sun rise
-
సూర్యం శరణం గచ్ఛామి!
కేస్ స్టడీ.. చిన్న బకెట్‌తో నీళ్లు తెస్తుంటే.. ఆత్మకూరు మండలం నల్లపరెడ్డిపల్లె గ్రామానికి చెందిన మస్తానమ్మకు సుమారు 60 ఏళ్లు ఉంటాయి. యాక్టివ్‌గా ఉండేది. అయితే కొంతకాలం క్రితం చిన్న బకెట్‌తో నీరు తీసుకువెళ్తుండగా కాలు స్లిప్ అయి మెల్లగా కిందకు ఒరిగిపోయి పైకి లేవలేకపోయింది. దీంతో ఆమెను కుటుంబ సభ్యులు నెల్లూరులోని ఆస్పత్రికి తరలించారు. ఎక్స్‌రే తీయగా తొడభాగంలో పొడవైన ఎముక ముక్కలుగా విరిగిపోయి ఉంది. దీంతో డాక్టర్లు ఆమెకు ఆపరేషన్ చేసి రాడ్ వేశారు. ఇలా ఎందుకు జరిగిందని కుటుంబ సభ్యులు ప్రశ్నించగా ఆమెకు విటమిన్–డి, కాల్షియం లోపం ఉన్నాయని, అందుకే ఎముకలు పెళుసుబారి కాలు విరిగిందని డాక్టర్లు తెలిపారు. ఇది ఒక ఉదాహరణ మాత్రమే. నిత్యం ఇలాంటి కేసులు జిల్లాలోని పలు ఆస్పత్రులకు వస్తున్నాయి. సాక్షి, నెల్లూరు డెస్క్: ఆరోగ్యమే మహాభాగ్యం. సృష్టిలో ప్రతి జీవి ఆరోగ్యంగా ఉండేలా ప్రకృతి అన్ని వనరులు ప్రసాదించింది. కానీ మనిషి జీవనశైలి గాడి తప్పడంతో అనారోగ్యాలకు గురవుతున్నాడు. మన దేశ జనాభాలో ప్రతి నలుగురిలో ముగ్గురు విటమిన్–డి లోపంతో బాధపడుతున్నట్లు తాజాగా గురుగావ్‌కు చెందిన టాటా గ్రూప్ కంపెనీ 1ఎంజీ నిర్వహించిన సర్వేలో వెల్లడైనట్లు పేర్కొంది. విటమిన్–డి ఎలా అందుతుంది? మన శరీరానికి రెండు మార్గాల ద్వారా విటమిన్–డి అందుతుంది. అందులో మొదటిది సూర్యరశ్మి నుంచి, రెండోది ఆహారంగా తీసుకోవడం ద్వారా వస్తుంది. ప్రతిరోజూ ఎండలో కొంత సమయం ఉంటే చాలు మనిషి శరీరానికి అవసరమైన డి–విటమిన్ సహజంగానే అందుతుంది. అలాగే చేపలు, గుడ్డులోని పచ్చసొన, పాలు, తృణధాన్యాలు తీసుకోవడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు. ప్రాముఖ్యత ఏమిటంటే.. మన దేహంలో బలమైన ఎముకలు, కండరాలు, దంతాలు ఏర్పడాలంటే విటమిన్–డి ఎంతో అవసరం. తగినంతగా ఈ షోషకం లేకపోతే చిన్నపిల్లల్లో ఎముకలు పటుత్వం కోల్పోయి వంకర్లు పోతాయి. పెద్దవాళ్లలో అయితే ఎముకలు గుల్లబారి ధృడత్వం పోతుంది. తర్వాత కీళ్ల నొప్పులతో మొదలై పలు ఇబ్బందులు ఏర్పడతాయి. ఫలితంగా ఏ చిన్న ప్రమాదం జరిగినా ఎముకలు విరిగి పోతుంటాయి. అందుకే ముందుగా మేల్కొని డాక్టర్‌ను సంప్రదించి సమస్య రాకుండా జాగ్రత్తపడాలి. డి–విటమిన్ లోపిస్తే.. మన శరీరానికి విటమిన్–డి లోపిస్తే ఉదరంలోని పేగులు కాల్షియం, ఫాస్ఫరస్‌ను తగినంతగా సంగ్రహించలేవు. ఇది హైపోకాల్సిమియాకు దారితీస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. అంటే రక్తంలో కాల్షియం లెవెల్స్ తగ్గిపోవడం. ఫలితంగా కండరాలు బలహీనపడి.. పిక్కలు పట్టేయడం, మలబద్ధకం, నీరసం వంటి సమస్యలు వస్తాయి. తీవ్రత ఎక్కువైతే ఒక్కోసారి డిప్రెషన్‌కు గురికావచ్చు. సమస్యకు కారణాలు విటమిన్–డి లోపం నేటి కాలంలో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఉంది. గతంలో సుమారు మూడు దశాబ్దాల క్రితం వరకు స్కూళ్లలో విద్యార్థులు ఉదయం కొంతసేపు ఎండలో నిలబడి ప్రతిజ్ఞ చేసేవారు. అంతేకాకుండా సాయంత్రం డ్రిల్ పిరియడ్ ఉండేది. ఆ సమయంలో పిల్లలందరూ గ్రౌండ్లో ఆటలాడేవారు. ఆ విధంగా వారికి అవసరమైన మేరకు డి విటమిన్ సూర్యరశ్మి ద్వారా అందేది. పెద్దలు కూడా ఎక్కువమంది ఎండలోనే కాయకష్టం చేసేవారు కాబట్టి వారికి ఈ సమస్య ఎదురుకాలేదు. కాలక్రమంలో ప్రైవేట్ స్కూళ్లు ఎక్కువ కావడం, వాటిలో చేరే విద్యార్థులను నాలుగు గోడల మధ్య కుక్కి చదివించడమే కానీ గౌండ్‌లో ఆటలాడించడం లేకుండా పోయింది. ధనికుల పిల్లలు ఇళ్లలో, స్కూళ్లలో కూడా ఏసీ గదుల్లోనే గడిపేస్తుండటంతో వారికి విటమిన్–డి లోపిస్తోంది. అవగాహన లోపం ఎండలో తిరిగితే నల్లబడిపోతామని, చర్మ ఛాయ తగ్గుతుందని భావిస్తూ చాలామంది ఇళ్లలోనే ఉండిపోతున్నారు. ఒకవేళబయటకు రావాల్సి వచ్చినా పూర్తిగా దుస్తులతో శరీరాన్ని కప్పేస్తున్నారు. ఇలా చేయడంతో వారికి సూర్యరశ్మి తగలకు విటమిన్–డి అందడం లేదు. శరీరానికి ఉదయం, సాయంత్రం వేళల్లో అయినా కొంత సమయం సూర్యరశ్మి తాకేలా చూసుకోవాలి. గ్రామీణులే మెరుగు సాధారణంగా పట్టణాల్లో నీడపట్టున పనిచేయడం, ఏసీ రూంలలో ఉండటం, రాత్రిళ్లు మేలుకొని విధులు నిర్వర్తించే వారు, ఇలా ఎండతగలని వారికి విటమిన్–డి లోపం ఉంటోంది. ఎండలో కనీసం 4 గంటలు పని చేసేవారికి విటమిన్–డి ఎక్కువగా వస్తుంది. తద్వారా ఎముకలు బలంగా, ధృడంగా ఉంటాయి. అందువల్లనే గ్రామీణ ప్రాంతాల్లో ఎండలో పని చేసేవారికి డి విటమిన్ అంది వారు ధృడంగా ఉంటారని వైద్యులు చెపుతున్నారు. ఇష్టానుసారంగా విటమిన్లు తీసుకోరాదు ప్రస్తుతం మార్కెట్లో అనేక మంది డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇష్టానుసారంగా విటమిన్–డి, కాల్షియం, ఇ విటమిన్ లాంటి మాత్రలు కొనుగోలు చేసి వినియోగిస్తున్నారు. ఇది సరైనది కాదు. శరీరానికి తక్కువ మోతాదులో విటమిన్లు అవసరమవుతాయి. ప్రతిరోజూ డి–విటమిన్ ట్యాబ్లెట్ తీసుకుంటే ఆ కాంపోనెంట్ ఎక్కువై మూత్రం ద్వారా బయటకు వెళ్లిపోతుంది. శరీరానికి ఉపయోగపడదు. ఒక్కో దఫా అతిగా వినియోగించినందు వల్ల అర్థిమియా వచ్చి (గుండె చాలా వేగంగా కొట్టుకోవడం) గుండె ఆగిపోయే ప్రమాదం ఉంది. అందువల్ల డాక్టర్ల సలహా లేకుండా ఏ మాత్రలు వినియోగించకూడదు. పిల్లల్లోనూ సమస్య ఉంది డి–విటమిన్ లోపం పెద్ద వారిలోనే కాకుండా పిల్లల్లోనూ ఉంది. 30 శాతం మంది పిల్లల్లో డి–విటమిన్¯ తక్కువ ఉన్నందువల్ల వారి శారీరక, మానసిక పెరుగుదల సరిగా ఉండటం లేదు. ఈ ప్రభావం చదువుపై పడుతోంది. అంతేకాకుండా చిన్నపిల్లల్లో రికెట్స్ వ్యాధికి గురవుతున్నారు. పెద్దల్లో 40 నుంచి 45 శాతం మందికి విటమిన్–డి లోపం ఉంటోంది. డి–విటమిన్ శరీరానికి అందాలంటే ఎండవేడిమికి అలవాటు పడాలి. విటమిన్లు తగ్గితే శరీర జీవన ప్రక్రియలు సకాలంలో జరగాల్సిన తీరులో జరగవు. విటమిన్స్ లభించే పదార్ధాలు, ఆకుకూరలు, కాయగూరలు ఎక్కువగా తీసుకోవాలి. –డాక్టర్ మస్తాన్‌బాష, అసోసియేట్ ప్రొఫెసర్, ఆర్థోపెడిక్ స్పెషలిస్టు, జీజీహెచ్ అతిగా ఉపయోగిస్తే అనర్ధాలు జీవన క్రియలు సక్రమంగా జరగాలంటే స్థూల పోషకాలతో పాటు సూక్ష్మ పోషకాలు విటమిన్లు శరీరానికి అవసరం. ఇందులో డి విటమిన్ శరీరంలో తక్కువగా ఉందంటే అనుబంధంగా కాల్షియం కూడా తగ్గిపోతుంది. ఇసుక–సిమెంట్ కలిస్తేనే గోడ బలంగా ఉన్నట్టు, డి విటమిన్, కాల్షియం సరిపడా ఉండాలి. ఇవి లోపిస్తే ఎముకలు గుల్లబారుతాయి. పెద్ద కారణం లేకుండానే ఎముకలు విరిగిపోతాయి. 40 ఏళ్లు వచ్చిన మహిళల్లో ముందస్తు మెనోపాజ్ దశ వల్ల కూడా విటమిన్స్ లోపం ఏర్పడి హార్మోన్స్ బ్యాలెన్స్ తగ్గి కాల్షియం తగ్గిపోతుంది. అప్పుడు డి విటమిన్ కూడా తగ్గుతుంది. మునగ ఆకు, మునగ కాయలు, రాగులు, పాలు, గుడ్డు, చేప, గుమ్మడి లాంటి ఆహార పదార్థాలు తీసుకునే వారిలో విటమిన్ డి తగ్గదు. –డాక్టర్ రోజారమణి, అసోసియేట్ ప్రొఫెసర్, జనరల్ సర్జన్, జీజీహెచ్ -
క్వారంటైన్లో కలానికి పనిచెప్పిన మెగాస్టార్
మెగాస్టార్ చిరంజీవి ఇటీవల కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. స్వల్ప కోవిడ్ లక్షణాలతో బాధపడుతున్న ఆయన.. ప్రస్తుతం హోం క్వారంటైన్లో ఉండి వైద్యుల సూచలన మేరకు చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయన తల్లి అంజనాదేవి పుట్టిన రోజు(జనవరి 29) వేడుకలకు కూడా దూరమయ్యారు. సోషల్ మీడియా ద్వారానే తల్లికి బర్త్‌డే విషెస్ తెలియజేశారు. కాగా, క్వారంటైన్లో ఖాలీగా ఉండడంతో తనలో దాగిఉన్న మరో కళని బయటకు తీశారు చిరంజీవి. ఫోటోగ్రఫి నైపుణ్యంతో పాటు తన కలానికి పనిచెప్పారు. ఉదయం లేవగానే.. ఆకాశంలో అప్పుడే ఉదయించిన సూర్యుడిని తన కెమెరాలో బంధించి.. ఓ మంచి కవిత్వంతో దానిని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ‘ఈ రోజు ఉదయం లేవగానే కనిపించిన అందమైన ఆకాశాన్ని కెమెరాలో బంధించి మీతో పంచుకోవాలనిపించింది. ఒక మూలగా వున్న నెలవంక, దగ్గర్లో ఉన్నశుక్ర గ్రహం(మధ్యలో చిన్న తార) ఉదయించబోతున్న సూర్యుడు. ఆ కొంటె సూర్యుడ్ని చూడలేక నెలవంక సిగ్గుతో పక్కకు తొలిగినట్లుగా ఉంది’ అంటూ ఆ వీడియోని ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇక చిరు కవిత్వంపై మెగాస్టార్ ఫ్యాన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. View this post on Instagram A post shared by Chiranjeevi Konidela (@chiranjeevikonidela) -
భారత్‌లో అందరికంటే ముందు నిద్రలేచే గ్రామం ఏదో తెలుసా?
మన దేశంలో అందరికంటే ముందు నిద్రలేస్తుందా గ్రామం. మిగిలిన దేశమంతా పనుల్లో ఉండగానే నిద్రకు ఉపక్రమిస్తుంది. సూర్యుడు ఐదింటికే వచ్చి పలకరిస్తాడు. సాయంత్రం కూడా అంతే తొందరగా డ్యూటీ ముగించేస్తాడు. శీతాకాలం, వర్షాలతో ఆకాశం మబ్బుపట్టి ఉన్న రోజుల్లో అయితే సాయంత్రం నాలుగున్నరకే సూర్యుడు ముసుగు తన్నేస్తాడు. ఈ భౌగోళిక విచిత్రాన్ని చూడడానికే పర్యాటకులు ఆ ఊరి బాట పడుతుంటారు. ఆ ఊరి పేరు దోంగ్. దోంగ్ గ్రామం అరుణాచల్ ప్రదేశ్‌లో ఉంది. దేశంలో తొలి సూర్యకిరణాలు తాకే చోటును, ఆ చోటు నుంచి సూర్యకిరణాల నులివెచ్చదనాన్ని ఆస్వాదించడానికి పర్యాటకులు క్యూ కడతారు. దోంగ్ చాలా చిన్న గ్రామం. పదేళ్ల కిందట అయితే అక్కడ ఇల్లు కట్టుకుని స్థిరంగా నివసిస్తున్న వాళ్లు పదిహేను మంది మాత్రమే. ఈ పదేళ్లలో కొంత జనాభా పెరిగింది. కానీ పర్యాటకులకు బస సౌకర్యాలు లేవు. సమీపంలోని తేజు, వాలాంగ్ పట్టణాల్లో బస చేసి తెల్లవారు జామున మూడు గంటల నుంచి దోంగ్‌కు ప్రయాణమవుతుంటారు. వాలాంగ్ నుంచి ట్రెకింగ్ రూట్ మొదలు. కొంతమంది ట్రెకింగ్‌ను ఇష్టపడితే, అంతటి సాహసం చేయలేని వాళ్లు వాహనాల్లోనే దోంగ్ చేరుతుంటారు. సముద్రమట్టానికి 1, 240 మీటర్ల ఎత్తులో ఉంది దోంగ్. ఓ వైపు చైనా, మరో వైపు మయన్మార్ దేశాలు. దోంగ్ మన దేశానికి తూర్పు ముఖద్వారమే కానీ, ఇక్కడ పర్యటిస్తుంటే మన దేశంలో ఉన్నామనే భావన కలగదు. ఈశాన్య రాష్ట్రాల వైవిధ్యతను ఈ దోంగ్ టూర్లో ఆకళింపు చేసుకోవచ్చు. ఇటు కూడా చూడండి! అందరూ ఉదయిస్తున్న సూర్యుడి కోసం కళ్లు విప్పార్చి చూస్తుంటారు, వెళ్లింది సూర్యోదయం కోసమే కాబట్టి. అదే సమయంలో ఓ క్షణం తల వెనక్కి తిప్పి చూస్తూ తొలి కిరణాలతో నారింజ రంగు సంతరించుకున్న పర్వత శ్రేణులు కనువిందు చేస్తాయి. వర్షాకాలం లో అయితే నిర్మలమైన వినీల ఆకాశం కింద, దట్టమైన మబ్బులు ఆవరించిన మేఘావరణం మీదుగా ప్రకృతితో పోరాటం చేస్తూ విజేతగా ఉదయిస్తున్న సూర్యుడిని చూస్తూ పర్వతాలు ‘తెలి మంచు కరిగింది తలుపు తీయనా ప్రభూ!’ అని దేశానికి మేలుకొలుపు పాడుతున్నట్లుంటాయి. -
భద్రం బిడ్డో.. మాయదారి ఎండ కాటేస్తోంది!
ఉదయం తొమ్మిది గంటలకే ఎండలు తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. మధ్యాహ్ననికి ఈ పరిస్థితి మరీ దారుణంగా ఉంటోంది. ఇలాంటి తరుణంలో వేసవి బడులకు హాజరైన విద్యార్థులు ఇళ్లకు చేరడం ప్రాణాంతకమవుతోంది. మండుటెండలో చిన్నారులు వడదెబ్బ బారినపడే అవకాశాలు ఎక్కువగా ఉండడంతో తల్లిదండ్రులు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తమ పిల్లలకు కొందరు స్వయంగా గొడుగులు పట్టి వెంట నడుస్తుండగా, మరికొందరు పిల్లల చేతికి గొడుగులు అప్పగించి తాము మండుటెండలో ఉసూరుమంటూ ఇళ్లకు చేరుతున్నారు. ఎండ వేడి తాళలేక వెంట తీసుకెళ్లిన వాటర్ బాటిల్లోని నీటిని తలపై పోసుకుని చిన్నారులు సేదతీరుతున్నారు. ఎండల ప్రభావం తీవ్రంగా ఉన్న ప్రస్తుత తరుణంలో చిన్నారుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గురువారం నుంచి సెలవులు ప్రకటించింది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోవడంతో సెలవులు ఎప్పుడు వస్తాయా అంటూ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారు. - సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం -
పసుపు రైతుల ఆశాకిరణం
మేలురకం వంగడాల సృష్టికర్త లాభాల సాగుకు రైతుల మళ్లింపు అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్న వైనం సాంప్రదాయ దేశవాళీ రకాల సాగుతో దెబ్బతింటున్న రైతులకు ఆశాకిరణం పిడికిటి చంద్రశేఖర్ ఆజాద్. మేలురకం పసుపు వంగడాలను అభివృద్ధి చేసి ఎందరో రైతులను లాభాల సాగుకు మళ్లించారు. సొంత రాష్ట్రం, హిమాచల్‌ప్రదేశ్ వంటి పొరుగు రాష్ట్రాల్లోనూ ఆజాద్ అభివృద్ధి చేసిన పసుపు రకాలతో రైతులు అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నారు. కాలికట్‌లోని భారత జాతీయ సుగంధ పరిశోధన కేంద్రం (ఐఐఎస్ఆర్), ఆజాద్ ప్రాచుర్యంలోకి తీసుకొచ్చిన పసుపు రకానికి ఆయన పేరుతోనే లైసెన్సు ఇవ్వనుంది. తాడేపల్లి మండలం గుండిమెడకు చెందిన 78 ఏళ్ల ఆజాద్‌కు చదువు పెద్దగా లేకున్నా కేవలం అనుభవం, అధ్యయనంతోనే నాణ్యమైన వంగడాలను వ్యాప్తి చేస్తున్నారు. తెనాలి : ఆజాద్‌ది రైతుకుటుంబం. తండ్రి స్వాతంత్య్రయోధుడు. చదివింది పదోతరగతే. భార్య శశికళ ఎంఏ చేసి, ప్రైవేటు స్కూలులో టీచరుగా పనిచేశారు. ఇద్దరు ఆడపిల్లలు. చదువు కోసమని దగ్గర్లోని విజయవాడకు వెళ్లారు. ఉపాధి కోసమని ప్రింటింగ్ ప్రెస్ నడిపారు. బిడ్డల పెళ్లిళ్లతో బాధ్యతల బరువు తీరిందనుకొనేసరికి తండ్రి మరణించటంతో 1980లో గ్రామంలో వ్యవసాయాన్ని చేపట్టారు. ’ప్రతిభ’ పసుపు వంగడంతో ఆరంభం... కేరళలోని ఐఐఎస్ఆర్ 2005లో ‘ప్రతిభ’ రకం పసుపు వంగడాన్ని తీసుకొచ్చింది. మల్టీలోకేషన్ ట్రయల్స్‌లో భాగంగా ఆజాద్‌కు 50 కిలోల విత్తనం సమకూర్చారు. సాధారణ పసుపు రకాల పంటకాలం 275 రోజులైతే ప్రతిభ 210 రోజుల్లోనే పంటకొస్తుంది. ఏటా విత్తనాన్ని అభివృద్ధి చేస్తూ తోటిరైతులకు అందజేస్తూ వచ్చారు. ఉమ్మడి రాష్ట్రం, ఉద్యానవనశాఖ, మహారాష్ట్ర రైతులకు ఎనిమిదేళ్లపాటు 100 టన్నులపైగా విత్తనాన్ని సరఫరా చేయగలిగారు. ఖర్చులు మినహాయించుకొని ఎకరా సాగుమీద రైతుకు కనీసం రూ.1.50 లక్షలు ఆదాయం లభించిందని ఆజాద్ చెప్పారు. పసుపు నాణ్యంగా ఉన్నా సైజు సన్నగా ఉండటం, ధర తక్కువ పడుతోంది. హైబ్రిడ్ రకమైనందున కాలక్రమంలో తెగుళ్ల బెడద ఎదురైంది. ప్రత్యామ్నాయం ఎలాగా ? అని ఆలోచిస్తున్న తరుణంలో అద్భుతమైన సహజమైన పసుపు రకాలతో ఐఐఎస్ఆర్ శాస్త్రవేత్తలు ప్రత్యక్షమయ్యారు. 12 టన్నుల దిగుబడి.... 2013 జూన్ 13న ఐఐఎస్ఆర్ శాస్త్రవేత్తలు డాక్టర్ శశికుమార్, డాక్టర్ ప్రసాద్‌లు ఏసీసీ 48, ఏసీసీ 79, 849 రకాల పసుపు విత్తనాలను తీసుకొచ్చారు. ఆజాద్ చేలో నాటించారు. ఒక్కోరకం 420 కిలోల దిగుబడి వచ్చింది. 2014–15లో ఏసీసీ 48, ఏసీసీ 79 రకాలు రెండింటినీ ఎకరంలో సాగుచేసి, 12 టన్నుల దిగుబడి సాధించారు. తన చేలో ఈ సీజనులో 800 కిలోల విత్తనాన్ని నాటారు. బోదెకు బోదెకు మధ్య 60 సెం.మీ, మొక్కకు మొక్కు మధ్య 20 సెం.మీ దూరం పాటించాం. 35 వేల మొక్కలు వచ్చాయి. ఎకరాకు సగటున పచ్చిపసుపు 16 టన్నుల పచ్చిపసుపు వస్తుందని అంచనా. దుంపసైజు బాగుంది. కర్కుమిన్ 5 శాతం స్థిరంగా వస్తోందని చెప్పారు. 210 రోజుల్లోపే పంట వస్తున్నందున మరో స్వల్పకాలిక పంట వేసుకొనేందుకు అవకాశముంది. ఇతర రాష్ట్రాలకూ విత్తనాలు... ప్రతిభ రకంలానే ఈ రకాలనూ అభ్యుదయ రైతులు, తెలంగాణ, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, హిమాచలప్రదేశ్ రైతులకు ఆజాద్ అందజేస్తున్నారు. ఆయా రైతులు సాగుచేస్తున్న 79 ఎకరాల్లో పంట విజయవంతమైందని చెప్పారు. 2017–18 నాటికి తెలంగాణలో కనీసం 2 వేల ఎకరాల్లో సాగుకు రానుంది. ఏసీసీ 48, ఏసీసీ 79 రకాలు అడవుల్నుంచి సేకరించిన సహజమైన రకాలుగా చెప్పారు. ఆజాద్ ఇప్పటికే వివిధ రాష్ట్రాలకు పరిచయం చేసిన ఏసీసీ 48కి ‘ప్రగతి’గా నామకరణం చేసి 2016 నవంబరులో రిలీజ్ చేశారు. -
సూర్యోదయం, సూర్యాస్తమయం
సూర్యోదయం : 5.47 సూర్యాస్తమయం : 6.26 రాహుకాలం : ఉ.10.30 నుంచి 12.00 వరకు యమగండం : ప.3.00 నుంచి 4.30 వరకు -
పుష్కర ఉషోదయం
కొల్లిపర: కృష్ణా పుష్కరాలు ప్రారంభమైనప్పటి నుంచి ఎండలు మండి పోతున్నాయి. సూర్యోదయం వేళ మాత్రం వాతావరణ ఆహ్లాదంగా ఉంటుంది. దీంతో భక్తులు ఉదయం వేళ నదిలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు మొగ్గు చూపుతున్నారు. దీంతో సూర్యోదయాన భక్తుల రద్దీ నది వద్ద కొనసాగుతోంది. -
సూర్యోదయం, సూర్యాస్తమయం
సూర్యోదయం : 5.47 సూర్యాస్తమయం : 6.27 రాహుకాలం : ప 12.00 నుంచి 1.30 వరకు యమగండం : ఉ.7.30 నుంచి 9.00 వరకు -
అరసవెల్లిలో ఆవిష్కృతమైన అద్భుతం
-
తెలుగు రాష్ట్రాలు భగభగ
విశాఖపట్నం: తెలుగు రాష్ట్రాలు అట్టుడుకుతున్నాయి. వేడి సెగలు కక్కుతున్నాయి. తెలంగాణతో పాటు కోస్తాంధ్ర, రాయలసీమలోనూ ఉష్ణోగ్రతలు ఉగ్రరూపం దాలుస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్‌లో శనివారం 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. రెండు రాష్ట్రాల్లో ఈ సీజనులో ఇదే అత్యధిక గరిష్ట ఉష్ణోగ్రత కావడం గమనార్హం. రామగుండంలో 43 డి గ్రీలు, రాయలసీమలోని కర్నూలు, కోస్తాంధ్రలోని నెల్లూరుల్లో 42 డిగ్రీలు, హైదరాబాద్, తిరుపతి, అనంతపురంలలో 41 డిగ్రీలు, నందిగామ, కావలి, గన్నవరంలలో 40 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఇరు రాష్ట్రాల్లోనూ సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల వరకు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరో ఒకట్రెండు రోజుల పాటు ఉష్ణతాపం కొనసాగవచ్చని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు తూర్పు ఉత్తరప్రదేశ్ నుంచి ఛత్తీస్‌గఢ్ మీదుగా తెలంగాణ వరకు ఉపరితల ద్రోణి ఆవరించి ఉంది. దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల లో అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షం గాని, జల్లులు గాని కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం శనివారం రాత్రి విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. పగటి పూట ఎండలు తీవ్రరూపం దాల్చినా సాయంత్రానికి క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడతాయని, ఫలితంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కూడా కురవవచ్చని తెలిపింది.