
బంద్ విజయవంతం
రగిలిన గుండెలు!
అరవై ఏళ్ల అనుబంధం తెగిందన్న బాధ, తమ నేల రెండుగా చీలిందన్న ఆవేదన, సొంత మనుషులు పరాయి రాష్ట్రం వారయ్యారన్న దుఃఖం...విద్య, వైద్యం, ఉద్యోగం, నీళ్లు వీటన్నింటినీ తమకు అందకుండా చేస్తున్నారన్న ఆక్రోశం, మీ వెంటే ఉంటాం, మీ మనోభావాలను నెరవేరుస్తామని కల్లబొల్లి కబుర్లు చెబుతూ చివరకు గుండెల్లో గునపాలు దింపారన్న ఆగ్రహం ఇవన్నీ ఒక్కసారిగా కట్టలు తెంచుకున్నాయి. నిరసన జ్వాలలు మిన్నంటాయి. యూపీఏ తీరుకు వ్యతిరేకంగా జిల్లా వ్యాప్తంగా బుధవారం ఆందోళనలు నిర్వహించారు. అన్ని వర్గాల ప్రజలు రోడ్ల మీదకు వచ్చి కేంద్ర ప్రభుత్వం, సోనియా గాంధీపై దుమ్మెత్తి పోశారు. తమ పోరాటాలు ఫలించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమను మోసం చేసిన వారికి భవిష్యత్‌లో తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. అన్ని వర్గాల ప్రజలు పాల్గొని జిల్లా బంద్‌ను విజయవంతం చేశారు.
విజయనగరం కంటోన్మెంట్, న్యూస్‌లైన్:
లోక్‌సభలో తెలంగాణ బిల్లును ఆమోదించటాన్ని నిరసిస్తూ బుధవారం జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేశారు. యూపీఏ సర్కారు తీరును నిరసిస్తూ వైఎస్‌ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పిలుపుమేరకు అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. పలువురు సమైక్యవాదులు తెల్లవారేసరికి రహదారులపైకి వచ్చి ఆర్టీసీ సర్వీసులను అడ్డుకున్నారు. జిల్లాలోని తొమ్మిది నియోజకవర్గాల్లో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు బంద్ చేపట్టా రు. వైఎస్‌ఆర్ సీపీతో పాటు టీడీపీ, విశాలాంధ్ర జేఏసీ కూడా బంద్‌కు పిలుపునిచ్చాయి. జిల్లావ్యాప్తంగా సుమారు వంద సర్వీసులు నిలిచిపోయినట్టు ఆర్టీసీ అధికారులు తెలిపారు. చాలా వరకు దుకాణాలు మూతపడగా తెరిచి ఉన్న వాటిని బంద్ చేయించారు. ఉత్తరాంధ్రలోనే ప్రసిద్ధిగాంచిన బాలాజీ వస్త్ర వ్యాపార సముదాయంలో ఉన్న 250 దుకాణాలను స్వచ్ఛందం గా మూసివేశారు. దీంతో రాష్ట్రేతర ప్రాంతాల నుంచి వచ్చిన వర్తకులు ఇబ్బందులు పడ్డారు. జాతీయ, రాష్ట్రీయ బ్యాంకులు మూతపడగా అక్కడక్కడా తెరిచి ఉన్న బ్యాంకులను నిరసన కారులు మూసివేయించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థ లు, సినిమా హాళ్లు మూతపడ్డాయి. పలు ప్రాంతాల్లో విద్యార్థులు స్వచ్ఛందంగా రహదారులపైకి వచ్చి నిరసన వ్యక్తం చేశారు. ఏపీఎన్జీఓలు సమ్మెలో ఉండడంతో ప్రభుత్వ కార్యాలయాలు వెలవెలబోయాయి. విజయనగరం మున్సిపల్ కార్యాలయ ఉద్యోగులు స్వచ్ఛందంగా బంద్ పాటించారు.
తెలుగు వారి మధ్య విభజన చిచ్చు రేపి, అభివృద్ధికి అవరోధంగా నిలిచిన కేంద్ర ప్రభుత్వం తీరును నిరసిస్తూ విశాలాంధ్ర మహాసభ ఆధ్వర్యంలో బంద్ చేపట్టారు. ఈ సందర్భంగా ఉదయం ఆరు గంటల నుంచే మహాసభ ప్రతినిధులు విజయనగరం పట్టణంలోని ప్రధాన జంక్షన్‌లలో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. కేంద్ర పెద్దల తీరును నిరసిస్తూ నినాదాలు చేశారు. ఇందులో భాగంగా స్థానిక మయూరి జంక్షన్ వద్ద రహదారికి అడ్డంగా బైఠాయించి రాస్తారోకో చేశారు. అనంతరం అక్కడ నుంచి బయలుదేరి ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద బస్సులు తిరగకుండా అడ్డుకున్నారు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద సోనియా దిష్టిబొమ్మను దహనం చేయడంతో పాటు పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. తెలుగుజాతి విభజన రాక్షసి సోనియా అంటూ రాష్ర్ట విభజనకు నిరసనగా పట్టణంలోని పన్నీరువారి వీధిలో గల వివేకభారతి పాఠశాల చిన్నారులు బుధవారం వినూత్న రీతిలో నిరసన తెలిపా రు. నెల్లిమర్లలో టీడీపీ ఆధ్వర్యంలో విజయనగరం పాలకొండ రహదారిలో టైర్లు తగలపెట్టి వాహనాల రాకపోకలు అంతరాయం కలిగించడంతో పాటు మోకాళ్లపై నిల్చొని నిరసన వ్యక్తం చేశారు. స్థానిక సీకేఎంజీజే కళాశాల ఆవరణలో ఉన్న ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు రాస్తారోకో చేశారు.
పాచిపెంట మండలం పణుకువలసలో చైతన్య బీఈడీ కళాశాల విద్యార్థులు 26వ జాతీయ రహదారిపై రాస్తారోకో చేసిన నిరసన వ్యక్తం చేశారు. గంట్యాడ మండల కేంద్రంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు మానవహారం నిర్వహించి నిరసన వ్యక్తం చేసిన అనంతరం ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలను మూసివేయించారు. గరుగుబిల్లి మండల కేంద్రంలో టీడీపీ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఎస్.కోట నియోజకవర్గంలో రాస్తారోకో నిర్వహించి సోనియా దిష్టిబొమ్మను దహనం చేయగా చీపురుపల్లి, పార్వతీపురం నియోజకవర్గాల్లో టీడీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేశారు.