
సిద్ధార్థ యాజమాన్యం దిగివచ్చేనా!
సుప్రీంకోర్టులో దుర్గగుడి ఈవో పిటిషన్ దాఖలు
పిటిషన్ దాఖలులో ప్రభుత్వం తాత్సారం
కాగితాలకే పరిమితమైన లీజుల పెంపు ప్రతిపాదన
విజయవాడ : సిద్ధార్థ అకాడమీ ఆధీనంలో ఉన్న దుర్గగుడి దేవస్థానం భూములను తిరిగి స్వాధీనం చేసుకునే విషయం మూడు అడుగులు ముందుకు... ఆరు అడుగులు వెనక్కు అన్న చందంగా సాగుతోంది. ఎండోమెంట్ డెప్యూటీ కమిషనర్ కోర్టు నుంచి హైకోర్టు వరకు దేవస్థానమే గెలిచినప్పటికీ సిద్ధార్థ యాజమాన్యం ఆ భూములను వదల కుండా సుప్రీం కోర్టుకు వెళ్లింది. ప్రస్తుతం సుప్రీం కోర్టులో ఉన్న ఈ కేసును ఒక కొలిక్కి తీసుకువచ్చి దుర్గగుడికి చెందిన భూములను దేవస్థానానికి ఇప్పించడంతో ఉన్నతాధికారులు, ప్రభుత్వం చిత్తశుద్ధి చూపడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇలా జరిగింది....
శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానానికి చెందిన 8.22 ఎకరాల స్థలంలో సిద్ధార్థ మహిళా కళాశాల, 5.98 ఎకరాల స్థలంలో సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఉన్నాయి. ఈ రెండుస్థలాలను సిద్ధార్థ సంస్థలకు 50 ఏళ్లకు లీజుకు ఇస్తూ గతంలో ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను 2006లో ప్రభుత్వమే రద్దు చేసింది. అయినప్పటికీ ఆ స్థలాలను ఖాళీ చేయకపోవడంతో దేవస్థానం అధికారులు ఎండోమెంట్ డెప్యూటీ కమిషనర్ కోర్టుకెళ్లారు. అక్కడ దేవస్థానానికి అనుకూలంగా రావడంతో సిద్ధార్థ విద్యాసంస్థల యాజమాన్యం హైకోర్టుకు వెళ్లింది. అక్కడా చుక్కెదురు కావడంతో 2013 ఆగస్టులో సుప్రీంకోర్టుకు వెళ్లగా ‘యథాతథ స్థితి’ కొనసాగించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించింది.
కమిషనర్, ప్రభుత్వం తాత్సారం....
దుర్గగుడి దేవస్థానంతోపాటు దేవాదాయశాఖ కమిషనర్, రాష్ట్ర ప్రభుత్వం కూడా దుర్గగుడి భూములపై స్టే ఎత్తివేయాలని, దేవస్థానానికి భూములు ఇప్పించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేయాల్సి ఉంది. అయితే పిటిషన్ దాఖల చేసేందకు ఈవోకు అనుమతి మంజూరులోనే దేవాదాశాఖ కమిషనర్ కార్యాలయం తీవ్ర తాత్సారం చేసింది. ఈ కేసులో ప్రభుత్వం, దేవాదాయశాఖ కమిషనర్లు ఎప్పుడు పిటిషన్లు దాఖలుచేస్తారో ఆ కనకదుర్గమ్మకే తెలియాలి. వేగవంతంగా ఫైల్స్ కదిపి సుప్రీం కోర్టులో తమ వాదన వినిపిస్తే సాధ్యమైన త్వరగా భూములు స్వాధీనం చేసుకునే అవకాశ ఉంటుంది. అయితే ప్రభుత్వం ఈ విషయంలో కావాలనే తాత్సారం చేస్తోందని భక్తులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు.
అద్దెలు పెంచడం పై భేదాభిప్రాయాలు
సిద్ధార్థ సంస్థల ఆధీనంలో ఉన్న భూముల అద్దె ధరలు చాలా తక్కువగా ఉన్నాయని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుత ఇక్కడ ఉన్న అద్దెల ధరలకు యాజమాన్యం చెల్లిస్తున్న అద్దెల రేట్లకు ఎంతో వ్యత్యాసం ఉంది. సిద్ధార్థ యాజమాన్యం అద్దెలకు తీసుకునేడప్పుడు ఎకరాకి రూ.5 వేల చొప్పున అద్దె చెల్లించేలా, ఆ తరువాత ప్రతి ఏడాది రూ.500 పెంచాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఉన్న మార్కెట్ రేటు ప్రకారం తమ భూములకు అద్దె చెల్లించాలని దేవస్థానం డిమాండ్ చేస్తోంది. అయితే ఆ స్థాయిలో అద్దెలు పెంచితే తమకు భారం అవుతుందని సిద్ధార్థ యాజమాన్యం భావిస్తున్నట్లు సమాచారం. సిద్ధార్థ యాజమాన్యం ఆధ్వర్యంలోని భూముల లీజు పెంచేందుకు ప్రభుత్వం గతంలో ఒక కమిటీని వేయాలని భావించింది. రెండు వర్గాలతో సంప్రదించి లీజు ఖరారు చేసి విభేదాలు లేకుండా చేయాలనే ప్రతిపాదన కేవలం ఆలోచనలకే పరిమితమైందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
దేవస్థానం వాదన ఇదీ...
సుప్రీంకోర్టులో ఇచ్చిన స్టే ఉత్తర్వులను తొల గించి, గతంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం తమకు భూమి అప్పగించాలని కోరుతూ తాజాగా దుర్గగుడి ఈవో సీహెచ్ నర్సింగరావు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలుచేశారు. దుర్గగుడికి చెందిన ఆస్తిపై పూర్తి హక్కులు దేవస్థానానికే ఉంటాయని, సెక్షన్ 15 ప్రకారం దేవస్థానం భూములను లీజుకు ఇచ్చే అధికారం ప్రభుత్వానికి లేదని దేవస్థానం న్యాయవాదులు గతంలో హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఆ వాదనను హైకోర్టు అంగీకరించింది. ఆ వాదన ప్రకారం భూములను సిద్ధార్థ యాజమాన్యం నుంచి ఇప్పిం చాలని ఈవో పిటిషన్ దాఖలుచేశారు.