
కుట్రతోనే శాఖ మార్చారు
సీఎం తెలంగాణ ప్రజలను అవమానించారు
అందుకే రాజీనామా చేశా : శ్రీధర్‌బాబు
సాక్షి, హైదరాబాద్ : శాసనసభ వ్యవహారాల శాఖ నుంచి తనను తప్పించడం తెలంగాణలోని 4 కోట్లమంది ప్రజలను తీవ్ర మనస్తాపానికి గురిచేసిందని పౌరసరఫరాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు.
తెలంగాణ బిల్లును అడ్డుకునే కుట్రలో భాగంగానే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ పని చేశారని ఆరోపించారు. అందుకు నిరసనగానే మంత్రి పదవికి రాజీనామా చేశానని చెప్పారు. తెలంగాణ కోసం ఎందరో తల్లులు తమ బిడ్డలను పోగొట్టుకున్నారని, వారి త్యాగం ముందు తన రాజీనామా కాలిగోటితో సమానమని చెప్పారు. హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని పదేపదే చెప్పిన కిరణ్‌కుమార్‌రెడ్డి అందుకు భిన్నంగా వ్యవహరించడం బాధాకరమన్నారు. తన రాజీనామా అంశాన్ని హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లడంతోపాటు బిల్లును అడ్డుకునేందుకు జరుగుతున్న కుట్రలను కూడా వివరిస్తానన్నారు. దీంతోపాటు అసెంబ్లీలోనూ రాజీనామా అంశాన్ని లేవనెత్తుతానని చెప్పారు. శుక్రవారం మధ్యాహ్నం శ్రీధర్‌బాబు తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ రాజీనామాకు దారితీసిన కారణాలను వివరించారు. ‘‘వ్యక్తిగత స్వార్థం కోసం నేను మంత్రి పదవికి రాజీనామా చేయలేదు.
నాకు సీఎం అదనంగా మంచి శాఖను ఇచ్చారా? లేదా? అనేది కూడా వేరే అంశం. కానీ ఆయన తీసుకున్న నిర్ణయం 4 కోట్ల తెలంగాణ ప్రజలను తీవ్ర మనస్తాపానికి గురిచేసింది. శాసనసభ నిబంధనలు, సాంప్రదాయాలతోపాటు బీఏసీలో తీసుకున్న నిర్ణయం మేరకే నేను సభలో బిల్లును ప్రవేశపెట్టాను. సీఎం తీసుకున్న శాఖ మార్పు నిర్ణయం తెలంగాణ ప్రజలను అవమానించేలా ఉంది. శాఖల మార్పు సీఎం విచక్షణలో భాగమే అయినప్పటికీ ఈ సమయంలో కవ్వింపు చర్యలు సరికాదు. నూటికి నూరుశాతం అధికార దుర్వినియోగం చేశారు. ఈ సంగతి తెలిసినప్పటికీ సీఎం, సీమాంధ్ర నేతలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం, బిల్లును ఆపే కుట్రలో భాగంగానే శాఖను మార్చారు. తెలంగాణ వ్యతిరేక శక్తులపై తిరుగుబాటు ఉంటుందని చెప్పడానికే ఈ పని చేశాను’’అని అన్నారు.
సీఎం చెప్పేవన్నీ అసత్యాలే: తెలంగాణ విషయంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చెబుతున్న మాటలన్నీ అసత్యాలేనని శ్రీధర్‌బాబు చెప్పారు. ‘‘తెలంగాణపై హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని ఎన్నోసార్లు చెప్పారు. ఇప్పుడేమో మాటతప్పి బిల్లును అడ్డుకుంటున్నారు. అసెంబ్లీలో విభజన బిల్లును ప్రవేశపెట్టనేలేదని చెబుతూ తప్పుదోవపట్టిస్తున్నారు. అసెంబ్లీలో వెంటనే విభజన బిల్లుపై చర్చించాలని బీఏసీ తీసుకున్న నిర్ణయం నిజం కాదా? దానికి సీఎం హాజరుకావడం...ఆయన పేరుతో బులెటిన్ విడుదల కావడం నిజం కాదా? ఆ తరువాత అసెంబ్లీ కార్యదర్శి సభలో విభజన బిల్లును చదవడం నిజ ం కాదా? ఆ బిల్లుకు నేను మద్దతు చెబుతూ చర్చను ప్రారంభిస్తున్నట్లు చెప్పడం నిజం కాదా? ఆ వెంటనే డిప్యూటీ స్పీకర్ బిల్లుపై చంద్రబాబును మాట్లాడాలని కోరడం నిజం కాదా? అన్నీ నిజాలేనని తెలిసినప్పటికీ అసలు చర్చ ప్రారంభమే కాలేదని అసత్యాలు చెప్పడం న్యాయమా?’’అని ప్రశ్నించారు. రాజకీయ లబ్ధి కోసం కొందరు నేతలు వక్రభాష్యాలు చెబుతూ సమైక్య తీర్మానం ప్రవేశపెట్టే దిశగా కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.
వాస్తవానికి సభలో ఏదైనా ఒక అంశంపై చర్చ మొదలయ్యాక... అది పూర్తయ్యే వరకు మరే అంశాన్ని చేపట్టడానికి వీల్లేదని అన్నారు. తెలంగాణ కోసం నాలుగేళ్లుగా తమ ప్రాంత ప్రజలు ఆందోళన చేస్తున్నా కాంగ్రెస్‌కు, కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వానికి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఎంతగానో సహకరించామన్నారు. ఈ తరుణంలో తనపై ఎన్నో ఆరోపణలు వచ్చినా, అవమానాలు ఎదురైనా భరించానన్నారు. కొందరు జేఏసీ నేతలు చివరకు తన తండ్రి శ్రీపాదరావుపై వ్యక్తిగత ఆరోపణలు చేసినా తెలంగాణ వస్తుందనే ఆశతో ప్రతిఘటించకుండా ఓపిక పట్టానని చెప్పారు. ఇంత చేసినా సీఎం ఈ విధంగా వ్యవహరించడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. పరిపక్వతలేని సీఎం చర్యలు ప్రజాస్వామ్యాన్ని బలహీనపర్చేలా ఉన్నాయని అన్నారు.
తెలంగాణ మంత్రులూ రాజీనామాకు వెనుకాడరు: సమయం వచ్చినప్పుడు తెలంగాణ మంత్రులంతా రాజీనామాకు వెనుకాడబోరని శ్రీధర్‌బాబు చెప్పారు. విభజన బిల్లుపై సభలో చర్చ జరుగుతున్న తరుణంలో అందరూ రాజీనామా చేయడం సరికాదనే ఆగిపోయారన్నారు. ఎవరేం చేసినా, తనపై మరెన్ని ఆరోపణలు వచ్చినా తాను మాత్రం క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా హైకమాండ్ ఆదేశాలు, ఎజెండా ప్రకారమే ముందుకు వెళుతున్నానని చెప్పారు.
శ్రీధర్‌బాబుకు సంఘీభావం: శ్రీధర్‌బాబు మంత్రి పదవికి రాజీనామా చేసిన వెంటనే పెద్ద ఎత్తున మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు తరలివచ్చి ఆయనకు సంఘీభావం తెలిపారు. మంత్రులు జానారెడ్డి, బసవరాజు సారయ్య, ప్రభుత్వ విప్ ఆరెపల్లి మోహన్, ఎమ్మెల్యేలు ప్రవీణ్‌రెడ్డి, కిష్టారెడ్డి, ఆకుల రాజేందర్, నందీశ్వర్‌గౌడ్, మాజీమంత్రి జీవన్‌రెడ్డి, ఎమ్మెల్సీలు భానుప్రసాద్, సంతోష్‌కుమార్, బి.వెంకట్రావుతోపాటు వందలాది మంది నాయకులు శ్రీధర్‌బాబును ఆయన నివాసంలో కలిశారు. కార్యకర్తలు ‘జై తెలంగాణ, జై శ్రీధర్‌బాబు’ అంటూ నినాదాలు చేశారు.