ఎన్ని నెలలైనా సమ్మె కొనసాగిస్తాం
* ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు స్పష్టీకరణ
* ‘ఆంధ్రుల పౌరుషం’ పేరిట హైదరాబాద్‌లో సమావేశం
శ్రీకాకుళం, న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర కోసం ఎన్ని నెలలైనా సమ్మె కొనసాగిస్తామని ఏపీ ఎన్జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌బాబు స్పష్టం చేశారు. సోమవారం శ్రీకాకుళం జిల్లాలో పర్యటించిన ఆయన శ్రీకాకుళం వైఎస్‌ఆర్ కూడలిలో నిర్వహించిన ధర్నా, బహిరంగ సభల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సీమాంధ్రలు చేస్తున్న ఉద్యమ సెగ ఢిల్లీని తాకిందన్నారు. ఎన్ని నెలలైనా ఉద్యమం కొనసాగించడానికి ఎన్జీవోలు మానసికంగా సిద్ధమయ్యారని వెల్లడించారు.
‘ఆంధ్రుల పౌరుషం’ పేరుతో హైదరాబాద్‌లో సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్రం కోరుకోవడంలేదని, రాజకీయ నాయకులు మాత్రమే స్వార్థం కోసం రాష్ట్రం కావాలంటున్నారని విమర్శించారు. రాష్ట్రంలోని అన్నిప్రాంతాల ప్రజలకు హైదరాబాద్‌తో విడదీయరాని బంధం ఉందన్నారు. ప్రభుత్వం ఉద్యోగులను భయపెట్టే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ‘ఎస్మా’కు భయపడాల్సిన పని లేదని స్పష్టం చేశారు. సమైక్యవాదానికి మద్దతు ఇచ్చిన పార్టీలు, నాయకులనే వచ్చే ఎన్నికల్లో గెలిపించుకుంటామన్నారు.
సమైక్యాంధ్రకు మద్దతు తెలపని రాజకీయ నాయకులకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని అశోక్‌బాబు అభిప్రాయపడ్డారు. ఏపీ ఎన్జీవో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్.చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ.. ఏ ఉద్యమమైనా తొలుత ప్రారంభమయ్యేది శ్రీకాకుళం నుంచేనని పేర్కొన్నారు. ప్రపంచంలో, దేశంలో ప్రత్యేక స్థానమున్న ఆంధ్రప్రదేశ్‌ను రెండుగా చీల్చాలని చూడడం భావ్యం కాదన్నారు. హైదరాబాద్ అభివృద్ధి కోసం అన్ని వర్గాల ప్రజలు తమ రక్తాన్ని ధారపోశారని చెప్పారు. ఈ నేపథ్యంలో అన్ని వర్గాల ప్రజల అభిప్రాయం తెలుసుకున్నాకే విభజన నిర్ణయం తీసుకోవాలని సూచించారు.
ఎంపీలు, ఎమ్మెల్యేలు స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రస్తుత దొంగ రాజీనామాలు, మీడియాలో ఫోజులివ్వటం వల్ల లక్ష్యం సాధించలేమని స్పష్టం చేశారు. మీడియా, తెలంగాణల్లో గుర్తింపు కోసమే ఎంపీ వి.హనుమంతరావు తిరుపతిలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని విమర్శించారు. ఈ సమావేశంలో ఎన్జీవో సంఘం రాష్ర్ట సహాధ్యక్షుడు చౌదరి పురుషోత్తంనాయుడు, జిల్లా అధ్యక్షుడు హనుమంతు సాయిరాం, పలు సంఘాల ప్రతినిధులు, జేఏసీ సభ్యులు పాల్గొన్నారు.
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో నేటి నుంచి విధులు బంద్
విజయవాడ, న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నట్లు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఉద్యోగులు స్పష్టంచేశారు. ఇందులో భాగంగా నేటి నుంచి పూర్తిగా విధులు బహిష్కరించనున్నట్టు ఉద్యోగ సంఘాల నాయకులు ప్రకటించారు. దీంతో మంగళవారం నుంచి జరగాల్సిన ఎంఎస్సీ మెడికల్ (ఫస్ట్, సెకండియర్) పరీక్షలను అధికారులు వాయిదా వేశారు.
యునానీ డిగ్రీ ప్రవేశ పరీక్ష ఫలితాల వెల్లడి, పారా మెడికల్ (నర్సింగ్, ఎంఎల్‌టీ, ఫిజియోథెరపీ) కోర్సుల ప్రవేశాల నోటిఫికేషన్, ఎంబీబీఎస్/బీడీఎస్ సెకండ్ కౌన్సెలింగ్ ప్రక్రియ, ఆయుర్వేద, హోమియో, నేచురోపతి కోర్సుల ప్రవేశాల నోటిఫికేషన్ మొదలైన వాటిని ఈ నెలాఖరు వరకు వాయిదా వేసినట్లు వర్సిటీ అధికారులు తెలిపారు. ఎంబీబీఎస్ ప్రాక్టికల్ పరీక్షల మెటీరియల్ ఇప్పటికే ఆయా కళాశాలలకు వెళ్లిన దృష్ట్యా స్థానికంగా ఇబ్బంది లేకపోతే ప్రాక్టికల్స్ జరుపుకోవడానికి ఉద్యోగ జేఏసీ అంగీకరించింది.