హైదరాబాద్: కేంద్రంలో మంత్రి స్థానంలో ఉన్న చిరంజీవికి రాష్ట్ర అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా తెలియదని సీమాంధ్ర ఉద్యోగ సంఘాల జేఏసీ విమర్శించింది. ఏపీఎన్జీవోలు రాజీనామాలు చేయాలని చిరంజీవి డిమాండ్ చేసిన నేపథ్యంలో సీమాంధ్ర ఉద్యోగులు మండిపడ్డారు. ఆయనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయో కూడా తెలియదని ఎద్దేవా చేశారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన రెండవ రోజునే లక్ష మందితో ముట్టడిస్తామని ఉద్యోగ సంఘ జేఏసీ హెచ్చరించింది. డిసెంబర్ 9వ తేదీని విద్రోహదినంగా ప్రకటిస్తామని తెలిపింది.
చిరంజీవి రాజీనామా చేసిన మరుక్షణమే తాను కూడా రాజీనామా చేస్తానని అశోక్ బాబు సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. సీమాంధ్ర ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేసిన మరుక్షణమే విభజన ఆగిపోతుందని సీమాంధ్ర ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు.