Intelligence chief
-
ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ చీఫ్ రాజీనామా
టెల్అవీవ్: ఇజ్రాయెల్‌కు పీడకలగా మిగిలిన గతేడాది హమాస్ దాడులకు బాధ్యత వహిస్తూ ఆ దేశ ఇంటెలిజెన్స్ గ్రూప్ యూనిట్ 8200 చీఫ్ యాస్సి సారిల్ రాజీనామా చేశారు. హమాస్ చేసిన దాడులను అడ్డుకోవడంలో విఫలమైనందున తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు సారిల్ వెల్లడించారు. హమాస్ దాడులకు బాధ్యత వహిస్తూ ఇప్పటికే ఇజ్రాయెల్ మిలిటరీ నిఘా విభాగం అధిపతి మేజర్ జనరల్ అహరోన్ హలీవా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. కాగా, గతేడాది అక్టోబరు 7న హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌పై మెరుపుదాడికి దిగారు. ఈ దాడుల్లో 1200 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం 250 మంది ఇజ్రాయెల్ పౌరులను హమాస్ మిలిటెంట్లు బందీలుగా తీసుకెళ్లారు. దీనికి ప్రతిగా హమాస్‌కు కేంద్రంగా ఉన్న పాలస్తానాలోని గాజాపై గతేడాది నుంచి ఇజ్రాయెల్ బాంబులతో విరుచుకుపడుతోంది. ఇజ్రాయెల్ బాంబు దాడుల్లో ఇప్పటివరకు 41వేల118 మంది మృతి చెందినట్లు గణాంకాలు చెబుతున్నాయి. దాడుల్లో మృతి చెందిన వారిలో ఎక్కువ మంది చిన్నారులు, మహిళలేనని వెల్లడించింది. ఇదీ చదవండి.. మోదీ గొప్ప స్నేహితుడు: పుతిన్ -
రాజకీయ కక్షతో విజయవాడ సీపీపై బదిలీ వేటు
సాక్షి, విజయవాడ: రాజకీయ కక్షతోనే విజయవాడ సీపీపై బదిలీ వేటు పడింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసును విజయవాడ సీపీ కాంతిరాణా దర్యాప్తు చేస్తున్నారు. అయితే విచారణ చేస్తున్న కాంతిరాణాపై కక్షతో టీడీపీ, జనసేన, బీజేపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఐపీఎస్ అధికారులపై తప్పుడు ఫిర్యాదులతో కూటమి బ్లాక్మెయిల్ చేసింది. ఈ క్రమంలో ష్ట్రంలో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. ఇంటెలిజెన్స్ డీజీ పీఎస్ఆర్ ఆంజనేయులు, విజయవాడ సీపీని బదిలీ చేస్తున్నట్లు ఎన్నికల సంఘం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా సీఎం జగన్‌పై హత్యాయత్నం కేసులో ఇప్పటికే వేముల సతీష్ అరెస్టయ్యారు. టీడీపీ నేత బోండా ఉమకు వేముల సతీష్అనుచరుడిగా ఉన్నారు. విచారణ కీలక దశలో ఉండగా సీపీ కాంతిరాణా బదిలీ కావడం చర్చనీయాంశంగా మారింది. -
నిజ్జర్ హత్య కేసు.. కెనడా మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ కీలక వ్యాఖ్యలు
ఒట్టావో: ఖలిస్తానీ ఉద్యమ నేత హర్దీప్సింగ్ నిజ్జర్ హత్య కేసు విచారణలో భారత్ నుంచి పూర్తి సహకారం అందుతోందని కెనడా తాజా మాజీ నేషనల్ సెక్యూరిటీ అండ్ ఇంటెలిజెన్స్ అడ్వైజర్ జోడీ థామస్ తెలిపారు. శుక్రవారం ఆమె తన పదవి నుంచి రిటైర్ అయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ‘నిజ్జర్ హత్య కేసు విచారణలో భారత్ పూర్తిగా సహకరిస్తోంది. రెండు దేశాల మధ్య సంబంధాలు మళ్లీ బలోపేతమయ్యే దిశగా ముందుకు వెళుతున్నాయి. నిజ్జర్ హత్య కేసులో ఇంటిగ్రేటెడ్ హోమిసైడ్ ఇన్వెస్టిగేషన్ టీమ్ విచారణ చేస్తోంది. విచారణ సాఫీగా సాగేందుకు భారత్ మాతో కలిసి పనిచేస్తోంది’ అని థామస్ చెప్పారు. కెనడాలోని బ్రిటీష్ కొలంబియాలో ఉన్న సర్రే నగరంలో 2023 జూన్ 18న నిజ్జర్ హత్య జరిగింది. ఈ హత్యకు భారత్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్(రా) వింగ్‌కు చెందిన ఏజెంట్లకు ఉన్న లింకుపై విచారణ చేపట్టామని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో అప్పట్లో ఆ దేశ హౌజ్ ఆఫ్ కామన్స్‌లో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ వ్యాఖ్యల తర్వాత ఇరు దేశాలు రాయబారులను పరస్పరం బహిష్కరించాయి. ట్రూడో వ్యాఖ్యలు అభ్యంతరకరమని అప్పట్లో భారత్ ఖండించింది. ఇదీచదవండి.. వేధింపుల కేసులో భారత అమెరికన్ జంటకు 20 ఏళ్ల జైలు -
తెలంగాణ ఇంటెలిజెన్స్ అదనపు డీజీగా అనిల్‌కుమార్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఇంటెలిజెన్స్ అదనపు డీజీగా అనిల్‌కుమార్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఇంటెలిజెన్స్ అదనపు డీజీగా పనిచేస్తోన్న ప్రభాకర్‌రావు గడువు ముగియడంతో అనిల్‌కుమార్‌ను ప్రభుత్వం ఎంపిక చేసింది. ట్రాఫిక్ అదనపు సీపీ నుంచి ఇంటెలిజెన్స్ ఏడీజీగా అనిల్‌కుమార్ పనిచేయనున్నారు. అనిల్ కుమార్ స్థానంలో చౌహాన్‌కు పూర్తి అదనపు బాధ్యతలను అప్పగించారు. అనిల్ కుమార్ 1996 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. -
శ్రీలంక ఇంటెలిజెన్స్ చీఫ్‌గా రువాన్ కులతుంగ
కొలంబో : శ్రీలంక జాతీయ ఇంటెలిజెన్స్ చీఫ్ గా మేజర్ జనరల్ రువాన్ కులతుంగ నియమితులు కానున్నారు. ఉగ్ర దాడుల గురించి ఇంటెలిజెన్స్ ముందుగానే హెచ్చరించినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదని అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ సిసిరా మెండిస్ ఆరోపించడంతో అధ్యక్షుడు సిరిసేన మెండిస్‌ను తొలగించిన సంగతి తెలిసిందే. రక్షణ మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్న సిరిసేన గతవారం విచారణకు ముందే మెండిస్‌ను తొలగిస్తున్నట్లు ప్రకటించారు. జాతీయ తౌహీద్ జమాత్ జరిపిన బాంబ్ దాడులు అనంతరం పోలీస్ చీఫ్ పూజిత్ జయసుందర, రక్షణ శాఖ ఉన్నతాధికారి హేమసిరి ఫెర్నాండోలను కూడా సిరిసేన విధుల నుంచి తొలగించారు. -
ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా స్టీఫెన్ రవీంద్ర!
సాక్షి, హైదరాబాద్/అమరావతి : ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా స్టీఫెన్ రవీంద్ర నియామకం ఖరారైంది. ఈ మేరకు ఏపీ నిశ్చయ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన ప్రతిపాదనకు తెలంగాణ ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఉభయ రాష్ట్రాల మధ్య పరస్పర అంగీకారం కుదరడంతో ఇక డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (డీవోపీటీ) నుంచి అధికారిక ఆమోదం రావడమే మిగిలింది. ఇందుకు మూడు వారాలు పట్టే అవకాశం ఉంది. తెలంగాణ కేడర్‌కు చెందిన 1999 బ్యాచ్ ఐపీఎస్ అధికారి స్టీఫెన్ రవీంద్ర విధి నిర్వహణలో సమర్థుడిగా పేరు తెచ్చుకున్నారు. ఉమ్మడి ఏపీలో అనంతపురం, వరంగల్ జిల్లాల్లో ఎస్పీగా విధులు నిర్వహించారు. తెలంగాణలో మావోయిజం, రాయలసీమలో ఫ్యాక్షనిజానికి కళ్లెం వేయడంలో సఫలీకృతమయ్యారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో స్టీఫెన్ రవీంద్ర ఆయనకు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌గానూ పనిచేశారు. ప్రస్తుతం ఆయన తెలంగాణ రాష్ట్రంలో ఐజీగా కొనసాగుతున్నారు. ఏపీ, తెలంగాణల్లో సంచలనం సృష్టించిన ప్రజల వ్యక్తిగత డేటా చోరీ కేసులో టీఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందానికి స్టీఫెన్ రవీంద్ర నేతృత్వం వహిస్తున్నారు. విధి నిర్వహణలో ఆయన పలు పురస్కారాలు పొందారు. 2010లో ప్రధానమంత్రి పోలీసు మెడల్, 2016లో ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ అందుకున్నారు. ఏపీ అడగ్గానే అంగీకరించిన తెలంగాణ.. ఏ రాష్ట్రానికైనా నిఘా విభాగం అత్యంత కీలకం. పైగా ఏపీకి దేశంలోనే అత్యంత పొడవైన తీర ప్రాంతం ఉండటంతోపాటు ఒడిశా, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడుతో సరిహద్దు ప్రాంతాలు ఉన్నాయి. భౌగోళికంగా పెద్ద రాష్ట్రమైన ఏపీలో ఇంటెలిజెన్స్‌కు నేతృత్వం వహించడం అంత సులువు కాదు. గతంలో విధి నిర్వహణలో స్టీఫెన్‌కు ఉన్న అనుభవాన్ని ఏపీ ప్రభుత్వం ఉపయోగించుకోవాలని భావించింది. ఇటీవల తెలంగాణ సీఎం కేసీఆర్ ఇంటికి ఏపీ నిశ్చయ ముఖ్యమంత్రి జగన్ వెళ్లడం.. అక్కడ ఆయనకు కేసీఆర్ ఘనస్వాగతం పలికి సన్మానించిన సంగతి తెలిసిందే. ఈ భేటీతో రెండు రాష్ట్రాల మధ్య పరస్పర సహకారం కొనసాగుతుందని ఇరువురూ చాటిచెప్పారు. ఈ స్నేహపూర్వక వాతావరణం కారణంగానే ఏపీ ప్రభుత్వం స్టీఫెన్ రవీంద్రను కావాలని అడగ్గానే తెలంగాణ సర్కారు అంగీకరించడం చకచకా జరిగిపోయాయి. ఈ నేపథ్యంలో సోమవారం స్టీఫెన్ రవీంద్ర గుంటూరు జిల్లా తాడేపల్లి వెళ్లి జగన్‌తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. మరోవైపు ఏపీ విజిలెన్స్ ఎన్ఫోర్సుమెంట్ డైరెక్టర్ డి.గౌతం సవాంగ్ కూడా వైఎస్ జగన్‌ను కలిశారు. మరికొందరు కూడా..! తెలంగాణలో ఆరుగురు ఐపీఎస్ అధికారులు ఏపీకి డిప్యుటేషన్‌పై వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారని సమాచారం. ఇప్పటికే ముగ్గురు అధికారులు ఇదే విషయమై విజయవాడ వెళ్లి ప్రయత్నించినట్లు తెలిసింది. హైదరాబాద్‌లో పనిచేస్తున్న ఐదుగురు, ఉత్తర తెలంగాణలో పనిచేస్తున్న మరో అధికారి కూడా ఏపీకి వెళ్లే ప్రయత్నాల్లో ఉన్నట్లు సమాచారం. -
ఏపీ ఇంటెలిజెన్స్ బాస్ ఎవరు?
సాక్షి, అమరావతి: చంద్రబాబు పాలనలో అత్యంత వివాదాస్పదమైన ఇంటెలిజెన్స్ బాస్ పోస్టుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టనున్న తరుణంలో పోటీ పెరిగింది. ఈ పోస్టును ముగ్గురు సీనియర్ ఐపీఎస్‌లు ఆశిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు హయాంలో పోలీస్ శాఖ భుజంపై రాజకీయ అజెండాను మోయించడంతో అనేక వివాదాలు పోలీసులను చుట్టుముట్టాయి. మొత్తం పోలీస్ వ్యవస్థకే దిశానిర్దేశం చేయాల్సిన డీజీపీ నుంచి కొన్ని సబ్ డివిజన్లలోని డీఎస్పీల వరకు రాజకీయ ఉచ్చులో పడిపోవడంతో అపఖ్యాతిపాలయ్యారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను పరిరక్షించడంలో రాజకీయాలకు అతీతంగా, నిష్పక్షపాతంగా పనిచేయాల్సిన కొందరు పోలీసులు వ్యవహరించిన తీరు అనేక విమర్శలకు తావిచ్చింది. ఇటువంటి పరిస్థితుల్లో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో ఏర్పడనున్న కొత్త సర్కారు కొలువు తీరిన వెంటనే పోలీసు శాఖలో ప్రక్షాళన మొదలవుతుందనే ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలోని ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో ఈ నెల 24న తాడేపల్లిలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలోనూ నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, ప్రక్షాళన చేస్తామని వైఎస్ జగన్ వ్యాఖ్యలు చేసినట్టు పోలీసు శాఖలో చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో గత ఐదేళ్లుగా ‘పచ్చ’పాతంతో వ్యవహరించిన పోలీసు అధికారులు మార్పునకు మానసికంగా సిద్ధమైనట్టు చర్చించుకుంటున్నారు. ఠాకూర్ స్థానంలో సవాంగ్! ఇప్పటికే డీజీపీ ఆర్పీ ఠాకూర్ స్థానంలో గౌతమ్ సవాంగ్ పోలీస్ బాస్ అవుతారని, అధికారిక ఉత్తర్వులు రావడమే ఆలస్యమని పోలీసు శాఖలో చర్చ సాగుతోంది. తాజాగా ఇంటెలిజెన్స్ చీఫ్ కూడా మారతారంటూ ప్రచారం జరుగుతోంది. ఇంటెలిజెన్స్ బాస్‌గా పనిచేసిన ఏబీ వెంకటేశ్వరరావు పూర్తిగా చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారంటూ ఆరోపణలు, ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ఎన్నికల విధుల నుంచి ఆయనను తప్పిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ఆదేశాలు ఇచ్చిన సంగతి తెల్సిందే. చివరి నిమిషం వరకు ఆయనను కొనసాగించేందుకు చంద్రబాబు చేసిన ప్రయత్నాలకు కోర్టులోనూ చుక్కెదురు కావడంతో వెంకటేశ్వరరావును బదిలీ చేయక తప్పలేదు. అయితే వెంకటేశ్వరరావుపై మమకారం చంపుకోని చంద్రబాబు ఆయనను ఏసీబీ డీజీగా నియమించడం గమనార్హం. ముగిసిన ఎన్నికల కోడ్ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా వెంకటేశ్వరరావు స్థానంలో ఏపీ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్‌గా ఉన్న కుమార్ విశ్వజిత్‌ను ఈసీ నియమించింది. సార్వత్రిక ఎన్నికల కోడ్ మే 26న ముగియడంతో కుమార్ విశ్వజిత్ నియామకం గడువు కూడా తీరిపోయింది. అయితే ఇంటెలిజెన్స్ బాస్‌గా కుమార్ విశ్వజిత్‌ను కొనసాగించాలా? ఆ పోస్టులో వేరొకరిని నియమించాలా? అనేది కొత్త సర్కారు ఇష్టం. ఇంటెలిజెన్స్ చీఫ్‌గా తననే కొనసాగించేలా కుమార్ విశ్వజిత్ ప్రయత్నాలు చేసుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఇదే పదవికి కేంద్ర సర్వీసు నుంచి ఇటీవలే రిలీవై వచ్చిన సీనియర్ ఐపీఎస్ పి.సీతారామాంజనేయులు పేరు కూడా వినిపిస్తోంది. రాష్ట్ర క్యాడర్‌కు చెందిన సీతారామాంజనేయులు గుంటూరు జిల్లా ఎస్పీ, విజయవాడ నగర పోలీస్ కమిషనర్‌గా పనిచేశారు. రాష్ట్ర విభజన అనంతరం ఆయన రాష్ట్రం నుంచి డిప్యుటేషన్‌పై కేంద్ర సర్వీసుకు వెళ్లారు. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) బాధ్యతల నుంచి కొద్ది రోజుల క్రితం రిలీవ్ అయిన ఆయనకు ఇంటెలిజెన్స్ చీఫ్ బాధ్యతలు అప్పగిస్తారంటూ పోలీసు శాఖలో చర్చ సాగుతోంది. మరోవైపు సీనియర్ ఐపీఎస్ అయిన కసిరెడ్డి రాజేంద్రనాథ్‌రెడ్డి పేరు కూడా ఇంటెలిజెన్స్ బాస్ రేసులో బలంగా వినిపిస్తోంది. చంద్రబాబు పాలనలో ఆయన అప్రధాన పోస్టులకే పరిమితం కావాల్సి వచ్చింది. పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీగా పనిచేసిన రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రస్తుతం డ్రగ్స్ డీజీగా ఉన్నారు. కొత్త సర్కారు కొలువు తీరనున్న తరుణంలో రాజేంద్రనాథ్‌రెడ్డి కూడా ఇంటెలిజెన్స్ చీఫ్ పోస్టు కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ ముగ్గురు కూడా ఇప్పటికే కీలక నేతల వద్ద తమ మనసులో మాట బయటపెట్టినట్టు వినికిడి. అయితే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎవరికి అవకాశం ఇస్తారో అనేది వేచి చూడాల్సిందే. -
ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ రేసులో ఆ ముగ్గురు..!
సాక్షి, అమరావతి: హైకోర్టు ఆదేశాలతో ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావును బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో నూతన ఇంటెలిజెన్స్ నియామకం కోసం రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీని కోసం ముగ్గురు సీనియర్ అధికారులు పేర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రతిపాదించారు. ఈ మేరకు ముగ్గురు పేర్లతో కూడిన జాబితాను కేంద్ర ఎన్నికల సంఘానికి సీఎస్ పంపారు. సీఎస్ పంపిన జాబితాలో నళినీ ప్రభాత్ (1992 బ్యాచ్), కుమార్ విశ్వజిత్, కృపానంద త్రిపాఠి ఉజెలా (1994) ఉన్నారు. వీరిపై ఎలాంటి శాఖాపరమైన విచారణలు పెండింగ్‌లో లేవని స్పష్టం చేశారు. ఏపీలో అధికార టీడీపీ సేవలో తరిస్తూ, విధి నిర్వహణలో అడ్డగోలుగా వ్యవహరిస్తున్న ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుపై కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేసిన విషయం విదితమే. ఆయనతోపాటు వైఎస్సార్, శ్రీకాకుళం జిల్లాల ఎస్పీలు రాహుల్‌దేవ్ శర్మ, వెంకటరత్నంలను కూడా బదిలీ చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసమే రాష్ట్రంలో పలువురు పోలీసు అధికారులు పనిచేస్తున్నారంటూ ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పలుమార్లు చేసిన ఫిర్యాదులపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. చదవండి: ఇంటెలిజెన్స్ డీజీపై వేటు -
హైకోర్టు తీర్పు; బాబుతో ఏబీ భేటీ
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సమావేశమయ్యారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు పాటించాల్సిందేనంటూ హైకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో వీరు భేటీ అయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తున్నారు. హైకోర్టు తీర్పు తమకు వ్యతిరేకంగా రావడంతో మల్లగుల్లాలు పడుతున్నారు. ఉన్నత న్యాయస్థానం తీర్పుపై ఏవిధంగా ముందుకెళ్లాలనే దానిపై తర్జనభర్జన పడుతున్నట్టు తెలుస్తోంది. (చదవండి: ఇంటెలిజెన్స్ డీజీపై వేటు) తమకు అనుకూలంగా వ్యవహరిస్తున్న వెంకటేశ్వరరావును బదిలీ చేయకుండా ఉండేందుకు చంద్రబాబు సర్కారు చివరకు ప్రయత్నాలు సాగించింది. ఈ క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘానికి చంద్రబాబు ఘాటు లేఖ కూడా రాశారు. హైకోర్టు తలుపు తట్టినప్పటికీ రాష్ట్ర సర్కారు నగుబాటు తప్పలేదు. మరోవైపు వెంకటేశ్వరరావు కోసం మొత్తం అధికార వ్యవస్థను అవమానాల పాల్జేశారని ఉన్నతాధికారులు మండిపడుతున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలను పాటించకుండా చంద్రబాబు అనుసరిస్తున్న వైఖరిని తప్పుబడుతున్నారు. (చదవండి: ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురు) -
ఐఎస్ఐ చీఫ్‌గా అసిమ్ మునీర్
ఇస్లామాబాద్: పాకిస్తాన్ నిఘా సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్(ఐఎస్ఐ) అధిపతిగా లెఫ్టినెంట్ జనరల్ అసిమ్ మునీర్ నియమితులయ్యారు. ప్రస్తుత ఐఎస్ఐ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ నవీద్ ముఖ్తార్ ఈ నెల 1న రిటైరైన నేపథ్యంలో కొత్త చీఫ్‌గా మునీర్‌ను నియమిస్తున్నట్లు పాక్ ఆర్మీ ప్రకటించింది. ఈ నెల 25న ఆయన పదవీ బాధ్యతలు చేపడతారని తెలిపింది. 2016 డిసెంబర్ నుంచి ఐఎస్ఐ డైరెక్టర్ జనరల్(డీజీ)గా ఉన్న ఆయన గతంలో మిలిటరీ ఇంటెలిజెన్స్ (ఎంఐ) అధిపతిగా ఉన్నారు. -
అమెరికాపై దాడులకు అల్‌ఖైదా కుట్ర
అగ్రరాజ్యం అమెరికా మీద మరోసారి దాడి చేసేందుకు అల్ ఖైదా సిద్ధమవుతోందా? దానికి అనుబంధంగా ఉన్న సిరియన్ ఉగ్రవాద సంస్థ అల్ నస్రా ఇందుకోసం ప్రత్యేకంగా కొంతమంది ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తోందా? అవుననే అంటున్నాయి అమెరికా నిఘా వర్గాలు. అల్ ఖైదాకు అనుబంధంగా ఉన్న కొన్ని ఉగ్రవాద సంస్థలు ఇప్పటికే శిక్షణ మొదలు పెట్టేశాయని డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ జేమ్స్ క్లాపర్ తెలిపారు. అమెరికా భద్రతకు ఇది చాలా పెద్ద సవాలని ఆయన సెనేట్ కమిటీకి చెప్పారు. అమెరికాపై ఎలాగైనా దాడులు చేయాలన్న గట్టి ఉద్దేశంతో, నమ్మకంతో అల్ నస్రా సంస్థ ఉందని ఆయన అన్నారు. అయితే ఇందుకు సంబంధించిన ఎలాంటి ఆధారాలను క్లాపర్ బయటపెట్టలేదు. అలాగే, అల్ నస్రా సంస్థ ఏ రూపంలో దాడులు చేస్తుందో కూడా ఇంకా చెప్పలేదు. ఇది ఇటీవలి కాలంలోనే ఏర్పడిన ఉగ్రవాద సంస్థ అని, అయితే శరవేగంగా విస్తరిస్తూ పోతోందని, పలు ప్రాంతాల్లో దీని ఉనికి ఉందని క్లాపర్ వివరించారు. యెమెన్‌కు చెందిన అల్‌ఖైదా లాంటి సంస్థలు అరేబియన్ ప్రాంతంలో ఇంకా చాలా ఉన్నాయని, ఇవన్నీ కూడా అమెరికా మీద దాడులు చేయగల సామర్థ్యం కలిగి ఉన్నాయని చెప్పారు. ఇటీవలి కాలంలో ఉగ్రవాదుల సంఖ్య కూడా బాగా పెరిగిందన్నారు. సిరియాలో దాదాపు 75 వేల నుంచి 1,10,000 మంది తిరుగుబాటుదారులు బషర్ అసద్ సర్కారుతో పోరాడుతున్నారు. వారిలో దాదాపు 26,000 మంది ఉగ్రవాదులని, అందులో 50 దేశాల నుంచి వచ్చిన 7,000 మంది విదేశీయులు కూడా ఉన్నారని క్లాపర్ చెప్పారు. వీరు కేవలం భౌతిక దాడులు మాత్రమే చేయడం లేదని, అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా పొందడం వల్ల అమెరికా రక్షణ వ్యవస్థలకు పెద్ద ముప్పే పొంచి ఉందని కమిటీ చైర్పర్సన్ డయాన్ ఫీన్‌స్టీన్ హెచ్చరించారు. అమెరికా, ఇతర దేశాల మీద దాడి చేయడానికి సిరియా ఒక స్థావరంగా ఉపయోగపడుతుందని ఆమె తెలిపారు.