ఏలూరు : సౌర విద్యుత్ నగరంగా ఏలూరును అభివృద్ధి చేయూలని కేంద్ర ప్రభుత్వం సోమవారం నిర్ణయం తీసుకుందని నెడ్‌క్యాప్ ఎండీ ఎం.కమలాకరబాబు తెలిపారు. ఏలూరులో ఆయన విలేకరులతో మాట్లాడారు. నగరంలో పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు, గృహాలు, బ్యాటరీ సంస్థలు, మంచినీటి పథకాలకు వినియోగిస్తున్న విద్యుత్‌లో 5 శాతం మిగులు చూసిస్తే సౌర విద్యుత్ ఉత్పత్తికి నిధులు విడుదల చేస్తారని వివరించారు. దీనికి థర్డ్ పార్టీ సర్వే చేయాల్సి ఉంటుందన్నారు. ఈ ప్రాజెక్టు అమలుకు నెడ్‌క్యాప్, నగరపాలక సంస్థ అధికారుల ఆధ్వర్యంలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తామన్నారు.
లోసరి కాలువపై సౌర విద్యుత్ ఉత్పత్తికి నిధులు మంజూరు జిల్లాలోని కాలువలపై సౌర విద్యుత్ ఫలకాలు అమర్చి ఉత్పత్తి ప్రారంభించటానికి ఆరువేల మెగావాట్లకు సంబంధించి ప్రతిపాదనలు పంపామని ఎండీ తెలిపారు. ఇందులో భీమవరం మండలం లోసరి కాలువపై ఎకరం వైశాల్యంలో ఒక మెగావాట్ విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించేందుకు రూ.9 కోట్లు మంజూరయ్యాయన్నారు. కాలువ పరిశీలన కు మంగళవారం తాను, జెన్‌కో అధికారులు వెళ్లనున్నట్టు చెప్పారు. తర్వాత దశలో భీమడోలు మండలం గుణ్ణంపల్లిలో పోలవరం కాలువపై 5 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్‌ను నెలకొల్పనున్నట్టు వివరించారు.
నామమాత్రపు ధరకు ఎల్‌ఈడీ బల్బులు
గృహావసర విద్యుత్ ఆదా చేసేందుకు నామమత్రపు ధరకు ఎల్‌ఈడీ బల్బులు ఇవ్వాలని నిర్ణరుుంచినట్టు చెప్పారు. ఒక్కొక్క కుటుంబానికి రెండు చొప్పున ఒక్కొక్క బల్బును రూ.10 ఇస్తామన్నారు. మొదటి విడతగా 500 బల్బులు పంపిణీ చేస్తామని చెప్పారు.
ప్రభుత్వ కార్యాలయాల్లో సౌర విద్యుత్‌కు ఏర్పాట్లు
ప్రభుత్వ కార్యాలయాల్లో విద్యుత్ బిల్లు ఖర్చు ఆదా చేసే మార్గాలను వెతికేందుకు ఎనర్జీ ఆడిట్ చే స్తున్నామన్నారు. రెండు కిలోవాట్ల ఉత్పత్తి లక్ష్యంగా ఒక్కో ప్రభుత్వ కార్యాలయంలో సౌర విద్యుత్ వ్యవస్థ ఏర్పాటు చేసుకుంటే విద్యుత్ బిల్లు 60 శాతం తగ్గుతుందని వివరించారు. గృహావసరాలకు అయితే ఒక కిలోవాట్, వ్యాపార సంస్థలు, పరిశ్రమలకు 100 కిలోవాట్ల వరకు సౌర విద్యుత్ కిట్లపై కేంద్రం సబ్సిడీ ఇస్తుందన్నారు. గృహావసరాలకు సంబంధించి మూడు కిలోవాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తికి రూ.3 లక్షలు పెట్టుబడి అవుతుందని వివరించారు. రోజుకు 15 యూనిట్లు వినియోగించగా కూడా అదనంగా విద్యుత్ ఉత్పత్తి అవుతుంటే గ్రిడ్‌కు అనుసంధానం చేసుకోవచ్చన్నారు. గ్రిడ్‌కు పంపిణీ చేసిన విద్యుత్‌ను ఆరు నెలలకు రీడింగ్ తీసి యూనిట్‌కు రూ.3.80 చెల్లిస్తామన్నారు.
మూడేళ్లలో జిల్లాలో 500 మెగావాట్ల సౌర విద్యుత్ : కలెక్టర్
జిల్లాలో రానున్న మూడేళ్లలో 500 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా సమగ్ర ప్రణాళిక రూపొందిస్తామని కలెక్టర్ కాటమనేని భాస్కర్ చెప్పారు. కలెక్టరు ఛాంబరులో సోమవారం నెడ్‌క్యాప్ ఎండీ కమలాకర్‌బాబుతో ఆయన సౌర విద్యుత్ ఉత్పత్తిపై చర్చించారు. జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో సౌర విద్యుత్ దీపాల ఏర్పాటువల్ల ఇప్పటికే 150 కిలోవాట్ల విద్యుత్ ఆదా అవుతోందన్నారు. జిల్లాలో 20 మెట్ట మండలాల్లో కేవలం విద్యుత్ ఆధారంగా పంటలు పండిస్తున్నారని చెప్పారు.
వ్యవసాయ పంపుసెట్లకు సౌర విద్యుత్ వినియోగించేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు. దీనివల్ల రోజూ పగటిపూట 10 గంటలపాటు నిరంతరాయంగా వ్యవసాయానికి విద్యుత్ అందుతుందని వివరించారు. కమలాకర్‌బాబు మాట్లాడుతూ వ్యవసాయ పంపుసెట్లకు సంబంధించిన సౌర విద్యుత్ కిట్లపై 90 శాతం ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చే కొత్త విధానం త్వరలో అమలులోకి వస్తుందని చెప్పారు. జిల్లాలో వెయ్యి సోలార్ పంపుసెట్లను రైతులకు అందిస్తామన్నారు. జేసీ టి.బాబురావునాయుడు, డీఆర్వో కె.ప్రభాకరరావు, జెడ్పీ సీఈవో వెంకటరెడ్డి, ట్రెరుునీ కలెక్టర్ రవిసుభాష్, నెడ్ క్యాప్ డీఎం ఎం.ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
సౌర విద్యుత్ నగరంగా ఏలూరు
Published Tue, Sep 23 2014 2:37 AM | Last Updated on Mon, Oct 22 2018 8:31 PM
Advertisement
Advertisement