యాంకర్ ఉదయభాను అభినందించారు
పాటలు మధురంగా ఆలపించడమే కాదు ఒకేసారి రెండు స్వరాలను పలికించడంలో ఆయన దిట్ట. ఆయన పేరు దండుమేను గోవిందరాజు. రాయవరం మండలం చెల్లూరు గ్రామానికి చెందిన గోవిందరాజు వృత్తిరీత్యా కార్మికుడు. ఆయన చూపిస్తున్న ప్రతిభను ఎందరో ప్రముఖులు అభినందించారు. గోవిందరాజును ‘న్యూస్‌లైన్’ పలకరించగా, సాధన వల్ల గుర్తింపు లభిస్తోందని వెల్లడించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..
చెల్లూరు(రాయవరం)
సంగీతంపై ఆసక్తితోనే..
చిన్నప్పటి నుంచి పాటలు పాడడం అంటే నాకు ఎంతో ఆసక్తి. ప్రతి పాటనూ అనుకరిస్తూ పాడేవాడిని. నా ఆసక్తిని గమనించిన సంగీత గురువు వెన్నేటి సత్యనారాయణ ప్రోత్సహించారు. ఆయన వద్ద శిష్యరికం చేశా. నాకు సంగీతంలో మెలకువలు నేర్పుతూ పాటలను పాడడంలో శిక్షణ ఇచ్చారు. అప్పటి నుంచి పలు చోట్ల పాటలు పాడుతున్నా.
కార్మికుడిగా పనిచేస్తూనే..
చెల్లూరు సర్వారాయ చక్కెర కర్మాగారంలో టర్బైన్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నా. ఖాళీ సమయాల్లో సంగీత విభావరుల్లో పాడతాను. సాంఘిక నాటకాలు, వివిధ శుభకార్యాల్లోనూ పాడుతుంటా. ఓ టీవీచానల్ కార్యక్రమంలో నేను పాడిన పాటకు ముగ్దురాలైన యాంకర్ ఉదయభాను అభినందించారు. బహుమతి కూడా అందజేశారు. పలువురు ప్రముఖుల మెప్పు కూడా పొందాను. మురళీమోహన్, జయసుధ సమక్షంలో రామచంద్రపురంలో ఒక ప్రైవేటు కార్యక్రమంలో పాటలు పాడా. వారి ప్రశంసలను నేను ఎన్నటికీ మరువలేను.
సాధనతోనే..
పురుష గొంతుతోపాటు స్త్రీ స్వరాన్ని ఒకే సమయంలో పలికించడంలో సాధన చేశా. చక్కెర కర్మాగారంలో పనిచేసే వెంకట్రావు, మరో కార్మికుడు స్త్రీ గొంతుతో కూడా పాడడం చూసి సాధన చేశా. అది ఫలించింది. ఒకే పాటలోని స్త్రీ, పురుష చరణాలను మధురంగా పలికించగలను. ఇదే నాకు గుర్తింపు తెచ్చిపెట్టింది.