
ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించిన పార్టీ కార్యకర్త రంగస్వామి , కత్తితో చేయి కోసుకొని నిరసన వ్యక్తం చేస్తున్న పార్టీ కార్యకర్త బాలరాజు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థుల జాబితా ప్రకటనకు ముందే లొల్లి మొదలైంది. ఆశావహులు, పొత్తుల్లో భాగంగా సీట్లు కోల్పోతున్న నేతలు గాంధీ భవన్ ఎదుట క్యూ కట్టి నిరసనలు తెలుపుతున్నారు. ఆదివారం శేరిలింగంపల్లి, పెద్దపల్లి నియోజకవర్గాలకు చెందిన నేతలు వందలాది మంది కార్యకర్తలతో వచ్చి గాంధీ భవన్ వద్ద ధర్నాలు చేయగా శేరిలింగంపల్లికి చెందిన యువజన కాంగ్రెస్ నాయకుడు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేయడం ఉద్రిక్తతకు దారి తీసింది.
పెద్దపల్లి నియోజకవర్గానికి చెందిన బీసీ నాయకులు, కార్యకర్త లు కూడా ఆ స్థానాన్ని బీసీలకు ఇవ్వాలంటూ గాంధీ భవన్ ఎదుట ధర్నా చేయడం, స్థానికులకే అవకాశమివ్వాలంటూ మిర్యాలగూడలో కాంగ్రెస్ కీలక నేత జానారెడ్డిని గిరిజన నేతలు నిలదీయడం చూస్తుంటే కాంగ్రెస్ జాబితా ప్రకటన తర్వాత ఏం జరుగుతుం దోననే ఆందోళన పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది.
మధ్యాహ్నం 12 గంటల నుంచి...
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోకి వచ్చే శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని పొత్తుల్లో భాగంగా టీడీపీకి ఇస్తున్నట్లు సమాచారం రావడంతో మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్ పెద్ద ఎత్తున అనుచరగణంతో ఆదివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో గాంధీ భవన్‌కు చేరుకున్నారు. శేరిలింగంపల్లిని టీడీపీకి ఇవ్వొద్దని నినాదాలు చేస్తూ వందలాది మంది కార్యకర్తలు గాంధీ భవన్ మెట్లపై ధర్నా చేశారు. ఈ సందర్భంగా భిక్షపతి యాదవ్ మాట్లాడుతూ, ఎంతో కష్టపడి నియోజకవర్గంలో పార్టీని పటిష్టం చేసుకున్నామని, ఇప్పుడు టీడీపీకి ఇవ్వాలనుకోవడం తమను మనస్తాపానికి గురిచేస్తోందన్నారు. టీడీపీకి ఆ సీటు ఇస్తే కలసికట్టుగా ఓడిస్తామన్నారు.
ఇదే సమయం లో గచ్చిబౌలి డివిజన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కె.రంగస్వామి గాంధీ విగ్రహంపైకి ఎక్కి నినాదాలు చేస్తూ పెట్రోల్ పోసుకోవడంతో కార్యకర్తలు వెంటనే ఆయన్ను కిందకు దింపి ఒంటిపై నీళ్లు పోశారు. ఆ తర్వాత బాలరాజు అనే కార్యకర్త కత్తితో తన చేతిని కోసుకుని నిరసన తెలిపాడు. శేరిలింగంపల్లి కార్యకర్తలు సాయంత్రం వరకు దర్నా చేశారు. సాయంత్రం 5:30 సమయంలో ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కీ గౌడ్ ఆందో ళనకారుల వద్దకు చేరుకుని పొత్తుల సీట్ల పంపకాల విషయం ఇంకా ఖరారు కాలేదని, కోర్ కమిటీ సమావేశం తర్వాతే ఏ స్థానం ఎవరికి ఇస్తారో తేలుతుందని, ఎవరూ ఆవేశపడొద్దని నచ్చజెప్పారు.
శేరిలింగంపల్లిలో కాంగ్రెస్సే పోటీ చేస్తుందని, తాను రాహుల్‌తో మాట్లాడతానని భిక్షపతి యాదవ్, ఆయ న అనుచరులకు చెప్పారు. యాష్కీపై తనకు గౌరవం ఉందన్న భిక్షపతి.. తన ఆందోళన విరమించారు. పెద్దపల్లి నియోజకవర్గానికి చెందిన బీసీ నేతలు చేతి ధర్మయ్య, ఈర్ల కొమురయ్యల ఆధ్వర్యంలో దాదాపు 200 మంది కార్యకర్తలు గాంధీభవన్‌కు వచ్చి ఆ స్థానాన్ని బీసీలకు కేటాయించాలని ఆందోళన చేశా రు. 25 ఏళ్లుగా పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో ఒక్క అసెంబ్లీ స్థానాన్నీ బీసీలకు ఇవ్వలేదని, ఈసారి పెద్దపల్లి సీటును బీసీలకే ఇవ్వాలని నినదించారు.
జానాకూ తప్పని ‘సెగ’
మిర్యాలగూడ నియోజకవర్గం విషయంలో టీపీసీసీ కీలక నేత జానారెడ్డికి కూడా నిరసన సెగ తగిలింది. టికెట్ గిరిజనులకే కేటాయించాలం టూ శనివారం మిర్యాలగూడకు వెళ్లిన ఆయన్ను స్థానిక నేతలు నిలదీశారు. తన చేతిలో ఏమీ లేద ని, అధిష్టానం టికెట్లు ఖరారు చేస్తుందని చెప్పినా కార్యకర్తలు వినకుండా నిరసన తెలపడంతో అసహనానికి గురైన జానా సమావేశం నుంచి మధ్యలోనే వెళ్లిపోయారు. మొత్తంమీద టికెట్ల ప్రకట నకు ముందే ఆందోళనలు ప్రారంభం కావడం పార్టీ వర్గాల్లో గుబులు పుట్టిస్తోంది.