సబ్‌సెంటర్లకు సుస్తీ | shortage of health assistant in district | Sakshi
Sakshi News home page

సబ్‌సెంటర్లకు సుస్తీ

Published Sat, Jan 11 2014 2:56 AM | Last Updated on Sat, Sep 2 2017 2:29 AM

shortage of health assistant in district

కర్నూలు(హాస్పిటల్), న్యూస్‌లైన్: చిన్న రోగాలకు పీహెచ్‌సీలకు వెళ్లలేని వారు గ్రామాల్లోని వాటి ఉప కేంద్రాల ద్వారా ప్రాథమిక వైద్యం అందుకోవచ్చు. అయితే వీటిలో వైద్యమంటే ప్రజలు హడలిపోతున్నారు. అసౌకర్యాలతో ఆరోగ్య సిబ్బంది, రోగులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ప్రతి 5 వేల జనాభాకు ఓ సబ్ సెంటర్ ఏర్పాటు చేసి సౌకర్యాలు కల్పించాలనే నిబంధనలు ఉన్నాయి.  ప్రభుత్వం ఆ మేరకు సౌకర్యాలు కల్పించడంలో విఫలమైంది. దీంతో పేద ప్రజలకు సరైన వైద్యం అందడం లేదు.

 గ్రామాల్లో మాతా, శిశు మరణాలు, అంటు వ్యాదులతో మరణాలు పెరిగి పోతున్నాయి.  జిల్లాలోని 75 శాతం ఉప ఆరోగ్య కేంద్రాలు అద్దె గదుల్లోనే నడుస్తున్నాయంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. వాటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం సక్రమంగా అద్దె చెల్లించకపోవడంతో  ఆరోగ్య కార్యకర్తలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీటిని పర్యవేక్షించే వారు కరువవడంతో అధిక శాతం ఆరోగ్యకార్యకర్తలు మొక్కుబడిగా విధులు నిర్వహిస్తున్నారు. దీంతో రోగులకు ఆర్‌ఎంపీలే పెద్ద దిక్కవుతున్నారు.  

 జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో జిల్లాలో 83 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 13 తాలూకా ఆసుపత్రులున్నాయి. ఇందులో 24 గంటల పాటు సేవలందించే ఆసుపత్రులు 48 ఉన్నాయి. వీటితో పాటు ఆరోగ్య ఉప కేంద్రాలు 663 ఉన్నాయి. వీటిలో ఒక రెగ్యులర్ ఏఎన్‌ఎంతో పాటు సెకండ్ ఏఎన్‌ఎం, ఇద్దరు మల్టీపర్పస్ హెల్త్‌వర్కర్లు విధులు నిర్వహిస్తారు. వీరు వంతుల ప్రకారం ఆయా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోని గ్రామాల్లో ఇంటింటికి తిరిగి ప్రజల ఆరోగ్యంపై ఆరా తీయాల్సి ఉంటుంది. దీనికితోడు చిన్న చిన్న జబ్బులకు అవసరమైన మందులను అందించాలి. గర్భిణులు, బాలింతలు, శిశువులకు అవసరమైన వైద్యసేవలు సైతం వీరి ఆధ్వర్యంలోనే కొనసాగాలి. కానీ జిల్లాలో పరిస్థితి భిన్నంగా ఉంది.

 జోనల్ స్థాయి మల్టీపర్పస్ హెల్త్ వర్కర్(మేల్) పోస్టులు 88కి గాను 62, మల్టీపర్పస్ హెల్త్ వర్కర్(ఫిమేల) పోస్టులు వందకు గాను ఏడు ఖాళీగా ఉన్నాయి. జిల్లా స్థాయి కేడర్‌లో మగ ఆరోగ్య కార్యకర్తల పోస్టులు 403కు గాను 187, సెకండ్ ఏఎన్‌ఎం పోస్టులు 544కి గాను 212, అదనపు ఏఎన్‌ఎం పోస్టులు 117కు గాను 24 ఖాళీగా ఉన్నాయి. దీంతో గ్రామీణ స్థాయిలో పేదలకు సరైన వైద్యసేవలు అందడం లేదు. ఉపకేంద్రాల్లో ఉండాల్సిన పలువురు ఆరోగ్య కార్యకర్తలు సైతం విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తుండటంతో రోగులు ఆర్‌ఎంపీలను ఆశ్రయించి ప్రాణం మీదకు తెచ్చుకుంటున్నారు.

 ఇదీ దుస్థితి..
  ఆదోని మండలంలోని 14 సబ్ సెంటర్లు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. బైచిగేరి ఆరోగ్య ఉపకేంద్రం భవనం పూర్తయినప్పటికీ వినియోగానికి నోచుకోవడం లేదు.
  పెద్ద తుంబళం పీహెచ్‌సీ పరిధిలో 4 మేల్ హెల్త్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉండడంతో ఫిమేల్ హెల్త్ అసిస్టెంట్‌లకు పనిభారం పెరిగింది.
  పెద్ద హరివాణం పీహెచ్‌సీ పరిధిలోని 7 సబ్ సెంటర్లలో పెద్దహరివాణం, బైచిగేరి, చిన్నపెండేకల్ గ్రామ సబ్ సెంటర్లలో మేల్ హెల్త్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
  దేవనకొండ మండలంలోని తెర్నేకల్, పి.కోటకొండ, కరివేముల, నల్లచెలిమల, గుండ్లకొండ, నెల్లిబండ గ్రామాలతో పాటు మరో ఆరు గ్రామాల్లో ఆరోగ్య ఉపకేంద్రాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి.
  ఆస్పరి మండలంలోని జొహరాపురం, తంగరడోణ, ములుగుందం, యాటకల్, హలిగేర, చిగిళితో పాటు మరో రెండు ఆరోగ్య ఉపకేంద్రాలకు సొంత భవనాలు లేకపోవడంతో సిబ్బంది సక్రమంగా విధులకు హాజరుకావడం లేదు.
  హాలహర్వి మండలంలోని అమృతాపురం, హాలహర్వి, విరుపాపురం, హర్ధగేరి, చింతకుంట, కామినహాల్, కొక్కరచేడు తదితర గ్రామాల్లో ఆరోగ్య ఉపకేంద్రాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. గూళ్యం సబ్‌సెంటర్‌లో పనిచేసే ఆరోగ్యకార్యకర్త విధులకు రాకపోవడంతో ఆరు నెలలుగా కేంద్రం మూతపడింది.

  చిప్పగిరి మండలంలోని నగరడోణ, రామదుర్గం, చిప్పగిరి, నేమకల్, ఏరూరు, నంచర్ల గ్రామాల్లో ఆరోగ్య ఉపకేంద్రాలు ఉన్నాయి. ఆయా ఆరోగ్య ఉపకేంద్రాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. సిబ్బంది సైతం సమయపాలన పాటించడం లేదు.
  ఆత్మకూరు, వెలుగోడు, బండిఆత్మకూరు, మహానంది మండలాల్లోని సబ్‌సెంటర్లలో మూడు నాలుగు రోజులకోసారి కూడా తలుపులు తెరవకపోయినా స్థానిక వైద్యులు పట్టించుకోవడం లేదు. ఫలితంగా రోగులు ఆత్మకూరు, నంద్యాల, కర్నూలు ప్రభుత్వ, ప్రైవేట్ వైద్యశాలలకు తరలివెళ్తున్నారు.

  బండి ఆత్మకూరులోని సబ్‌సెంటర్ శిథిలావస్థకు చేరడంతో ఎప్పుడు పడిపోతుందో తెలియడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్యసేవలందకపోవడంతో రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
   ఆత్మకూరు, బైర్లూటి, వెంకటాపురం, నల్లకాల్వ కేంద్రాలు శిథిలావస్తకు చేరుకోగా, మిగిలినవన్నీ అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి.
 
 సబ్ సెంటర్లలో ఉండాల్సిన సౌకర్యాలు
 గర్భిణులకు పరీక్షలు చేసేందుకు, వైద్య పరీక్షలు నిర్వహించేందుకు డెలివరీ టేబుల్, రోగులకు గ్లూకోజ్ ఎక్కించేందుకు కనీసం రెండు మంచాలుండాలి. వీటితో పాటు బేసిన్, టార్చ్ లైట్, స్టెరి లైజర్, మూత్ర పరీక్షలు చేసే పరికరం, పిల్లల బరువు తూచే పరికరం, హిమోగ్లోబిన్ మీటర్, బరువు యంత్రం, డెలివరీ సామగ్రి, అన్ని రకాల అత్యవసర మందులు అందు బాటులో ఉండాలి. ప్రతి సబ్ సెంటర్ పరిధిలో సాధారణ జబ్బులకు అవసరమైన మందులను అందుబాటులో ఉంచాలి.
 
 అద్దె రూ.250
 జిల్లాలో 75 శాతం సబ్‌సెంటర్లు అద్దెభవనాల్లో కొనసాగుతున్నాయి. అది కూడా ఒక్కో సబ్‌సెంటర్‌కు రాష్ట్ర ప్రభుత్వం కేవలం రూ.250లు చెల్లిస్తోంది. దీంతో ఆరోగ్యకార్యకర్తలు తమ పోస్టులను కాపాడుకోవడానికి సొంతంగా ఖర్చు పెట్టి అద్దె చెల్లిస్తున్నారన్న వాదన కూడా ఉంది. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో అనేక మంది ఆరోగ్యకార్యకర్తలు విధులకు డుమ్మా కొడుతున్నారు. ఆదివారం సబ్‌సెంటర్లు కేంద్రా ల్లో విధులు నిర్వహించాల్సి ఉన్నప్పటికీ చా లామంది హెల్త్ అసిస్టెంట్‌లు పనిచేయడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement