సాక్షి, వర్గల్(గజ్వేల్): నాచగిరి శివకేశవుల నిలయం..జిల్లాలో సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం..కార్తీక పౌర్ణమి వేళ మంగళవారం సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు, కార్తీక దీపోత్సవంతో ఆధ్యాత్మిక అనుభూతులు పంచనున్నది. ఇందుకోసం నాచారం గుట్ట శ్రీలక్ష్మీ నృసింహ క్షేత్రం కార్తీక పౌర్ణమి మహోత్సవానికి సర్వసన్నద్ధమైంది. ఈ విశేష పర్వదినం రోజున క్షేత్రానికి భక్తులు భారీగా తరలివస్తారు. ఆలయ పుష్కరిణిలో పుణ్యస్నానాలాచరిస్తారు. శివాలయం పక్కన కార్తీక దీపాలు వెలిగించి దీపారాధన చేస్తారు. సకల శుభాలు కోరుతూ పెద్ద ఎత్తున భక్తులు కార్తీక సత్యనారాయణ వ్రతాలు జరుపుకుంటారు.
కార్తీకపౌర్ణమి రోజున సత్యనారాయణ వ్రతాల ప్రారంభ వేళలు
మొదటి విడత వ్రతాలు: | ఉదయం 6 గంటలకు |
రెండో విడత వ్రతాలు | ఉదయం 8 గంటలకు |
మూడో విడత వ్రతాలు | ఉదయం 10 గంటలకు |
నాలుగో విడత వ్రతాలు | మద్యాహ్నం 12 గంటలకు |
అయిదో విడత వ్రతాలు | సాయంత్రం 4.30 గంటలకు |
సామూహిక వ్రతాలకు విస్తృత ఏర్పాట్లు..
నాచగిరిలో కార్తీక పౌర్ణమి మహోత్సవం సందర్భంగా ఆలయ యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. వ్రతభక్తులకు ఇబ్బంది కలగకుండా ఉదయం 6 గంటల నుంచే సత్యదేవుని వ్రతాలు ప్రారంభమవుతాయి. తొలి విడత ఉదయం 6 గంటలకు , రెండో విడత ఉదయం 8 గంటలకు, మూడో విడత ఉదయం 10 గంటలకు, నాలుగో విడత మద్యాహ్నం 12 గంటలకు, చివరి విడత సాయంత్రం 4.30 గంటలకు వ్రతాలు ప్రారంభమవుతాయి. వ్రతాలు జరిపించుకునే భక్తులు కౌంటర్లలో టికెట్లు తీసుకోవాల్సి ఉంటుంది. వారితో పురోహిత పరివారం ఆలయ వ్రతమండపంలో వ్రతాలు జరిపిస్తారు.
నేడు సాయంత్రం కార్తీక దీపోత్సవం
కార్తీక పౌర్ణమి సందర్భంగా నాచగిరి క్షేత్రంలో మంగళవారం సాయంత్రం భక్తజన సామూహిక కార్తీక దీపోత్సవం ఘనంగా నిర్వహించనున్నారు. సాయంత్రం 6.30 గంటలకు ఈ వేడుక ప్రారంభమవుతుంది. ఆలయ ఆవరణలో వివిధ ఆకృతులలో వెలుగులు విరజిమ్ముతూ దీపాల వరుసలు నేత్ర
పర్వం చేయనున్నాయి.
దుబ్బాకటౌన్: హిందువులకు కార్తీక మాసం ఎంతో పవిత్రమైనది, కార్తీకం ఈ పేరు వింటేచాలు బాధలు క్షణాల్లో తొలగిపోతాయని భక్తుల నమ్మకం. కార్తీక మాసంలో తమ ఇంట్లో వ్రతాలు (నోము) చేస్తే సర్వ సుఖాలు అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయన్న విశ్వాసం. అందుకే కార్తీక మాసంలో పెద్దనోములు, దీపారాధనలు చేయడం అనవాయితీగా వస్తోంది.
పవిత్రమైన రోజు..
కార్తీక శుద్ధ పౌర్ణమి అనగా కార్తీక మాసంలో శుక్లపక్షంలో పున్నమి తిథి కల్గిన పదిహేనవరోజు. కార్తీక మాసంలో చివరిరోజైన పౌర్ణమి ఎంతో పవిత్రమైనదిగా భక్తులు భావిస్తారు. అన్ని మాసాల్లో ఈ కార్తీక మాసానికే విశిష్టత ఉందని వేదాలు, పురణాలు చెబుతున్నాయి. ఈ మాసంలో ప్రతిదినం ఓ పర్వ దినమే అందులో ముఖ్యమైనవి భగిని, హస్తభూజనం, నాగుల చవితి, నాగుల పంచమి, ఉరŠాధ్వన ఏకాదశి, క్షీరాబ్ధి ద్వాదశి, చివరిగా కార్తీక పౌర్ణమి.
ప్రతీ ఇంటా నోములు, వ్రతాలు..
కార్తీకమాసం వచ్చిందంటనే ప్రతి ఇంటా నోములు(వ్రతాలు) ప్రత్యేకం. ప్రతీ ఏటా కార్తీక మాసంలో పెద్దనోములు( కేదారీశ్వర వ్రతం), సత్యనారాయణ వ్రతం,భక్తీశ్వర వ్రతాలు చేసుకుంటారు. కార్తీక దీపారాధన
కార్తీక దీపానికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. జ్ఞానానికి చిహ్నం దీపం, సర్వసంపదలు జ్ఞానం వల్లనే లభిస్తాయి.ఈ మాసమంతా దీపారాధన చేసి చివరిరోజున వెలుగుతున్న వెండి ప్రమిదను దానం చేస్తే అనంత పుణ్యఫలం, సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. శివ, విష్ణుదేవలయాలు రెండింట స్త్రీలు ఎంతో నిష్టతో దీపాలు వెలిగిస్తారు. ప్రతీ ఇంటా కార్తీక పౌర్ణమి రోజున ఉదయాన్నే ఉసిరి కాయలు, ఆకులతో మరిగించిన నీటితో తలస్నానాలు ఆచరించి ఇంట్లో తులసికోట వద్ద మహిళలు నేతితో నింపిన భరిణిల్లో దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేస్తారు. దీపావళి రోజు నుంచి ఈ కార్తీక పౌర్ణమి వరకు 15 రోజులు తమ ఇండ్ల ముందర సాయం కాళంలో దీపాలు పెడుతారు.
కార్తీక వనభోజనాలు...
కార్తీకపౌర్ణమి రోజున శివ, విష్ణు ఆలయాలను భక్తులు పెద్ద ఎత్తున దర్శించుకుంటారు.అలాగే కార్తీక వనభోజనాలకు వెళ్లడం ముఖ్యంగా ఉసిరిచెట్ల నీడలో కుటుంబసమేతంగా వన భోజనాలు చేయడం చాలా శ్రేష్టం.
దీపారాధన శుభప్రదం..
కార్తీక మాసంలో దీపాలను వెలిగించడం, ఆకాశదీపాలు వెలిగించడం, నదిలో దీపాలను వదలడం, దీపదానం చేయడం అత్యంత శుభప్రదం. వీటిని తప్పనిసరిగా ఆచరించాలని శాస్త్రం చెబుతున్నది. కార్తీకమాసమంతా ఇంటిముందర ద్వారానికి ఇరువైపుల దీపాలు వెలిగించి పెట్టాలి. సాయం వేళలో శివాలయాల్లో గాని, వైష్ణవాలయాల్లోగాని, గోపుర ద్వారం లేదా దేవుడి సన్నిధానంలో గాని, ఆలయ ప్రాంగణంలో గాని దీపాలను వెలిగిస్తే సర్వపాపాలు తొలగిపోతాయని శాస్త్రం చెబుతున్నది. శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన కార్తీక మాసానికి సమానమైన మాసం లేదు. ఉపవాస నియమాలు పాటించడం శుభప్రదం.
– హరిప్రసాద్ శర్మ, నాచగిరి వేదపండితులు
తెలంగాణ ప్రాంత భక్తుల ఆరాధ్యక్షేత్రం నాచగిరి. ఇక్కడ జరిగే ప్రతీ కార్యక్రమం పండుగలా జరగాలన్నదే అభిమతం. అదేవిధంగా మంగళవారం కార్తీకపౌర్ణమి మహోత్సవం పండుగ వాతావరణంలో నిర్వహిస్తాం. కార్తీక పౌర్ణమి రోజున పెద్ద ఎత్తున కార్తీక వ్రతాలు జరుగనున్నాయి. అలాగే సాయంత్రం కార్తీక దీపోత్సవం జరుగుతుంది. ఇందుకోసం విస్తృత ఏర్పాట్లు చేశాం. ఉదయం నుంచి సాయంత్రం వరకు రద్దీకి అనుగుణంగా విడతల వారీగా వ్రతాలు జరిపిస్తాం. అదేవిధంగా సామూహిక కార్తీక దీపోత్సవం సాయంత్రం 6.30కు ప్రారంభమవుతుంది
– కట్టా సుధాకర్‌రెడ్డి (నాచగిరి ఆలయ కార్యనిర్వహణాధికారి)
Comments
Please login to add a commentAdd a comment