ఎస్సైల ‘స్టిక్కరింగ్’
ఏలూరు (సెంట్రల్) : పోలీసు శాఖ విక్రయించమని ఇచ్చిన స్టిక్కర్స్‌ను అధిక ధరకు అమ్మిన ఇద్దరు ఎస్సైలను జిల్లా ఎస్పీ భాస్కర్‌భూషణ్ వీఆర్‌లో ఉంచారు. పోలీసు అమరవీరుల వారోత్సవాలలో భాగంగా ఏటా జిల్లా పోలీసు కార్యాలయం నుంచి జిల్లాలోని ప్రతి స్టేషన్‌కు ఒక్కొక్కటి రూ.10 చొప్పున విక్రయించమని కొన్ని స్టిక్కర్స్‌ను పంపిస్తారు. తణుకు రూరల్ ఎస్సై జి.కాళీచరణ్, ధర్మాజీగూడెం ఎస్సై ఎం.కేశవరావు స్టికర్స్ విక్రయాల పేరుతో కొంతమంది నుంచి అధిక మొత్తంలో వసూలు చేయడంతో ఆ విషయం ఎస్పీ దృష్టికి వెళ్లింది.
దీంతో ఆ ఇద్దరు ఎస్సైలను వీఆర్‌లో ఉంచాలని ఎస్పీ ఆదేశించారు. ఇటువంటి ఆరోపణలు ఏస్టేషన్‌లోనైనా సిబ్బందిపై వస్తే వారిపై కూడా శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ స్టేషన్ ఎస్‌హెచ్‌వోలకు ఎస్‌ఎంఎస్‌ల ద్వారా హెచ్చరికలు జారీచేశారు. దీనికి సంబంధించి తణుకు రూరల్ స్టేషన్‌లో కొంతమంది సిబ్బందిని శుక్రవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో విచారించినట్టు సమాచారం.
ఏలూరులోనూ అంతే..
ఏలూరు టూటౌన్ స్టేషన్‌లో కొంతమంది సిబ్బంది ఇదే తరహాలో వ్యవహరించారనే ఆరోపణలు నగరంలో వినిపిస్తున్నాయి. ఒక కానిస్టేబుల్, హెడ్‌కానిస్టేబుల్, ఏఎస్సై ఈ స్టికర్స్ అమ్మకాలు చేపట్టారు. స్టేషన్ సిబ్బంది అధిక లోడ్‌తో వెళుతున్న లారీలను ఆపి డ్రైవర్లకు ఈ స్టికర్స్ ఇచ్చి రూ.2000 చొప్పున వసూలు చేసినట్టు సమాచారం. స్టేషన్ పరిధిలో ఉన్న ఫైనాన్స్ కంపెనీలు, బ్రాందీషాపుల నుంచి కూడా అధిక మొత్తంలో వసూలు చేసినట్టు తెలిసింది.