కథ మారింది..! | Siddhartha management to increase the size of the rental agreement of Durga temple | Sakshi
Sakshi News home page

కథ మారింది..!

Published Wed, Jan 28 2015 1:20 AM | Last Updated on Sat, Sep 2 2017 8:21 PM

కథ మారింది..!

కథ మారింది..!

దుర్గగుడి భూములకు అద్దె పెంచేందుకు సిద్ధార్థ యాజమాన్యం అంగీకారం
లీజు పొడిగించేందుకు ప్రభుత్వం సుముఖం
త్వరలోనే సమస్య పరిష్కారం..

 
విజయవాడ : సిద్ధార్థ అకాడమీ ఆధీనంలో ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం భూముల వ్యవహారం ఒక కొలిక్కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ వ్యవహారం  సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉండటంతో ఈ సమస్యను పరిష్కరించుకునేందుకు అకాడమీ యాజమాన్యం ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. ప్రభుత్వం కూడా ఇటు దేవస్థానానికి, అటు సిద్ధార్థ యాజమాన్యానికి ఇబ్బంది లేని విధంగా సమస్యను పరిష్కరించాలని భావిస్తున్నట్లు సమాచారం. శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానానికి చెందిన 8.22 ఎకరాల స్థలంలో సిద్ధార్థ మహిళా కళాశాల, 5.98 ఎకరాల స్థలంలో సిద్ధార్థ అర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో కొంత భాగం ఉన్నాయి. ఈ రెండు స్థలాలను సిద్ధార్థ సంస్థలకు 50 ఏళ్లు లీజుకు ఇచ్చిన ఉత్తర్వులను 2006లో అప్పటి ప్రభుత్వం రద్దు చేసింది. అయినప్పటికీ ఆ స్థలాలను ఖాళీ చేయకపోవడంతో దేవస్థానం అధికారులు ఎండోమెంట్ డెప్యూటీ కమిషనర్ కోర్టును ఆశ్రయించారు. అక్కడ దేవస్థానానికి అనుకూలంగా తీర్పు రావడంతో సిద్ధార్థ విద్యాసంస్థల యాజమాన్యం హైకోర్టుకు వెళ్లింది. అక్కడ కూడా వారికి చుక్కెదురు కావడంతో 2013 ఆగస్టులో సుప్రీంకోర్టుకు వెళ్లారు. దీంతో సుప్రీంకోర్టు ‘యథాతథ స్థితి’ని కొనసాగించాలని ఉత్తర్వులు జారీచేసింది. దీనిపై దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం పిటీషన్ దాఖలు చేయగా, ప్రభుత్వం తన వాదనలను వినిపిస్తూ పిటీషన్ దాఖలు చేయాల్సి ఉంది.
 
కేసుల పరిష్కారం కోసం కమిటీ

సిద్ధార్థ సంస్థల ఆధీనంలో ఉన్న భూములకు చెల్లిస్తున్న అద్దెలు చాలా తక్కువగా ఉన్నాయని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుత ఇక్కడ ఉన్న అద్దెలకు, సిద్ధార్థ యాజ మాన్యం చెల్లిస్తున్న మొత్తానికి చాలా వ్యత్యాసం ఉంది. సిద్ధార్థ యాజమాన్యం స్థలాన్ని అద్దెకు తీసుకునే సమయంలో ఏడాదికి ఎకరాకు రూ.5వేలు చొప్పున చెల్లిస్తామని, ఆ తర్వాత ప్రతి ఏడాది రూ.500 చొప్పున పెంచేలా ఒప్పందం చేసుకున్నారు. అయితే, లీజును రద్దు చేయడం, కేసు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉండటంతో అద్దె వసూలు చేయడం లేదని దేవస్థాన అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో సిద్ధార్థ యాజమాన్యం భూముల అద్దెలను పెంచేందుకు ముందుకువచ్చినట్లు తెలిసింది. దీంతో అద్దెలను పెంచి తిరిగి ఆ విద్యాసంస్థల లీజును కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తోందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పి.మాణిక్యాలరావు ‘సాక్షి’కి తెలిపారు. ఇటీవల ఆయన నగరానికి వచ్చినప్పుడు ఆక్రమణల చెరలో ఉన్న దేవాలయాల భూముల గురించి ప్రస్తావించగా.. న్యాయస్థానాల్లో కేసులు నడుస్తున్న భూముల సమస్యలను పరిష్కరించేందుకు హైకోర్టు రిటైర్డ్ జడ్జిలు, లీగల్ సెక్రటరీలతో కమిటీలను ఏర్పాటుచేస్తామని చెప్పారు. ఈ కమిటీ దేవాలయాల ఆస్తుల కేసులను త్వరగా పరిష్కరించి స్వాధీనం చేసుకునేలా సూచనలు చేస్తుందని తెలిపారు.

సిద్ధార్థ అకాడమీ ఆధీనంలో ఉన్న భూముల విషయంపై ప్రభుత్వం దృష్టి సారించిందని, అద్దె పెంచాలని భావిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. అయితే, ఎంత శాతం పెంచాలనే విషయంపై ఇప్పటివరకు నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. దీనిపై కూడా ఒక కమిటీ వేస్తామని, ప్రస్తుతం అక్కడ ఉన్న భూముల అద్దెలను పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. త్వరలోనే ఈ వ్యవహారం ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందన్నారు.
              
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement