శంషాబాద్, న్యూస్‌లైన్: గ్రేటర్ విలీనం నుంచి బయటపడిన శంషాబాద్ పట్టణం త్వరలోనే గ్రేడ్ వన్ మున్సిపాలిటీ హోదాతో కొత్త పరిపాలనలోకి రానుంది. ఇందుకోసం అధికార యంత్రాంగం అన్ని విధాలా సంసిద్ధమైంది. శంషాబాద్ పంచాయతీతో పాటు జిల్లాలోని పలు పంచాయతీలు గ్రేటర్‌లో విలీనానికి వ్యతిరేకంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించి విజయం సాధించడంతో వాటి భవిష్యత్తు ప్రస్తుతం సర్కారు చేతిలో ఉంది. వీటిని నగర పంచాయతీలు, మున్సిపాలిటీలుగా మార్చడానికి ముఖ్యమంత్రి సైతం సుముఖత వ్యక్తం చేయడంతో ప్రభుత్వ యంత్రాంగం ఆ దిశగా ముందుకు కదులుతోంది.
వనరులే కీలకం..
మున్సిపాలిటీ పరిపాలన కూడా దాదాపు స్థానికంగా సమకూర్చుకునే వనరులపైనే ఆధారపడుతుంది. శంషాబాద్ పట్టణంలో సుమారు నలభై వేల జనాభా ఉంది. నిత్యం రాకపోకలు సాగించే జనాభా అధికంగా ఉంటుంది. దీంతో పట్టణంలో అన్ని విధాల సౌకర్యాలు సమకూర్చాల్సిన బాధ్యత స్థానిక పరిపాలన యంత్రాంగంపై ఆధారపడి ఉంటుంది. స్థానికంగా ఉన్న ఆదాయ వనరుల్లో ఇంటిపన్నులు, ట్రేడ్ లెసైన్స్‌లు, వాణిజ్య ప్రకటన లఆదాయంతో పాటు రిజిస్ట్రేషన్‌ల ద్వారా వచ్చే ట్రాన్స్‌ఫర్ డ్యూటీలూ ఉన్నాయి. ఇంటి పన్నులు సుమారు కోటి రూపాయల డిమాండ్ ఉండగా గృహనిర్మాణాల అనుమతులు, వాణిజ్య వ్యాపార సంస్థల లెసైన్స్‌లు, ప్రకటన బోర్డుల ద్వారా సుమారు రూ.50లక్షల ఆదాయాన్ని పంచాయతీ సమకూర్చుకునే అవకాశం ఉంది. గ్రేడ్ వన్ మున్సిపాలిటీకి ఉండాల్సిన అన్ని వనరులూ ఉండడంతో పాటు విమానాశ్రయానికి అత్యంత చేరువలో ఉన్నందున దీనిని నగర పంచాయతీగా కాకుండా మున్సిపాలిటీగా మార్చేందుకే ప్రభుత్వ యంత్రాంగం అన్ని విధాలుగా మొగ్గుచూపుతున్నట్లు సమాచారం.
గొడ్డలిపెట్టుగా జీవో 111
జీవో 111 కారణంగా శంషాబాద్‌లో కేవలం జీప్లస్ టూ నిర్మాణాలకు మాత్రమే అనుమతులు మంజూరు చేయడానికి అవకాశం ఉంది. ప్రస్తుతం అది కూడా కేవలం హెచ్‌ఎండీఏ అనుమతి పొందిన లేవుట్‌లు లేదా గ్రామకంఠం స్థలాల్లో మాత్రమే నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేస్తున్నారు. దీంతో శంషాబాద్ పంచాయతీకి భారీగా ఆదాయంలో గండిపడుతోంది. నిబంధనల ప్రకారం అనుమతులు మంజూరు చేయలేని స్థానిక యంత్రాంగం వాటి నుంచి ఆదాయాన్ని కూడా పొందలేక చతికిలపడుతోంది.
పంచాయతీ వద్ద ప్రజాభిప్రాయ సేకరణ రేపు
శుక్రవారం శంషాబాద్ పంచాయతీ కార్యాలయం వద్ద ప్రభుత్వ అధికారులు ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించనున్నారు. ఇందులో శంషాబాద్‌ను నగరపంచాయతీగా చేయడమా లేదా మున్సిపాలిటీగా మార్చడమా అన్న అంశాలపై ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించనున్నారు.
మున్సిపాలిటీగానే శంషాబాద్!
Published Thu, Nov 28 2013 12:57 AM | Last Updated on Tue, Oct 16 2018 6:35 PM
Advertisement
Advertisement