శ్రీకాకుళం పాతబస్టాండ్ : రణస్థలం మండలం అణువిద్యుత్ కర్మాగారం ఏర్పాటు చేయనున్న కొవ్వాడ పరిసర ప్రాంతాల్లో సామాజిక అధ్యయనం చేయనున్నట్టు జాయింట్ కలెక్టర్ వివేక్‌యాదవ్ తెలిపారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో గురువారం అణు విద్యుత్ ప్రాజెక్టు అధికారులు, రెవెన్యూ అధికారులు, సామాజిక అధ్యయన సర్వే నిర్వహించే ఈపీటీఆర్‌ఐ సంస్థ సభ్యులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈపీటీఆర్‌ఐ సంస్థ రూపొందించిన షోషల్ ఇన్‌ఫాక్టు అసెస్‌మెంట్‌పై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. తరువాత జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ఈ ప్రాంతంలో ఉన్న గ్రామాల్లో 1983 కుటుంబాలున్నాయనీ, అందులో 7,960 మంది సభ్యులున్నారని వీరందరినీ అధ్యయనం చేయాలని చెప్పారు.
ఇందుకోసం 37 అంశాలతో గల నమూనాను రూపొందించినట్టు వివరించారు. అధ్యయన సమయంలో స్వయం సహాయక మహిళా బృందాల సేవలు ఉపయోగించుకోవచ్చని చెప్పారు. నూతన భూ సేకరణ చట్టం ప్రకారం నిర్వాసితులకు మంచి ధర వస్తుందని, దాంతోపాటు ప్యాకేజీ అందుతుందని చెప్పారు. అణువిద్యుత్ ముఖ్య ఇంజినీర్ జి.వి.రమేష్ మాట్లాడుతూ అధ్యయన సర్వే ఒక్కరోజులోనే పూర్తి చేయాలని, అందుకు అవసరమైన సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఇప్పటికే సెక్షన్-4 నోటిఫికేషన్ విడుదల చేసి ఉన్నందున సంబంధిత కుటుంబాల వివరాలు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు.
అధ్యయన సంస్థ ఈపీటీఆర్‌ఐ సామాజిక శాస్త్రవేత్త డాక్టర్ వి.సునీత మాట్లాడుతూ సర్వే చేసే విధానాన్ని వివరించారు. పునరావాస కార్యక్రమం కింద ప్రభుత్వం గతంలో ఇచ్చిన సర్వే ప్రశ్నావళిని అనుసరిస్తామని పేర్కొన్నారు. రామచంద్రాపురం, టెక్కలి, కోటపాలెం, జీరు కొవ్వాడ, గూడెం గ్రామాలలో సామాజిక అధ్యయనం చేయనున్నట్లు చెప్పారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి బీహెచ్‌ఎస్ వెంకటరావు, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డెరైక్టర్ ఎస్.తనూజారాణి, కొవ్వాడ భూ సేకరణ అధికారి కె.మనోరమ, అదనపు ముఖ్య ఇంజినీరు పి.బి.శెట్టి, ఈపీటీఆర్‌ఐ పర్యవేక్షక ఇంజినీరు ఎ.గౌతంచంద్ర, పునరావాస కమిషనర్ కార్యాలయ తహశీల్దార్ సి.గంగిరెడ్డి, ఐటీ స్పెషలిస్ట్ డి.కిరణ్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
అణుప్రాంతంలో సామాజిక అధ్యయనం
Published Thu, Jun 11 2015 11:54 PM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM
Advertisement
Advertisement