దొడ్డి దారిన రావాల్సిన అవసరమేంటి?
హైదరాబాద్: ఏపీ రాజధాని భూసమీకరణ దరఖాస్తు పత్రం రైతులను మోసగించేలా ఉందని మంగళగిరి వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి విమర్శించారు. శనివారం హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ... రైతులకిచ్చే నష్టపరిహారంలో ఎలాంటి స్పష్టత లేదని మండిపడ్డారు. భూ సేకరణ చట్టం 2013 వర్తించే విషయం దరఖాస్తుల్లో ఉన్నాఆ విషయాన్ని రైతులకు తెలియనీయడం లేదన్నారు. ప్రత్యామ్నాయంగా రైతులకు ఎక్కడ స్థలాలను ఇస్తారో ధరఖాస్తులో పేర్కొనలేదని ఆయన విమర్శించారు. రైతులకు వాస్తవాలు చెప్పాలని సూచించారు. సింగపూర్ బృందాన్ని దొడ్డి దారిన రహస్యంగా తిప్పాల్సిన అవసరమేంటని ఆళ్ల ప్రశ్నించారు.
కాగా రాజధాని గ్రామాల్లో శనివారం సింగపూర్ బృందం రహస్యంగా పర్యటించింది. ఈ బృందం నిన్న అమరావతితో పాటు తుళ్లూరులో పర్యటించింది. ఆర్డీవో భాస్కరనాయుడు దగ్గరుండి సింగపూర్ బృందాన్ని గ్రామాల్లో తిప్పుతున్నారు. భూములు ఇచ్చేందుకు నిరాకరిస్తున్న గ్రామాల ప్రజలు.... సింగపూర్ బృందాన్ని అడ్డుకుంటారని వారిని ఏపీ సర్కార్ రహస్యంగా తిప్పుతోంది.