ఏపీ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా స్టీఫెన్‌ రవీంద్ర! | Stephen Raveendra New Intelligence Chief Of AP | Sakshi
Sakshi News home page

ఏపీ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా స్టీఫెన్‌ రవీంద్ర!

Published Tue, May 28 2019 3:35 AM | Last Updated on Tue, May 28 2019 5:14 AM

Stephen Raveendra New Intelligence Chief Of AP - Sakshi

సాక్షి, హైదరాబాద్‌/అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా స్టీఫెన్‌ రవీంద్ర నియామకం ఖరారైంది. ఈ మేరకు ఏపీ నిశ్చయ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన ప్రతిపాదనకు తెలంగాణ ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఉభయ రాష్ట్రాల మధ్య పరస్పర అంగీకారం కుదరడంతో ఇక డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పర్సనల్‌ అండ్‌ ట్రైనింగ్‌ (డీవోపీటీ) నుంచి అధికారిక ఆమోదం రావడమే మిగిలింది. ఇందుకు మూడు వారాలు పట్టే అవకాశం ఉంది. తెలంగాణ కేడర్‌కు చెందిన 1999 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి స్టీఫెన్‌ రవీంద్ర విధి నిర్వహణలో సమర్థుడిగా పేరు తెచ్చుకున్నారు. ఉమ్మడి ఏపీలో అనంతపురం, వరంగల్‌ జిల్లాల్లో ఎస్పీగా విధులు నిర్వహించారు. తెలంగాణలో మావోయిజం, రాయలసీమలో ఫ్యాక్షనిజానికి కళ్లెం వేయడంలో సఫలీకృతమయ్యారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో స్టీఫెన్‌ రవీంద్ర ఆయనకు చీఫ్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌గానూ పనిచేశారు. ప్రస్తుతం ఆయన తెలంగాణ రాష్ట్రంలో ఐజీగా కొనసాగుతున్నారు. ఏపీ, తెలంగాణల్లో సంచలనం సృష్టించిన ప్రజల వ్యక్తిగత డేటా చోరీ కేసులో టీఎస్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందానికి స్టీఫెన్‌ రవీంద్ర నేతృత్వం వహిస్తున్నారు. విధి నిర్వహణలో ఆయన పలు పురస్కారాలు పొందారు. 2010లో ప్రధానమంత్రి పోలీసు మెడల్, 2016లో ప్రెసిడెంట్‌ పోలీస్‌ మెడల్‌ అందుకున్నారు. 

ఏపీ అడగ్గానే అంగీకరించిన తెలంగాణ.. 
ఏ రాష్ట్రానికైనా నిఘా విభాగం అత్యంత కీలకం. పైగా ఏపీకి దేశంలోనే అత్యంత పొడవైన తీర ప్రాంతం ఉండటంతోపాటు ఒడిశా, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడుతో సరిహద్దు ప్రాంతాలు ఉన్నాయి. భౌగోళికంగా పెద్ద రాష్ట్రమైన ఏపీలో ఇంటెలిజెన్స్‌కు నేతృత్వం వహించడం అంత సులువు కాదు. గతంలో విధి నిర్వహణలో స్టీఫెన్‌కు ఉన్న అనుభవాన్ని ఏపీ ప్రభుత్వం ఉపయోగించుకోవాలని భావించింది. ఇటీవల తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఇంటికి ఏపీ నిశ్చయ ముఖ్యమంత్రి జగన్‌ వెళ్లడం.. అక్కడ ఆయనకు కేసీఆర్‌ ఘనస్వాగతం పలికి సన్మానించిన సంగతి తెలిసిందే. ఈ భేటీతో రెండు రాష్ట్రాల మధ్య పరస్పర సహకారం కొనసాగుతుందని ఇరువురూ చాటిచెప్పారు. ఈ స్నేహపూర్వక వాతావరణం కారణంగానే ఏపీ ప్రభుత్వం స్టీఫెన్‌ రవీంద్రను కావాలని అడగ్గానే తెలంగాణ సర్కారు అంగీకరించడం చకచకా జరిగిపోయాయి. ఈ నేపథ్యంలో సోమవారం స్టీఫెన్‌ రవీంద్ర గుంటూరు జిల్లా తాడేపల్లి వెళ్లి జగన్‌తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. మరోవైపు ఏపీ విజిలెన్స్‌ ఎన్‌ఫోర్సుమెంట్‌ డైరెక్టర్‌ డి.గౌతం సవాంగ్‌ కూడా వైఎస్‌ జగన్‌ను కలిశారు.

మరికొందరు కూడా..! 
తెలంగాణలో ఆరుగురు ఐపీఎస్‌ అధికారులు ఏపీకి డిప్యుటేషన్‌పై వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారని సమాచారం. ఇప్పటికే ముగ్గురు అధికారులు ఇదే విషయమై విజయవాడ వెళ్లి ప్రయత్నించినట్లు తెలిసింది. హైదరాబాద్‌లో పనిచేస్తున్న ఐదుగురు, ఉత్తర తెలంగాణలో పనిచేస్తున్న మరో అధికారి కూడా ఏపీకి వెళ్లే ప్రయత్నాల్లో ఉన్నట్లు సమాచారం.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement