
సమావేశంలో మాట్లాడుతున్న సేవ్ అవర్ అర్బన్ లేక్స్ కన్వీనర్ లుబ్నా సారావత్
బంజారాహిల్స్: హైదరాబాద్‌కు ఒక వరంగా ఉన్న ఉస్మాన్ సాగర్, హిమాయత్‌సాగర్‌లకు రక్షణకవచమైన జీవో 111 రద్దు చేస్తే ప్రకృతికి శాపంగా మారుతుందని సేవ్ అవర్ అర్బన్ లేక్స్ కన్వీనర్ లుబ్నా సారావత్ అన్నారు. ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోపోతే పర్యావరణ ప్రేమికులు, చెరువుల పరిరక్షకులు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు.
అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్ కొద్దిరోజుల క్రితం జీవో 111 రద్దు చేస్తామని, ఇందుకోసం కమిటీ ఏర్పాటు చేశామని ప్రకటించిన నేపథ్యంలో ఆదివారం బంజారాహిల్స్‌లోని లామకాన్‌లో పర్యావరణ ప్రేమికులు, పర్యావరణ ఉద్యమకారులు సమావేశమయ్యారు. లుబ్నా సారావత్ మాట్లాడుతూ జీవో 111 రద్దు నిర్ణయాన్ని, కమిటీని ఉపసంహరించుకోకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని హెచ్చరించారు. రియల్ ఎస్టేట్ కంపెనీలకు దోచిపెట్టడానికే సీఎం ప్రయత్నిస్తున్నారని, ఆయన రియల్ ఎస్టేట్ ఏజెంట్‌గా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
అసెంబ్లీలో చెప్పినవన్నీ అబద్ధాలే..
ఉస్మాన్ సాగర్, హిమాయత్‌సాగర్‌లపై అసెంబ్లీలో సీఎం కేసీఆర్ అబద్ధాలు మాట్లాడారని సారావత్ దుయ్యబట్టారు. వీటిని కాపాడుకోకపోతే భవిష్యత్ కాలుష్యమయం అవుతుందని, ప్రతి ఒక్కరూ తమ ఉద్యమానికి మద్దతు పలకాలని విజ్ఞప్తి చేశారు. ఈ రెండు చెరువులు వరదలను ఆపడమే కాకుండా ఎన్నో వనరులకు కేంద్ర బిందువుగా ఉన్నాయని, శక్తి మేర నగరవాసుల దాహార్తి తీరుస్తున్నాయని పేర్కొన్నారు.
భూగర్భ జలాలు పెరగడానికి, హైదరాబాద్ చుట్టూ ప్రకృతి విరాజిల్లడానికి కారణమవుతున్నాయన్నారు. సీఎం కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరి మద్దతు కూడగడతామని, ప్రజలకు వీటి అవసరాన్ని గుర్తు చేస్తామని వెల్లడించారు. ఐఏసీటీ విశ్రాంత శాస్త్రవేత్త బాబురావు మాట్లాడుతూ జీవో 111 రద్దు నిర్ణయాన్ని ప్రజలందరూ వ్యతిరేకిస్తున్నారన్నారు. ప్రకృతికి విరుద్ధంగా నిర్ణయాలు తీసుకుంటే, వాటి దుష్పరిణామాలు తట్టుకోలేరన్నారు. ప్రజలందరితో చర్చించిన తర్వాతనే జీవో 111పై నిర్ణయం తీసుకోవాలని సూచించారు.