ఇంత నిర్లక్ష్యమా...? | so careless...? | Sakshi
Sakshi News home page

ఇంత నిర్లక్ష్యమా...?

Published Fri, Feb 6 2015 2:52 AM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM

so careless...?

సాక్షి, గుంటూరు : ఆరు దశాబ్దాల కల నెరవేరబోతోందన్న ఆశ జిల్లా ప్రజలకు తీరడంలేదు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా మరింత జాప్యమమయ్యేలా ఉంది. ఫిబ్రవరి 5వ తేదీ నుంచి జీజీహెచ్‌లో గుండె ఆపరేషన్లు నిర్వహించాలంటూ ప్రభుత్వం జీఓ జారీచేసినప్పటికీ జీజీహెచ్  అధికారుల నిర్లక్ష్యం పేద గుండెలకు శాపంగా మారుతోంది. నవంబర్ 1వ తేదీనే జీజీహెచ్‌లో పీపీపీ పద్ధతి ద్వారా గుండె ఆపరేషన్లు నిర్వహించేందుకు ప్రముఖ గుండె వైద్య నిపుణుడు డాక్టర్ గోపాలకృష్ణ గోఖలే ముందుకు వచ్చారు. ఆపరేషన్లకు సన్నాహాలు చేస్తున్న సమయంలో ఇక్కడి హార్ట్‌లంగ్‌మెషిన్ మూలనపడటంతో కథ మళ్లీ మొదటికి వచ్చింది.
 
  కొత్తది కొనుగోలు చేసి ఆపరేషన్లు మొదలుపెట్టాలన్న ప్రభుత్వ ఆదేశాలను సైతం అధికారులు బేఖాతరు చేయడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నగరంలోని పాతగుంటూరుకు చెందిన ఓ బాలికకు గుండె ఆపరేషన్ నిర్వహించేందుకు నవంబర్ మొదటి వారంలో ముహూర్తం ఖరారు చేశారు. దానికి వచ్చిన ప్రముఖ గుండె వైద్యనిపుణులు డాక్టర్ గోపాలకృష్ణ గోఖలే జీజీహెచ్‌లోని ఆపరేషన్ థియేటర్లు, తదితరాలను పరిశీలించి ఆపరేషన్ నిర్వహించేందుకు ఆయన సంసిద్ధత వ్యక్తం చేశారు. జీజీహెచ్‌లో మిలీనియం బ్లాక్ ఏర్పాటు తర్వాత పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్(పీపీపీ) పద్ధతి ద్వారా గుండె ఆపరేషన్లు నిర్వహించాలని తలపెట్టారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖామంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాసరావు ఈ విషయాన్ని నాలుగు నెలల క్రితం గుంటూరు పర్యటనకు వచ్చిన సమయంలో జీజీహెచ్ అధికారులకు తెలియజేశారు. అయితే ఆసుపత్రిలోని కొంతమంది ప్రభుత్వ వైద్యులు ఈ విధానాన్ని వ్యతిరేకించినప్పటికీ గుండెరోగులను దృష్టిలో ఉంచుకొని ఉన్నతాధికారులు సైతం పీపీపీ పద్దతిలో ఆపరేషన్లు నిర్వహించేందుకు ఆమోదం తెలిపారు. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టు ఆపరేషన్ చేసే వైద్యుడు ఉన్నా ఆపరేషన్ చేయూల్సిన పరికరం మూలనపడటం, ఇప్పటి వరకూ కొత్త మెషిన్ కొనుగోలు చేయకపోవడంతో కథ మళ్లీ మొదటికి వచ్చింది.
 
  కనీసం ఫిబ్రవరి 5వ తేదీ నుంచి జీజీహెచ్‌లో గుండె ఆపరేషన్లు జరుగుతాయని ఆశించిన ప్రజలకు నిరాశే మిగిలేలా ఉంది. గుండె ఆపరేషన్లు జరగాలంటే మరోసారి సుమారు రూ. 70 లక్షలు వెచ్చించి కొత్త హార్ట్‌లంగ్‌మెషిన్ కొనుగోలు చేయాల్సి ఉంది. దీనికి సంబంధించి ఇప్పటి వరకు జీజీహెచ్ ఉన్నతాధికారులు ఎటువంటి చర్యలు చేపట్టలేదు. అనుకున్న గడువు దాటుతున్నా ఏమి పట్టనట్లు వ్యవహరిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.
 
 డీఎంఈతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటాం
 జీజీహెచ్‌లో గుండె ఆపరేషన్లు నిర్వహించడానికి కొంత సమయం పడుతుంది. గుండె వైద్య విభాగంలో హార్ట్‌లంగ్ మెషిన్‌తో పాటు మరికొన్ని పరికరాలు రావాల్సి ఉంది. ఇవి వచ్చిన తరువాత ఆపరేషన్‌లు మొదలయ్యేలా చర్యలు చేపడతాం.
 - డాక్టర్ తన్నీరు వేణుగోపాలరావు,
  జీజీహెచ్ సూపరింటెండెంట్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement