను భగ్నం చేశారు. ఇదే జిల్లాలోని హుస్నాబాద్ మండలాన్ని సిద్దిపేటలో కలపాలనే నిర్ణయూన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనలు మిన్నంటాయి. కోహెడ మండలాన్ని సిద్దిపేటలో కలపాలన్న నిర్ణయూన్ని ఉపసంహరించుకోవాలని ఆందోళన నిర్వహించారు.