TS: ‘జీవో 111’పై మరికొంత సమయం | CM KCR To Seek More Time From High Court On GO 111 | Sakshi
Sakshi News home page

TS: ‘జీవో 111’పై మరికొంత సమయం

Published Mon, Sep 13 2021 2:37 AM | Last Updated on Mon, Sep 13 2021 7:37 AM

CM KCR To Seek More Time From High Court On GO 111 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జీవో 111పై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడానికి మరికొంత సమయం పడుతుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు స్పష్టం చేశారు. సమగ్రమైన చర్చ, నిర్దిష్టమైన ప్రణాళికల మేరకు దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. ఈ నేపథ్యంలో జీవో 111పై ప్రభుత్వ నిర్ణయాన్ని తెలపడానికి ఇంకా కొంత వ్యవధి ఇవ్వాల్సిందిగా హైకోర్టును కోరాలని సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ఆదివారం జరిగిన సమావేశం నిర్ణయించింది. ఇటీవల ఓ కేసు విచారణ సందర్భంగా జీవో 111పై వైఖరి ఏమిటో తెలపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.

హైదరాబాద్‌ నగరానికి నీటి సరఫరా చేసే ఉస్మాన్‌ సాగర్, హిమాయత్‌ సాగర్‌ జంట జలాశయాలను కాలుష్యం నుంచి రక్షించే ఉద్దేశంతో 10 కిలోమీటర్ల వరకు క్యాచ్‌మెంట్‌ ఏరియాను బఫర్‌ జోన్‌గా ప్రకటించి, ఆ ప్రాంతంలో అన్ని రకాల నిర్మాణాలను నిషేధిస్తూ 1996లో అప్పటి ప్రభుత్వం జీవో నం.111 జారీ చేసింది. తాజాగా ఈ జీవోపై ప్రభుత్వం తీసుకోనున్న నిర్ణయం కోసం బఫర్‌ జోన్‌ పరిధిలోని గ్రామాల్లో భూముల యజమానులు, స్థిరాస్తి వ్యాపారులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  

వాతావరణ సమతూకాన్ని పాటించాలి 
అంతర్జాతీయ నగరంగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల ప్రజల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని జలాశయాల రక్షణ, అటవీ ప్రాంతాల్లో పచ్చదనం అభివృద్ధి, రియల్‌ ఎస్టేట్‌ సంబంధిత నిర్ణయాలు తీసుకోవాల్సిందిగా పురపాలక శాఖ అధికారులను సీఎం ఆదేశించారు. హైదరాబాద్‌ చుట్టుపక్కల ఉన్న లక్ష ఎకరాల అటవీ భూమిని రక్షించడంతో పాటు, అందులో పచ్చదనాన్ని పెంచడానికి తగు చర్యలు తీసుకోవాలని నగర సమగ్ర అభివృద్ధిపై సమీక్ష సందర్భంగా సూచించారు. ఇప్పటికే 11 వేల ఎకరాల్లో విస్తరించి ఉన్న ఉస్మాన్‌ సాగర్, హిమాయత్‌ సాగర్‌ జంట జలాశయాలు, కొండ పోచమ్మ సాగర్, మల్లన్న సాగర్‌ రిజర్వాయర్లలో నీటి నిల్వ ద్వారా హైదరాబాద్‌ నగరంలోని వాతావరణ పరిస్థితుల సమతూకాన్ని పాటించాలని ఆదేశించారు.  

రాబోయే తరాలకు మంచి నగరాన్ని ఇవ్వాలి 
జీవో 111 పరిధిలోని 84 గ్రామాల్లో లక్షా 32 వేల ఎకరాల భూమి 538 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నదని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. ఇది సుమారు జీహెచ్‌ఎంసీ విస్తరించి ఉన్న ప్రాంతానికి సరి సమానమని చెప్పారు. కాగా హైదరాబాద్‌కు అనుబంధంగా హెచ్‌ఎండీఏ పరిధిలో విస్తరిస్తున్న ప్రాంతం.. ఇంకొక కొత్త నగరానికి సమానమైన వైశాల్యంతో ఉందని ఈ సందర్భంగా సీఎం పేర్కొన్నారు. ఇంత పెద్ద ప్రాంతాన్ని నిబంధనలకు అనుగుణంగా రూపుదిద్దకపోతే జలాశయాలు, ప్రజలు నివసించే ప్రాంతాలు కాలుష్యం బారినపడే ప్రమాదం ఉందన్నారు.

అలాంటి పరి స్థితి రాకుండా ఇప్పటినుండే సమగ్ర ప్రణాళికలతో గ్రీన్‌జోన్లు, సివరేజ్‌ మాస్టర్‌ప్లాన్, తాగునీటి వ్యవస్థ, విశాలమైన రోడ్లు తదితర సదుపాయాలతో రాబోయే తరాలకు మంచి నగరాన్ని ఇచ్చే దిశగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇప్పటికే ఉన్న అటవీ ప్రాంతాలను బలోపేతం చేస్తూ, జలాశయాలన్నింటినీ పరిరక్షిస్తూ, ఒక చక్కని ప్రణాళికతో ముందుకు వెళ్లాలని సూచించారు. అస్తవ్యస్తంగా అభివృద్ధి చెందితే జలాశయాలు కాలుష్యపూరితమై ఇప్పటికే ఉన్న నగరాన్ని కూడా ప్రభావితం చేస్తుందని హెచ్చరించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement