
సాక్షి, యాదాద్రి : కాంగ్రెస్ ఆశావహుల్లో తీవ్ర ఉత్కంఠ. నవంబర్1వ తేదీన తొలి విడత అభ్యర్థుల జాబితా ప్రకటిస్తామని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో ఆశావహుల్లో మరింత ఆతృత నెలకొంది. టికెట్ కోసం గాంధీభవన్ నుంచి ఢిల్లీ దాకా తాము చేసిన ప్రయత్నాలు ఏమేరకు ఫలిస్తాయోనని వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. తమ రాజకీయ భవిష్యత్‌కు పునాది పడే అత్యంత ప్రధానాంశమైన టికెట్ల కేటాయింపుపై ఆశావహులు అన్ని అవకాశాలను వినియోగించుకున్నారు. తమ బలబలాలను వివరించడంతోపాటు పార్టీలోని ప్రత్యర్థులపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందించారు.ఎవరికి వారు చేసిన ప్రయత్నాలన్నీ నెరవేరిన పక్షంలో టికెట్ తమకే వస్తుందన్న ధీమాలో ఉన్నారు.
సర్వత్రా చర్చ
కాంగ్రెస్‌లో టికెట్లు ఎవరికి వస్తాయోనని అధికార పార్టీ, మహాకూటమి భాగస్వామ్య పక్షాలు, సా మాన్య జనంలోనూ తీవ్ర చర్చ జరుగుతోంది. తొలి విడత ఉమ్మడి జిల్లాలో ఏడు నుంచి ఎనిమిది స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందని ఆపార్టీ నాయకుడొకరు చెప్పారు. టీఆర్‌ఎస్ అభ్యర్థులు ఇప్పటికే ప్రచారం లో దూసుకుపోతుండగా.. మహాకూటమి సీట్ల పొత్తులే జరగకపోవడంతో అంతా చప్పగా ఉందన్న అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది. ఈ తరుణంలో మరో రెండు రోజుల్లో కాంగ్రెస్ జాబితా వచ్చే అవకాశం ఉండడంతో సర్వత్రా ఆసక్తిని రేకిత్తిస్తోంది.
సీటు ఎవరికి వస్తుంది..?
ఇదిలా ఉండగా యాదాద్రి భువనగిరి జిల్లా పరిధి లోకి వచ్చే భువనగిరి, ఆలేరు, తుంగతుర్తి, మునుగోడు, నకిరేకల్ నియోజకవర్గాల్లో మహాకూటమిలో ఎవరికి సీట్లు వస్తాయి, అభ్యర్థులు ఎవరు కాబోతున్నారనే విషయంపై పందేలకు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది.
అభ్యర్థుల ప్రకటనపై ఆసక్తి
జిల్లాలో కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటనపై తీవ్ర ఆసక్తి నెలకొంది. నవంబర్ 12నుంచి నామినేషన్ల ఘట్టం ప్రారంభంకానుంది. ఈనేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తరఫున టికెట్‌లు ఆశించిన ఆశావహుల ఇంకా చివరి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అ యితే సీట్ల ఎంపిక కోసం అధిష్టానం పంపిన భక్తచరణ్‌దాస్ కమిటీ ఇప్పటీకే అభ్యర్థుల పేరు దాదాపు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఇక్కడ ఎంపిక చేసిన జాబితాను ఏఐసీసీకి పంపించారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఆమోద ముద్ర నేడో, రేపో పడగానే వెంటనే అభ్యర్థుల జాబితా ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.
మహాకూటమి సీట్లు ఎవరికో..?
కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేఎస్‌లతో కూడిన మహాకూటమి జిల్లాలో సీట్ల కోసం పట్టుబడుతున్నాయి. ప్రధానంగా భువనగిరి, ఆలేరు, మునుగోడు నియోజకవర్గాల్లో తమకంటే తమకే కేటాయించాలని ఆయా పార్టీలు కోరుతున్నాయి. మహాకూటమి చర్చలు జరుగుతున్న నేపథ్యంలో కూటమి పక్షాలు కోరిన విధంగా సీట్ల కేటాయింపు ఉంటుందా అనే కోణంలో చర్చ జరుగుతోంది. అయితే జిల్లాలో కూటమికి కేటాయించే సీట్ల విషయంలో స్పష్టత ఇంకా రాలేదని తెలుస్తోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించడానికి జాబితాను సిద్ధం చేసింది.
అధికార పార్టీలో ఉత్కంఠ
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ప్రకటన వెలువడనున్న నేపథ్యంలో అధికార పార్టీలో తీవ్ర ఆసక్తి నెలకొంది. అన్ని నియోజకవర్గాల్లో సీట్లు మహాకూటమి భాగస్వామ్య పక్షాల్లో ఏ పార్టీకి, ఎవరికి దక్కనున్నాయి అనే విషయంపై పార్టీ కేడర్‌తో చర్చిస్తున్నారు. భువనగిరి, ఆలేరు, మునుగోడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి టికెట్‌లు వస్తాయా లేక కూటమి పక్షాలకు సీట్లు కేటాయిస్తారా.. అనే విషయంపై సుదీర్ఘ చర్చలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చే అభ్యర్థులు ఎవరైతే తమకు ఏమేరకు పోటీ ఉంటుందో చర్చిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కాకుండా మహాకూటమి పక్షాలకు సీట్లు కేటాయిస్తే ఆయా పార్టీల నుంచి పోటీ చేసే అభ్యర్థులపై అంచనాలు వేస్తున్నారు. ఏ పార్టీ అభ్యర్థి రంగంలో ఉంటే తమ విజయావకాశాలు ఎలా ఉంటాయన్న కోణంలో సుదీర్ఘ మంతనాలు చేస్తున్నారు. ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ టికెట్ల కేటాయింపు జిల్లాలో హాట్ టాఫిక్‌గా మారింది.
Comments
Please login to add a commentAdd a comment