go111
-
హైదరాబాద్‌కు మరో మాస్టర్ ప్లాన్
సాక్షి, హైదరాబాద్: మహానగరం రోజురోజుకు విస్తరిస్తున్న వేళ సరికొత్త మాస్టర్ ప్లాన్ అమలు చేయాల్సిన ఆవశ్యత ఉందని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు వచ్చే 25–30 ఏళ్ల హైదరాబాద్ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఈ మాస్టర్ ప్లాన్‌ను రూపొందిస్తామన్నారు. అంతర్జాతీయ ఏజెన్సీతో వచ్చే 18 నెలల్లో దీనికి రూపకల్పన జరుగుతుందని కేటీఆర్ స్పష్టం చేశారు. 2012–13లో రూపొందించిన మాస్టర్ ప్లాన్ ఇప్పటి హైదరాబాద్ విస్తరణకు ఏమాత్రం సరిపోవటం లేదని, అందులో కొన్ని తప్పులున్న మాట కూడా వాస్తవేనని అన్నారు. అలాగే111 జీవో పరిధిలో పర్యావరణహితమైన మాస్టర్‌ను ప్లాన్‌ను రూపొందిస్తామని చెప్పారు. హెచ్ఐసీసీలో శుక్రవారం జరిగిన క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షోలో ఆయన మాట్లాడారు. 111 జీవో పరిధిలో 1.32 లక్షల ఎకరాల భూములున్నాయని, 135 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉందని..ఇక్కడ సమాంతర అభివృద్ధి జరిగేలా మాస్టర్ ప్లాన్‌ను క్రోడీకరిస్తామని వివరించారు. అలాగే ఈ ఆర్ధిక సంవత్సరం ముగింపు నాటికి రాష్ట్రంలోని 141 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కొత్త మాస్టర్ ప్లాన్లను అమల్లోకి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. కార్మికులకు నైపుణ్య శిక్షణ కేంద్రం.. వలసలను నివారించేందుకు..భవన నిర్మాణ కార్మికులకు ఇక్కడే ఉపాధి లభించేందుకు డెవలపర్లు చొరవ తీసుకోవాలని సూచించారు. కార్మికులకు సంబంధించిన నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేసి శిక్షణ అందించాలని, ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. శిక్షణ అనంతరం జాబ్ గ్యారంటీ అనే నమ్మకాన్ని కలిగిస్తే విదేశాల్లో ఉన్న మన యువత తిరిగి వస్తారని చెప్పారు. పైలెట్ ప్రాజెక్ట్‌గా చేపట్టి రాష్ట్రవ్యాప్తంగా విస్తరిద్దామని తెలిపారు. మరో 300 మిలియన్ గ్యాలన్ల నీటి లభ్యత 27 శాతం హైదరాబాద్ తాగునీటి అవసరాలను ఉస్మాన్ సాగర్, హిమాయత్‌సాగర్ జలాశయాలు తీరుస్తున్నాయి. అయితే గోదావరి, కృష్ణాతో ప్రస్తుతం ఈ జలాశయాలపై ఆధారపడాల్సిన అవసరం లేదని చెప్పారు. వీటి నుంచి మిలియన్ గ్యాలన్ల నీటిని కూడా వాడుకునే పరిస్థితి లేదు. ప్రస్తుతం 600 పైగా మిలియన్ గ్యాలన్ల నీటి లభ్యత ఉంది. గుండ్లపోచంపల్లి, మల్లన్నసాగర్లతో త్వరలోనే మరో 300 మిలియన్ గ్యాలన్ల నీరు అందుబాటులోకి రానుందని కేటీఆర్ వివరించారు. దీంతో ప్రతి ఇంటికీ ఇంకా ఎక్కువ గంటలు నీళ్లు ఇచ్చే పరిస్థితి ఉంటుందని చెప్పారు. డ్రైనేజీ వ్యవస్థ నిర్వహణలో మనం దేశంలోనే ముందుంటామని అన్నారు. ఒక్క చోటే ఉండొద్దు.. నగరం నలువైపులా గృహ సముదాయాలను విస్తరించాలని, ఒక్క ప్రాంతంలోనే కేంద్రీకృతం కాకూడదని కేటీఆర్ సూచించారు. ఒకర్ని చూసి ఒకరు గొర్రెల మందలాగా ఒకేచోట స్థిరపడిపోతున్నారు. హైదరాబాద్‌లో పశ్చిమం వైపు మాత్రమే కాకుండా నలువైపులా అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన జరుగుతోంది. వీటిని డెవలపర్లు వినియోగించుకోవాలన్నారు. ఔటర్ లోపల 148 లింక్ రోడ్లు, 19 ఫ్లైఓవర్లు, అండర్పాస్లున్నాయని.. ఆయా ప్రాంతాలలో సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగిందని కేటీఆర్ చెప్పారు. వీటి చుట్టూ హౌసింగ్ కాలనీలు, స్కూళ్లు, ఆసుపత్రులు, షాపింగ్ మాల్స్‌ను డెవలప్ చేయాలని బిల్డర్లుకు సూచించారు. కొత్త ఏరియాలలో గృహ నిర్మాణాలను ప్లాన్ చేయాలన్నారు. వచ్చే 10–15 ఏళ్ల పాటు హైదరాబాద్ గృహ నిర్మాణ రంగానికి ఢోకా లేదని స్పష్టం చేశారు. రిజిస్ట్రేషన్ చార్జీలు తగ్గించాలి ఓఆర్ఆర్ చుట్టూ 5–6 క్లస్టర్లను ఏర్పాటు చేసి డెవలపర్లకు తక్కువ ధరకు భూములను కేటాయించాలని క్రెడాయ్ హైదరాబాద్ జనరల్ సెక్రటరీ వి.రాజశేఖర్ రెడ్డి కోరారు. దీంతో ఆయా ప్రాంతాలలో రూ.50–60 లక్షల లోపు ధర ఉండే అందుబాటు, మధ్యస్థాయి గృహాలను నిర్మిస్తామని, దీంతో సామాన్యుల సొంతింటి కల మరింత సులువవుతుందని చెప్పారు. మూడు నెలల పాటు రిజిస్ట్రేషన్ చార్జీలను తగ్గించాలని లేదా కనీసం మహిళ పేరిట రిజిస్ట్రేషన్ల చేసే వారికి, అందుబాటు గృహాల రిజిస్ట్రేషన్ చార్జీలను 1–2 శాతం మేర తగ్గించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, లక్ష్మారెడ్డి, నల్లమోతు భాస్కర్ రావు, క్రెడాయ్ తెలంగాణ చైర్మన్ ఆర్వీ రామచంద్రా రెడ్డి, ప్రెసిడెంట్ రామకృష్ణా రెడ్డి, హైదరాబాద్ చాప్టర్ ప్రెసిడెంట్ రామకృష్ణా రావు తదితరులు పాల్గొన్నారు. -
జీవో 111 రద్దు చేస్తే ప్రకృతికి శాపం
బంజారాహిల్స్: హైదరాబాద్‌కు ఒక వరంగా ఉన్న ఉస్మాన్ సాగర్, హిమాయత్సాగర్లకు రక్షణకవచమైన జీవో 111 రద్దు చేస్తే ప్రకృతికి శాపంగా మారుతుందని సేవ్ అవర్ అర్బన్ లేక్స్ కన్వీనర్ లుబ్నా సారావత్ అన్నారు. ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోపోతే పర్యావరణ ప్రేమికులు, చెరువుల పరిరక్షకులు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్ కొద్దిరోజుల క్రితం జీవో 111 రద్దు చేస్తామని, ఇందుకోసం కమిటీ ఏర్పాటు చేశామని ప్రకటించిన నేపథ్యంలో ఆదివారం బంజారాహిల్స్‌లోని లామకాన్‌లో పర్యావరణ ప్రేమికులు, పర్యావరణ ఉద్యమకారులు సమావేశమయ్యారు. లుబ్నా సారావత్ మాట్లాడుతూ జీవో 111 రద్దు నిర్ణయాన్ని, కమిటీని ఉపసంహరించుకోకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని హెచ్చరించారు. రియల్ ఎస్టేట్ కంపెనీలకు దోచిపెట్టడానికే సీఎం ప్రయత్నిస్తున్నారని, ఆయన రియల్ ఎస్టేట్ ఏజెంట్‌గా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అసెంబ్లీలో చెప్పినవన్నీ అబద్ధాలే.. ఉస్మాన్ సాగర్, హిమాయత్‌సాగర్‌లపై అసెంబ్లీలో సీఎం కేసీఆర్ అబద్ధాలు మాట్లాడారని సారావత్ దుయ్యబట్టారు. వీటిని కాపాడుకోకపోతే భవిష్యత్ కాలుష్యమయం అవుతుందని, ప్రతి ఒక్కరూ తమ ఉద్యమానికి మద్దతు పలకాలని విజ్ఞప్తి చేశారు. ఈ రెండు చెరువులు వరదలను ఆపడమే కాకుండా ఎన్నో వనరులకు కేంద్ర బిందువుగా ఉన్నాయని, శక్తి మేర నగరవాసుల దాహార్తి తీరుస్తున్నాయని పేర్కొన్నారు. భూగర్భ జలాలు పెరగడానికి, హైదరాబాద్ చుట్టూ ప్రకృతి విరాజిల్లడానికి కారణమవుతున్నాయన్నారు. సీఎం కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరి మద్దతు కూడగడతామని, ప్రజలకు వీటి అవసరాన్ని గుర్తు చేస్తామని వెల్లడించారు. ఐఏసీటీ విశ్రాంత శాస్త్రవేత్త బాబురావు మాట్లాడుతూ జీవో 111 రద్దు నిర్ణయాన్ని ప్రజలందరూ వ్యతిరేకిస్తున్నారన్నారు. ప్రకృతికి విరుద్ధంగా నిర్ణయాలు తీసుకుంటే, వాటి దుష్పరిణామాలు తట్టుకోలేరన్నారు. ప్రజలందరితో చర్చించిన తర్వాతనే జీవో 111పై నిర్ణయం తీసుకోవాలని సూచించారు. -
TS: ‘జీవో 111’పై మరికొంత సమయం
సాక్షి, హైదరాబాద్: జీవో 111పై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడానికి మరికొంత సమయం పడుతుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. సమగ్రమైన చర్చ, నిర్దిష్టమైన ప్రణాళికల మేరకు దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. ఈ నేపథ్యంలో జీవో 111పై ప్రభుత్వ నిర్ణయాన్ని తెలపడానికి ఇంకా కొంత వ్యవధి ఇవ్వాల్సిందిగా హైకోర్టును కోరాలని సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఆదివారం జరిగిన సమావేశం నిర్ణయించింది. ఇటీవల ఓ కేసు విచారణ సందర్భంగా జీవో 111పై వైఖరి ఏమిటో తెలపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. హైదరాబాద్ నగరానికి నీటి సరఫరా చేసే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జంట జలాశయాలను కాలుష్యం నుంచి రక్షించే ఉద్దేశంతో 10 కిలోమీటర్ల వరకు క్యాచ్మెంట్ ఏరియాను బఫర్ జోన్‌గా ప్రకటించి, ఆ ప్రాంతంలో అన్ని రకాల నిర్మాణాలను నిషేధిస్తూ 1996లో అప్పటి ప్రభుత్వం జీవో నం.111 జారీ చేసింది. తాజాగా ఈ జీవోపై ప్రభుత్వం తీసుకోనున్న నిర్ణయం కోసం బఫర్ జోన్ పరిధిలోని గ్రామాల్లో భూముల యజమానులు, స్థిరాస్తి వ్యాపారులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వాతావరణ సమతూకాన్ని పాటించాలి అంతర్జాతీయ నగరంగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్ పరిసర ప్రాంతాల ప్రజల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని జలాశయాల రక్షణ, అటవీ ప్రాంతాల్లో పచ్చదనం అభివృద్ధి, రియల్ ఎస్టేట్ సంబంధిత నిర్ణయాలు తీసుకోవాల్సిందిగా పురపాలక శాఖ అధికారులను సీఎం ఆదేశించారు. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న లక్ష ఎకరాల అటవీ భూమిని రక్షించడంతో పాటు, అందులో పచ్చదనాన్ని పెంచడానికి తగు చర్యలు తీసుకోవాలని నగర సమగ్ర అభివృద్ధిపై సమీక్ష సందర్భంగా సూచించారు. ఇప్పటికే 11 వేల ఎకరాల్లో విస్తరించి ఉన్న ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జంట జలాశయాలు, కొండ పోచమ్మ సాగర్, మల్లన్న సాగర్ రిజర్వాయర్లలో నీటి నిల్వ ద్వారా హైదరాబాద్ నగరంలోని వాతావరణ పరిస్థితుల సమతూకాన్ని పాటించాలని ఆదేశించారు. రాబోయే తరాలకు మంచి నగరాన్ని ఇవ్వాలి జీవో 111 పరిధిలోని 84 గ్రామాల్లో లక్షా 32 వేల ఎకరాల భూమి 538 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నదని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. ఇది సుమారు జీహెచ్ఎంసీ విస్తరించి ఉన్న ప్రాంతానికి సరి సమానమని చెప్పారు. కాగా హైదరాబాద్‌కు అనుబంధంగా హెచ్ఎండీఏ పరిధిలో విస్తరిస్తున్న ప్రాంతం.. ఇంకొక కొత్త నగరానికి సమానమైన వైశాల్యంతో ఉందని ఈ సందర్భంగా సీఎం పేర్కొన్నారు. ఇంత పెద్ద ప్రాంతాన్ని నిబంధనలకు అనుగుణంగా రూపుదిద్దకపోతే జలాశయాలు, ప్రజలు నివసించే ప్రాంతాలు కాలుష్యం బారినపడే ప్రమాదం ఉందన్నారు. అలాంటి పరి స్థితి రాకుండా ఇప్పటినుండే సమగ్ర ప్రణాళికలతో గ్రీన్జోన్లు, సివరేజ్ మాస్టర్‌ప్లాన్, తాగునీటి వ్యవస్థ, విశాలమైన రోడ్లు తదితర సదుపాయాలతో రాబోయే తరాలకు మంచి నగరాన్ని ఇచ్చే దిశగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇప్పటికే ఉన్న అటవీ ప్రాంతాలను బలోపేతం చేస్తూ, జలాశయాలన్నింటినీ పరిరక్షిస్తూ, ఒక చక్కని ప్రణాళికతో ముందుకు వెళ్లాలని సూచించారు. అస్తవ్యస్తంగా అభివృద్ధి చెందితే జలాశయాలు కాలుష్యపూరితమై ఇప్పటికే ఉన్న నగరాన్ని కూడా ప్రభావితం చేస్తుందని హెచ్చరించారు. -
మున్సిపాలిటీగానే శంషాబాద్!
శంషాబాద్, న్యూస్‌లైన్: గ్రేటర్ విలీనం నుంచి బయటపడిన శంషాబాద్ పట్టణం త్వరలోనే గ్రేడ్ వన్ మున్సిపాలిటీ హోదాతో కొత్త పరిపాలనలోకి రానుంది. ఇందుకోసం అధికార యంత్రాంగం అన్ని విధాలా సంసిద్ధమైంది. శంషాబాద్ పంచాయతీతో పాటు జిల్లాలోని పలు పంచాయతీలు గ్రేటర్లో విలీనానికి వ్యతిరేకంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించి విజయం సాధించడంతో వాటి భవిష్యత్తు ప్రస్తుతం సర్కారు చేతిలో ఉంది. వీటిని నగర పంచాయతీలు, మున్సిపాలిటీలుగా మార్చడానికి ముఖ్యమంత్రి సైతం సుముఖత వ్యక్తం చేయడంతో ప్రభుత్వ యంత్రాంగం ఆ దిశగా ముందుకు కదులుతోంది. వనరులే కీలకం.. మున్సిపాలిటీ పరిపాలన కూడా దాదాపు స్థానికంగా సమకూర్చుకునే వనరులపైనే ఆధారపడుతుంది. శంషాబాద్ పట్టణంలో సుమారు నలభై వేల జనాభా ఉంది. నిత్యం రాకపోకలు సాగించే జనాభా అధికంగా ఉంటుంది. దీంతో పట్టణంలో అన్ని విధాల సౌకర్యాలు సమకూర్చాల్సిన బాధ్యత స్థానిక పరిపాలన యంత్రాంగంపై ఆధారపడి ఉంటుంది. స్థానికంగా ఉన్న ఆదాయ వనరుల్లో ఇంటిపన్నులు, ట్రేడ్ లెసైన్స్‌లు, వాణిజ్య ప్రకటన లఆదాయంతో పాటు రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చే ట్రాన్స్ఫర్ డ్యూటీలూ ఉన్నాయి. ఇంటి పన్నులు సుమారు కోటి రూపాయల డిమాండ్ ఉండగా గృహనిర్మాణాల అనుమతులు, వాణిజ్య వ్యాపార సంస్థల లెసైన్స్‌లు, ప్రకటన బోర్డుల ద్వారా సుమారు రూ.50లక్షల ఆదాయాన్ని పంచాయతీ సమకూర్చుకునే అవకాశం ఉంది. గ్రేడ్ వన్ మున్సిపాలిటీకి ఉండాల్సిన అన్ని వనరులూ ఉండడంతో పాటు విమానాశ్రయానికి అత్యంత చేరువలో ఉన్నందున దీనిని నగర పంచాయతీగా కాకుండా మున్సిపాలిటీగా మార్చేందుకే ప్రభుత్వ యంత్రాంగం అన్ని విధాలుగా మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. గొడ్డలిపెట్టుగా జీవో 111 జీవో 111 కారణంగా శంషాబాద్‌లో కేవలం జీప్లస్ టూ నిర్మాణాలకు మాత్రమే అనుమతులు మంజూరు చేయడానికి అవకాశం ఉంది. ప్రస్తుతం అది కూడా కేవలం హెచ్ఎండీఏ అనుమతి పొందిన లేవుట్లు లేదా గ్రామకంఠం స్థలాల్లో మాత్రమే నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేస్తున్నారు. దీంతో శంషాబాద్ పంచాయతీకి భారీగా ఆదాయంలో గండిపడుతోంది. నిబంధనల ప్రకారం అనుమతులు మంజూరు చేయలేని స్థానిక యంత్రాంగం వాటి నుంచి ఆదాయాన్ని కూడా పొందలేక చతికిలపడుతోంది. పంచాయతీ వద్ద ప్రజాభిప్రాయ సేకరణ రేపు శుక్రవారం శంషాబాద్ పంచాయతీ కార్యాలయం వద్ద ప్రభుత్వ అధికారులు ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించనున్నారు. ఇందులో శంషాబాద్‌ను నగరపంచాయతీగా చేయడమా లేదా మున్సిపాలిటీగా మార్చడమా అన్న అంశాలపై ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించనున్నారు.