పసుపు రైతుల ఆశాకిరణం
-
మేలురకం వంగడాల సృష్టికర్త
-
లాభాల సాగుకు రైతుల మళ్లింపు
-
అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్న వైనం
సాంప్రదాయ దేశవాళీ రకాల సాగుతో దెబ్బతింటున్న రైతులకు ఆశాకిరణం పిడికిటి చంద్రశేఖర్ ఆజాద్. మేలురకం పసుపు వంగడాలను అభివృద్ధి చేసి ఎందరో రైతులను లాభాల సాగుకు మళ్లించారు. సొంత రాష్ట్రం, హిమాచల్‌ప్రదేశ్ వంటి పొరుగు రాష్ట్రాల్లోనూ ఆజాద్ అభివృద్ధి చేసిన పసుపు రకాలతో రైతులు అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నారు. కాలికట్‌లోని భారత జాతీయ సుగంధ పరిశోధన కేంద్రం (ఐఐఎస్‌ఆర్), ఆజాద్ ప్రాచుర్యంలోకి తీసుకొచ్చిన పసుపు రకానికి ఆయన పేరుతోనే లైసెన్సు ఇవ్వనుంది. తాడేపల్లి మండలం గుండిమెడకు చెందిన 78 ఏళ్ల ఆజాద్‌కు చదువు పెద్దగా లేకున్నా కేవలం అనుభవం, అధ్యయనంతోనే నాణ్యమైన వంగడాలను వ్యాప్తి చేస్తున్నారు.
తెనాలి : ఆజాద్‌ది రైతుకుటుంబం. తండ్రి స్వాతంత్య్రయోధుడు. చదివింది పదోతరగతే. భార్య శశికళ ఎంఏ చేసి, ప్రైవేటు స్కూలులో టీచరుగా పనిచేశారు. ఇద్దరు ఆడపిల్లలు. చదువు కోసమని దగ్గర్లోని విజయవాడకు వెళ్లారు. ఉపాధి కోసమని ప్రింటింగ్ ప్రెస్ నడిపారు. బిడ్డల పెళ్లిళ్లతో బాధ్యతల బరువు తీరిందనుకొనేసరికి తండ్రి మరణించటంతో 1980లో గ్రామంలో వ్యవసాయాన్ని చేపట్టారు.
’ప్రతిభ’ పసుపు వంగడంతో ఆరంభం...
కేరళలోని ఐఐఎస్‌ఆర్ 2005లో ‘ప్రతిభ’ రకం పసుపు వంగడాన్ని తీసుకొచ్చింది. మల్టీలోకేషన్ ట్రయల్స్‌లో భాగంగా ఆజాద్‌కు 50 కిలోల విత్తనం సమకూర్చారు. సాధారణ పసుపు రకాల పంటకాలం 275 రోజులైతే ప్రతిభ 210 రోజుల్లోనే పంటకొస్తుంది. ఏటా విత్తనాన్ని అభివృద్ధి చేస్తూ తోటిరైతులకు అందజేస్తూ వచ్చారు. ఉమ్మడి రాష్ట్రం, ఉద్యానవనశాఖ, మహారాష్ట్ర రైతులకు ఎనిమిదేళ్లపాటు 100 టన్నులపైగా విత్తనాన్ని సరఫరా చేయగలిగారు. ఖర్చులు మినహాయించుకొని ఎకరా సాగుమీద రైతుకు కనీసం రూ.1.50 లక్షలు ఆదాయం లభించిందని ఆజాద్ చెప్పారు. పసుపు నాణ్యంగా ఉన్నా సైజు సన్నగా ఉండటం, ధర తక్కువ పడుతోంది. హైబ్రిడ్ రకమైనందున కాలక్రమంలో తెగుళ్ల బెడద ఎదురైంది. ప్రత్యామ్నాయం ఎలాగా ? అని ఆలోచిస్తున్న తరుణంలో అద్భుతమైన సహజమైన పసుపు రకాలతో ఐఐఎస్‌ఆర్ శాస్త్రవేత్తలు ప్రత్యక్షమయ్యారు.
12 టన్నుల దిగుబడి....
2013 జూన్ 13న ఐఐఎస్‌ఆర్ శాస్త్రవేత్తలు డాక్టర్ శశికుమార్, డాక్టర్ ప్రసాద్‌లు ఏసీసీ 48, ఏసీసీ 79, 849 రకాల పసుపు విత్తనాలను తీసుకొచ్చారు. ఆజాద్ చేలో నాటించారు. ఒక్కోరకం 420 కిలోల దిగుబడి వచ్చింది. 2014–15లో ఏసీసీ 48, ఏసీసీ 79 రకాలు రెండింటినీ ఎకరంలో సాగుచేసి, 12 టన్నుల దిగుబడి సాధించారు. తన చేలో ఈ సీజనులో 800 కిలోల విత్తనాన్ని నాటారు. బోదెకు బోదెకు మధ్య 60 సెం.మీ, మొక్కకు మొక్కు మధ్య 20 సెం.మీ దూరం పాటించాం. 35 వేల మొక్కలు వచ్చాయి. ఎకరాకు సగటున పచ్చిపసుపు 16 టన్నుల పచ్చిపసుపు వస్తుందని అంచనా. దుంపసైజు బాగుంది. కర్కుమిన్ 5 శాతం స్థిరంగా వస్తోందని చెప్పారు. 210 రోజుల్లోపే పంట వస్తున్నందున మరో స్వల్పకాలిక పంట వేసుకొనేందుకు అవకాశముంది.
ఇతర రాష్ట్రాలకూ విత్తనాలు...
ప్రతిభ రకంలానే ఈ రకాలనూ అభ్యుదయ రైతులు, తెలంగాణ, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, హిమాచలప్రదేశ్ రైతులకు ఆజాద్ అందజేస్తున్నారు. ఆయా రైతులు సాగుచేస్తున్న 79 ఎకరాల్లో పంట విజయవంతమైందని చెప్పారు. 2017–18 నాటికి తెలంగాణలో కనీసం 2 వేల ఎకరాల్లో సాగుకు రానుంది. ఏసీసీ 48, ఏసీసీ 79 రకాలు అడవుల్నుంచి సేకరించిన సహజమైన రకాలుగా చెప్పారు. ఆజాద్ ఇప్పటికే వివిధ రాష్ట్రాలకు పరిచయం చేసిన ఏసీసీ 48కి ‘ప్రగతి’గా నామకరణం చేసి 2016 నవంబరులో రిలీజ్ చేశారు.