పిల్లలను హత్తుకొని ఆనందంతో కన్నీరుపెడుతున్న తల్లిదండ్రులు
రైల్వే స్టేషన్లలో.. రైలు బళ్లలో.. చిరిగిన బట్టలతో.. దుమ్ము పట్టిన జుట్టుతో దీనంగా జీవచ్ఛవాల్లా కదిలే వీధి బాలలను గుర్తు తెచ్చుకోండి. వారిలో చాలా మంది ఒకప్పుడు తమ ఇళ్లలో గారాల పట్టీగానో, ముద్దుల బాబుగానో నిండు కళతో తిరిగినవాళ్లే. ఇంటి మీద అలిగో, చదువు భారంతోనో, దారి తప్పో, ఇంకెవరి మీదో కోపంతోనో రైలెక్కేసి అమ్మ ఒడి వీడారు.. నాన్న వేలు వదిలారు. ఇంటి నుంచి పారిపోయి వీధి బాలలుగా మారారు. పలకా బలపం పట్టాల్సిన చేతులతో యాచించారు. చింపిరి జుట్టు.. చిరిగిన బట్టలతో.. చెత్త కుప్పలే లోగిళ్లుగా బతికారు. క్షణికావేశంతో తీసుకున్న నిర్ణయంతో హాయిగా సాగాల్సిన వీరి బాల్య జీవితం.. అథోగతి పాలైంది. ఇలా తెగిన గాలిపటంలా సాగుతున్న వీరి జీవితాన్ని ‘సాథి’ సంస్థ దరికి చేర్చింది. వాళ్లను తిరిగి ఇంటికి చేర్చి 20 కుటుంబాల గుండె కోతను, వ్యథను తీర్చింది.అమ్మానాన్నలను హత్తుకున్న పిల్లలు... పిల్లలను చూసి ఉద్వేగంతో కన్నీరుపెట్టుకున్న తల్లిదండ్రులు.. వారి మధ్య ప్రేమ, ఆప్యాయతను చూసి మురిసిపోయిన అధికారులు, సంస్థ ప్రతినిధులు.. శనివారం బాలుర వసతి గృహం ప్రాంగణంలో భావోద్వేగ వాతావరణం కనిపించింది.
ఆరిలోవ(విశాఖ తూర్పు): ప్రభుత్వ బాలుర గృహంలో సుమారు ఏడాదికిపైగా ఉంటున్న పిల్లలు శనివారం వారి తల్లిదండ్రుల చెంతకు చేరారు. తప్పిపోయిన తమ పిల్లలను చూసి.. వెంటనే హత్తుకుని తల్లిదండ్రులు ఆనందభాష్పాలు రాల్చారు. ‘సాథి’ సంస్థ ఆధ్వర్యంలో 20 మంది పిల్లలను కలెక్టర్ ప్రవీణ్‌కుమార్, ఏడీసీపీ ఫకీరప్ప, రైల్వే డీఆర్‌ఎం ముకుల్ శరణ్ మాథూర్ సమక్షంలో వారి తల్లిదండ్రులను అప్పగించారు.
విశాఖ రైల్వే స్టేషన్‌లో కనిపించిన వీధి బాలురు, ఇంటి నుంచి తప్పిపోయిన 26 మంది పిల్లలను సాథి సంస్థ గుర్తించింది. వీరిని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ(సీడబ్ల్యూసీ) అనుమతితో ముడసర్లోవ వద్ద ప్రభుత్వ బాలుర గృహంలో చేర్పించింది. ఏడాదిన్నర నుంచి వీరంతా ఇక్కడే వసతి పొందుతున్నారు. ఒడిశా, బిహార్, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్,ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ తదితర ప్రాంతాలకు చెందిన వీరి చిరునామాలను సాథి ప్రతినిధులు కనుగొని ఆయా రాష్ట్రాల పోలీసులను సంప్రదించారు. వీరి తల్లిదండ్రులను శనివారం ఇక్కడకు రప్పించి, పిల్లలను అప్పగించారు. ఏడాదికి పైగా దూరమైన పిల్లలు, వారి తల్లిదండ్రులు ఒకరినొకరు హత్తుకొని భావోద్వేగానికి గురయ్యారు. పిల్లల కోసం చాలా చోట్ల వెతికామని.. మళ్లీ కలుస్తామనే ఆశ లేకుండా పోయిందని.. సాథి సంస్థ కృషితో మళ్లీ కలిసామంటూ కన్నీరు పెట్టుకున్నారు. కాగా.. బీజేపీ మహిళా మోర్చా నగర కన్వీనర్ మాధవీలత చార్లెస్ సహకారంతో ఒడిశాకు చెందిన పునిక్‌చాంద్‌ను కలెక్టర్ సమక్షంలో తల్లిదండ్రులను అప్పగించారు.
పిల్లలను ప్రేమతో పెంచాలి
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పిల్లలను ప్రేమతో పెంచాలని తల్లిదండ్రులకు సూచించారు. వారి అవసరాలను తీరుస్తూ.. క్రమశిక్షణ నేర్పించాలన్నారు. కుటుంబ సభ్యులంతా ఆధార్ అనుసంధానం చేసుకోవాలన్నారు. దీనివల్ల తప్పిపోయిన పిల్లలను గుర్తించడం సులభమవుతుందన్నారు. పిల్లలను తల్లిదండ్రులను అప్పగించడానికి కృషి చేసిన సాథి సభ్యులను ఆయన అభినందించారు. ఏడీసీపీ ఫకీరప్ప మాట్లాడుతూ పిల్లలను ఇతర రాష్ట్రాల్లో ఉన్న వారి తల్లిదండ్రులకు చేర్చడంలో పోలీస్ బందోబస్తు అందిస్తామన్నారు. రైల్వే డీఆర్‌ఎం ముకుల్ శరణ్ మాథూర్ మాట్లాడుతూ తప్పిపోయిన బాలురను సీడబ్ల్యూసీకి అప్పగించేవరకు.. సంరక్షణ కోసం స్టేషన్‌లో ప్రత్యేక వసతి సదుపాయం కల్పిస్తామన్నారు. సీడబ్ల్యూసీ చైర్‌పర్సన్ ఆర్.శ్యామలరాణి, బాలుర గృహం సూపరింటెండెంట్ వీరయ్య, అబ్దుల్ రకీబ్, సాథి ప్రతినిధులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment