
సమ్మె హీట్
శ్రీకాకుళం, న్యూస్‌లైన్: వేతన సవరణ కోసం విద్యుత్ ఉద్యోగులు చేపట్టిన మెరుపు సమ్మె ప్రజా జీవనంపై తీవ్ర ప్రభావం చూపింది. విద్యుత్ సరఫరా నిలిచిపోయి జిల్లాలో అధిక శాతం గ్రామాలు అంథకారంలో చిక్కుకోగా పట్టణాల్లోనూ అనేక ప్రాంతాలకు క్రమంగా సరఫరా నిలిచిపోతోంది. రాష్ట్ర సంఘాల పిలుపు మేరకు ఆదివారం ఉదయం ఆరు గంటల నుంచి జిల్లాలోని సుమారు 1200 మంది రెగ్యులర్ ఉద్యోగులు, 400 మంది కాంట్రాక్టు ఉద్యోగులు సమ్మెలోకి వెళ్లారు. కాగా ఉదయం 9 గంటల నుంచే సమ్మె ప్రభావంతో విద్యుత్ కష్టాలు ప్రారంభమయ్యాయి.
విద్యుత్ సరఫరాలో అంతరాయాలు మొదలయ్యాయి. విధుల్లో ఉన్న ఇంజినీర్లు మరమ్మతులు చేస్తున్నా అవి ఎంతో సేపు నిలవడం లేదు. మరో వంక ఎడతెరిపి లేని వర్షం మరమ్మతులకు ఆటంకంగా మారింది. సాయంత్రానికి జిల్లాలో 10 శాతం మినహా అన్ని ప్రాంతాల్లో సరఫరా నిలిచిపోయింది. తమ సమస్య పరిష్కరించేందుకు లిఖితపూర్వకమైన హామీ ఇస్తేగానీ సమ్మెను విరమించేది లేదని ఉద్యోగ సంఘ నాయకులు చెబుతున్నారు. చర్చలు ఫలించిసమ్మె విరమించినా విద్యుత్ సరఫరా పునరుద్ధరించడం ఇప్పటికిప్పుడు సాధ్యం కాదని, సోమవారమే పునరుద్ధరణ పనులు చేపడతామని జిల్లా విద్యుత్ అధికారులు చెప్పారు.
ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేక సతమతం
ఉద్యోగులు మెరుపుసమ్మె చేపట్టడంతో ట్రాన్స్ కో అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేకపోయారు. దీని వల్ల ప్రజలు అవస్థలు పడాల్సి వచ్చింది. ఆదివారం ఉదయం నుంచి ఎడతెరిపి లేని వర్షం కురియడం, మేఘాలు కమ్ముకోవడంతో ఇళ్లలో చీకట్లు అలుముకున్నాయి. ఇళ్లలో ఏర్పాటు చేసుకున్న ఇన్వర్టర్లు మూడు నాలుగు గంటల్లోనే చేతులెత్తేశాయి. వర్షం వల్ల వాతావరణం చల్లబడడంతో ప్రజలు కొంతమేర ఊపిరి పీల్చుకోగలిగారు. అయితే పగటిపూట కరెంటు లేకపోయినా ఎలాగోలా గడిపేసినా రాత్రంతా చీకటిలో మగ్గిపోవలసిందేనని ఆందోళన చెందుతున్నారు. మరోవైపు విద్యుత్ లేక దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఫలితంగా విద్యుత్ కష్టాలకు నీటికష్టాలు తోడయ్యాయి.
జనరేటర్లపైనే ఆస్పత్రులు, హోటళ్లు
విద్యుత్ సమస్యతో ఆస్పత్రుల్లో వైద్య సేవలకు అంతరాయం వాటిల్లింది. పెద్ద పెద్ద ఆస్పత్రులు జనరేటర్ల సాయంతో పని చేసినా చిన్న ఆస్పత్రుల్లో సేవలు దాదాపు నిలిచిపోయాయి. ఇక సినిమా థియేటర్లు, హోటళ్లు, ఫంక్షన్ హాళ్లు జనరేటర్లతో కొనసాగాయి. పరిశ్రమల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగింది. పలు పెట్రోల్ బంకులు కొద్ది సేపటి వరకు జనరేటర్‌తో పనిచేసినా కొద్దిసేపటికే వాటిని మూసివేశారు.
విజయనగరం వెళ్లిన సిబ్బంది వెనక్కి..
విజయనగరంలో గత రెండుమూడు రోజుల్లో ఈదురు గాలుల ధాటికి దెబ్బతిన్న విద్యుత్ లైన్ల మరమ్మతులకు జిల్లా నుంచి 230 మంది సిబ్బందిని పంపారు. అయితే ప్రస్తుత అత్యవసర పరిస్థితిలో ఆ సిబ్బందిలో 130 మందిని వెనక్కి రప్పించారు. వీరు ఆదివారం పునరుద్ధరణ పనుల్లో పాల్గొన్నారు. ఉన్నతాధికారులు ఉద్యోగ సంఘాలతో జరుపుతున్న చర్చలు సఫలమవుతాయని భావిస్తున్న జిల్లా అధికారులు విజయనగరం పంపించిన సిబ్బందిలో సగం మందిని వెనక్కి పిలిచారు.
పునరుద్ధరణకు అధికారుల కృషి
సిబ్బంది మెరుపు సమ్మె వల్ల విద్యుత్ అంతరాయం ఏర్పడిన ప్రాంతాల్లో సరఫరా పునరుద్ధరణకు ఇంజినీర్లు కృషి చేస్తున్నారని ట్రాన్స్‌కో ఎస్‌ఈ పీవీవీ సత్యనారాయణ చెప్పారు. వర్షం తమకు కొంతమేర ఇబ్బంది కలిగించిందని పేర్కొన్నారు. సోమవారం నాటికి ఉద్యోగులు సమ్మె విరమించి విధుల్లో చేరుతారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. విజయనగరం పంపించిన సిబ్బందిలో సగం మందిని వెనక్కి రప్పిస్తున్నామని, అవసరమైన పక్షంలో జిల్లాలో మరమ్మతులు పూర్తయిన తరువాత మళ్లీ పంపిస్తామన్నారు.
ట్రాన్స్‌కో కార్యాలయం ఎదుట ఆందోళన
మెరుపు సమ్మెకు దిగిన ఉద్యోగులు ఆదివారం ఉదయం ట్రాన్స్‌కో కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం ఉద్యోగ సంఘ నాయకుడు గోపాల్ విలేకరులతో మాట్లాడుతూ అధికారులు గతంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోక పోగా గడువును పొడిగిస్తూ వస్తున్నారని విమర్శించారు. విధిలేని పరిస్థితుల్లో సమ్మెకు దిగాల్సి వచ్చిందని ప్రజలను కష్టపెట్టడం తమ అభిమతం కాదన్నారు. అధికారులతో జరుపుతున్న చర్చలు సఫలమైతే రాత్రింబవళ్లు శ్రమించి విద్యుత్‌ను పునరుద్ధరిస్తామన్నారు.