ఏపీ ఇంటెలిజెన్స్‌ బాస్‌ ఎవరు? | Who is Andhra Pradesh Intelligence New Chief | Sakshi
Sakshi News home page

ఏపీ ఇంటెలిజెన్స్‌ బాస్‌ ఎవరు?

Published Mon, May 27 2019 9:36 AM | Last Updated on Mon, May 27 2019 3:19 PM

Who is Andhra Pradesh Intelligence New Chief - Sakshi

సాక్షి, అమరావతి: చంద్రబాబు పాలనలో అత్యంత వివాదాస్పదమైన ఇంటెలిజెన్స్‌ బాస్‌ పోస్టుకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారం చేపట్టనున్న తరుణంలో పోటీ పెరిగింది. ఈ పోస్టును ముగ్గురు సీనియర్‌ ఐపీఎస్‌లు ఆశిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు హయాంలో పోలీస్‌ శాఖ భుజంపై రాజకీయ అజెండాను మోయించడంతో అనేక వివాదాలు పోలీసులను చుట్టుముట్టాయి. మొత్తం పోలీస్‌ వ్యవస్థకే దిశానిర్దేశం చేయాల్సిన డీజీపీ నుంచి కొన్ని సబ్‌ డివిజన్‌లలోని డీఎస్పీల వరకు రాజకీయ ఉచ్చులో పడిపోవడంతో అపఖ్యాతిపాలయ్యారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను పరిరక్షించడంలో రాజకీయాలకు అతీతంగా, నిష్పక్షపాతంగా పనిచేయాల్సిన కొందరు పోలీసులు వ్యవహరించిన తీరు అనేక విమర్శలకు తావిచ్చింది.

ఇటువంటి పరిస్థితుల్లో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో ఏర్పడనున్న కొత్త సర్కారు కొలువు తీరిన వెంటనే పోలీసు శాఖలో ప్రక్షాళన మొదలవుతుందనే ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలోని ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులతో ఈ నెల 24న తాడేపల్లిలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలోనూ నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, ప్రక్షాళన చేస్తామని వైఎస్‌ జగన్‌ వ్యాఖ్యలు చేసినట్టు పోలీసు శాఖలో చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో గత ఐదేళ్లుగా ‘పచ్చ’పాతంతో వ్యవహరించిన పోలీసు అధికారులు మార్పునకు మానసికంగా సిద్ధమైనట్టు చర్చించుకుంటున్నారు.

ఠాకూర్‌ స్థానంలో సవాంగ్‌!
ఇప్పటికే డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ స్థానంలో గౌతమ్‌ సవాంగ్‌ పోలీస్‌ బాస్‌ అవుతారని, అధికారిక ఉత్తర్వులు రావడమే ఆలస్యమని పోలీసు శాఖలో చర్చ సాగుతోంది. తాజాగా ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ కూడా మారతారంటూ ప్రచారం జరుగుతోంది. ఇంటెలిజెన్స్‌ బాస్‌గా పనిచేసిన ఏబీ వెంకటేశ్వరరావు పూర్తిగా చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారంటూ ఆరోపణలు, ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ఎన్నికల విధుల నుంచి ఆయనను తప్పిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ఆదేశాలు ఇచ్చిన సంగతి తెల్సిందే. చివరి నిమిషం వరకు ఆయనను కొనసాగించేందుకు చంద్రబాబు చేసిన ప్రయత్నాలకు కోర్టులోనూ చుక్కెదురు కావడంతో వెంకటేశ్వరరావును బదిలీ చేయక తప్పలేదు. అయితే వెంకటేశ్వరరావుపై మమకారం చంపుకోని చంద్రబాబు ఆయనను ఏసీబీ డీజీగా నియమించడం గమనార్హం.

ముగిసిన ఎన్నికల కోడ్‌
ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా వెంకటేశ్వరరావు స్థానంలో ఏపీ స్టేట్‌ లెవెల్‌ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు చైర్మన్‌గా ఉన్న కుమార్‌ విశ్వజిత్‌ను ఈసీ నియమించింది. సార్వత్రిక ఎన్నికల కోడ్‌ మే 26న ముగియడంతో కుమార్‌ విశ్వజిత్‌ నియామకం గడువు కూడా తీరిపోయింది. అయితే ఇంటెలిజెన్స్‌ బాస్‌గా కుమార్‌ విశ్వజిత్‌ను కొనసాగించాలా? ఆ పోస్టులో వేరొకరిని నియమించాలా? అనేది కొత్త సర్కారు ఇష్టం. ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా తననే కొనసాగించేలా కుమార్‌ విశ్వజిత్‌ ప్రయత్నాలు చేసుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఇదే పదవికి కేంద్ర సర్వీసు నుంచి ఇటీవలే రిలీవై వచ్చిన సీనియర్‌ ఐపీఎస్‌ పి.సీతారామాంజనేయులు పేరు కూడా వినిపిస్తోంది. రాష్ట్ర క్యాడర్‌కు చెందిన సీతారామాంజనేయులు గుంటూరు జిల్లా ఎస్పీ, విజయవాడ నగర పోలీస్‌ కమిషనర్‌గా పనిచేశారు. రాష్ట్ర విభజన అనంతరం ఆయన రాష్ట్రం నుంచి డిప్యుటేషన్‌పై కేంద్ర సర్వీసుకు వెళ్లారు. బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (బీఎస్‌ఎఫ్‌) బాధ్యతల నుంచి కొద్ది రోజుల క్రితం రిలీవ్‌ అయిన ఆయనకు ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ బాధ్యతలు అప్పగిస్తారంటూ పోలీసు శాఖలో చర్చ సాగుతోంది.

మరోవైపు సీనియర్‌ ఐపీఎస్‌ అయిన కసిరెడ్డి రాజేంద్రనాథ్‌రెడ్డి పేరు కూడా ఇంటెలిజెన్స్‌ బాస్‌ రేసులో బలంగా వినిపిస్తోంది. చంద్రబాబు పాలనలో ఆయన అప్రధాన పోస్టులకే పరిమితం కావాల్సి వచ్చింది. పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఎండీగా పనిచేసిన రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రస్తుతం డ్రగ్స్‌ డీజీగా ఉన్నారు. కొత్త సర్కారు కొలువు తీరనున్న తరుణంలో రాజేంద్రనాథ్‌రెడ్డి కూడా ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ పోస్టు కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ ముగ్గురు కూడా ఇప్పటికే కీలక నేతల వద్ద తమ మనసులో మాట బయటపెట్టినట్టు వినికిడి. అయితే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎవరికి అవకాశం ఇస్తారో అనేది వేచి చూడాల్సిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement