విశాఖపట్నం: తెలుగు రాష్ట్రాలు అట్టుడుకుతున్నాయి. వేడి సెగలు కక్కుతున్నాయి. తెలంగాణతో పాటు కోస్తాంధ్ర, రాయలసీమలోనూ ఉష్ణోగ్రతలు ఉగ్రరూపం దాలుస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్‌లో శనివారం 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. రెండు రాష్ట్రాల్లో ఈ సీజనులో ఇదే అత్యధిక గరిష్ట ఉష్ణోగ్రత కావడం గమనార్హం. రామగుండంలో 43 డి గ్రీలు, రాయలసీమలోని కర్నూలు, కోస్తాంధ్రలోని నెల్లూరుల్లో 42 డిగ్రీలు, హైదరాబాద్, తిరుపతి, అనంతపురంలలో 41 డిగ్రీలు, నందిగామ, కావలి, గన్నవరంలలో 40 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఇరు రాష్ట్రాల్లోనూ సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల వరకు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరో ఒకట్రెండు రోజుల పాటు ఉష్ణతాపం కొనసాగవచ్చని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.
మరోవైపు తూర్పు ఉత్తరప్రదేశ్ నుంచి ఛత్తీస్‌గఢ్ మీదుగా తెలంగాణ వరకు ఉపరితల ద్రోణి ఆవరించి ఉంది. దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల లో అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షం గాని, జల్లులు గాని కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం శనివారం రాత్రి విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. పగటి పూట ఎండలు తీవ్రరూపం దాల్చినా సాయంత్రానికి క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడతాయని, ఫలితంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కూడా కురవవచ్చని తెలిపింది.