నేటి నుంచి శ్రీనివాస కల్యాణాలు
తెలుగు రాష్ట్రాల్లో ఎనిమిది ప్రాంతాల్లో నిర్వహణ
తిరుపతి: టీటీడీ ఆధ్వర్యంలోని కల్యాణం ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో శుక్రవారం నుంచి 30వ తేదీ వరకు శ్రీనివాస కల్యాణాలు నిర్వహించేందుకు అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు. రెండు రాష్ట్రాల్లోనూ మొత్తం 8 ప్రాంతాల్లో ఈ ఉత్సవాలు నిర్వహించనున్నారు. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవేంకటపతి వైభవాన్ని నలుదిశలా వ్యాప్తి చేసేందుకే ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్టు టీటీడీ అధికారులు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్‌లో...
8వతేదీ(శుక్రవారం) శ్రీకాకుళం జిల్లా సీతంపేట మండలం మర్రిపాడు మండల పరిషత్ స్కూలు, 9న ఉదయం 11 గంటలకు అడ్డంగి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, 15వ తేదీన విజయనగరం జిల్లా పార్వతీపురం మండలంలోని కొమరాడ గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, 16న కోనేరు గ్రామంలోని ఏపీ ఆశ్రమ పాఠశాల, 18న ఉదయం 11 గంటలకు విశాఖపట్నం జిల్లా పాడేరు మండలంలోని లంబసింగి గిరిజన సంక్షేమ పాఠశాల, 19న చింతపల్లిలోని శ్రీముత్యాలమ్మ ఆలయంలో కల్యాణాలు జరగనున్నాయి.
తెలంగాణలో...
29న ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని ఇందర్‌వెల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, 30న కరిమేరి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కల్యాణోత్సవాలు నిర్వహించనున్నారు. మరోవైపు శ్రీవారి తలనీలాలను ఈ-వేలంలో విక్రయించడం ద్వారా టీటీడీకి రూ. 14.56 కోట్లు లభించింది.