మహిళల రక్షణకు ప్రత్యేక చర్యలు | Special Protection Measures Department of Women | Sakshi
Sakshi News home page

మహిళల రక్షణకు ప్రత్యేక చర్యలు

Published Fri, Nov 8 2013 3:30 AM | Last Updated on Sun, Sep 2 2018 4:46 PM

Special Protection Measures  Department of Women

 శ్రీకాకుళం కలెక్టరేట్, న్యూస్‌లైన్: మహిళలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించిన చట్టాలను అందుబాటులోకి తెచ్చి రక్షణ కల్పించడమే మహిళా కమిషన్ ప్రధాన ధ్యేయమని రాష్ట్ర మహిళా కమిషన్ అధ్యక్షురాలు త్రిపురాన వెంకటరత్నం అన్నారు. ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఆరు సంవత్సరాల సుదీర్ఘ కాలం తరువాత రాష్ట్ర ప్రభుత్వం మహిళా కమిషన్‌ను నియమించినట్టు తెలిపారు. కమిటీలో ఒక చైర్‌పర్సన్, ఆరుగురు మహిళా సభ్యులు ఉంటారని తెలిపారు. కమిటీ సివిల్ కోర్టు, క్రిమినల్ కోర్టు అధికారాలు కలిగి ఉంటుందని తెలిపారు. 
 
 వరకట్నం వేధింపులు, గృహ హింస, లైంగిక వేధింపులపై కమిటీ చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రభుత్వ కార్యాలయాలలో పదోన్నతులు, ఇంక్రిమెంట్లు తదితర సర్వీసుకు సంబంధించి మహిళలకు అన్యా యం జరిగినట్లు తమ దృష్టికి వస్తే వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. వరకట్నం, గృహహింస వేధింపులపై పోలీసు సూపరింటెండెంట్‌కు లేఖ రాసిన వారంలోగా విచారణ చేయిస్తామన్నారు. లైంగికదాడి బాధితులకు వైద్యసహాయం చేస్తామన్నారు. మహిళా శిశు సంక్షేమశాఖ ద్వారా విడతల వారీగా ఆర్థిక సాయం చేస్తామని తెలిపారు. మారుమూల గ్రామీణ మహిళలకు న్యాయం చేస్తామని, టెలిఫోన్, లేఖలు, మెయిల్ ద్వారా తమకు బాధితులు ఫిర్యాదు చేయవచ్చని చెప్పారు. కమిషన్‌కు వచ్చిన ఫిర్యాదులను స్వయంగా చదివి సంబంధిత శాఖలకు చర్యల నిమిత్తం పంపిస్తున్నట్టు వెల్లడించారు. 
 
 పతి ప్రభుత్వ కార్యాలయంలోను ఒక సీనియర్ అధికారి, ఒక ఎస్‌జీఓలతో ఇంటర్నల్ ఇంప్లైంట్ కమిటీలు  ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. కళాశాలల్లో యుక్తవయసు యువతీ, యువకులు కోసం సైకాలజిస్టులచే ప్రత్యేక సలహాలు, సూచనలు అందించాలన్నారు. జిల్లాలో మహిళల కోసం స్వాధాన్ హోమ్ మంజూరుకు కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేస్తామన్నారు. ఇటీవల విద్యా వ్యవస్థ విభిన్నంగా మారిందని, దీనివల్ల కొన్ని ఇబ్బందులు వస్తున్నాయని తెలిపారు. రాజ్యసభలో పాస్ అయిన మహిళా బిల్లు లోక్‌సభలో ఆమోదానికి కృషి చేస్తున్నామ్నారు. యువత సంప్రదాయాలను తెలుసుకుని క్రమశిక్షణతో మంచి నడవడికను అలవాటు చేసుకోవాలన్నారు.  ఈనెల 25 నుంచి డిసెంబర్ 10వ తేదీ వరకు విస్తారంగా మహిళా చట్టాలపైన, మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై విసృ్తత ప్రచారం చేస్తామని తెలిపారు. విలువలతో కూడిన సమాజం నిర్మాణానికి వ్యక్తిగత క్రమశిక్షణ అవసరమని ఆమె తెలిపారు. ఈ సమావేశంలో ఆమెతో పాటు కమిటీ సభ్యురాల ఎం.కస్తూరి ఉన్నారు.
 
 ఆదిత్యుడిని దర్శించుకున్న త్రిపురాన 
 అరసవల్లి: ప్రత్యక్ష దైవం, ఆరోగ్య ప్రదాత అరసవల్లి శ్రీ సూర్యనారాణస్వామి వారిని త్రిపురాన వెంకట రత్నం గురువారం ఉదయం దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు. దేవాలయ అనివెట్టి మండపంలో ఆలయ ప్రధాన అర్చకుడు ఇప్పిలి శంకరశర్మ ఆమెకు స్వామివారి ఆశీర్వచనాలు, లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement