సూర్యం శరణం గచ్ఛామి! | Tata Group Company 1Mg Survey On Vitamin D deficiency | Sakshi
Sakshi News home page

సూర్యం శరణం గచ్ఛామి!

Published Mon, Feb 6 2023 4:58 AM | Last Updated on Mon, Feb 6 2023 4:58 AM

Tata Group Company 1Mg Survey On Vitamin D deficiency - Sakshi

కేస్‌ స్టడీ..  చిన్న బకెట్‌తో నీళ్లు తెస్తుంటే..
ఆత్మకూరు మండలం నల్లపరెడ్డిపల్లె గ్రామానికి చెందిన మస్తానమ్మకు సుమారు 60 ఏళ్లు ఉంటాయి. యాక్టివ్‌గా ఉండేది. అయితే కొంతకాలం క్రితం చిన్న బకెట్‌తో నీరు తీసుకువెళ్తుండగా కాలు స్లిప్‌ అయి మెల్లగా కిందకు ఒరిగిపోయి పైకి లేవలేకపోయింది. దీంతో ఆమెను కుటుంబ సభ్యులు నెల్లూరులోని ఆస్పత్రికి తరలించారు. ఎక్స్‌రే తీయగా తొడభాగంలో పొడవైన ఎముక ముక్కలుగా విరిగిపోయి ఉంది. దీంతో డాక్టర్లు ఆమెకు ఆపరేషన్‌ చేసి రాడ్‌ వేశారు. ఇలా ఎందుకు జరిగిందని కుటుంబ సభ్యులు ప్రశ్నించగా ఆమెకు విటమిన్‌–డి, కాల్షియం లోపం ఉన్నాయని, అందుకే ఎముకలు పెళుసుబారి కాలు విరిగిందని డాక్టర్లు తెలిపారు. ఇది ఒక ఉదాహరణ మాత్రమే. నిత్యం ఇలాంటి కేసులు జిల్లాలోని పలు ఆస్పత్రులకు వస్తున్నాయి. 

సాక్షి, నెల్లూరు డెస్క్‌: ఆరోగ్యమే మహాభాగ్యం. సృష్టిలో ప్రతి జీవి ఆరోగ్యంగా ఉండేలా ప్రకృతి అన్ని వనరులు ప్రసాదించింది. కానీ మనిషి జీవనశైలి గాడి తప్పడంతో అనారోగ్యాలకు గురవుతున్నాడు. మన దేశ జనాభాలో ప్రతి నలుగురిలో ముగ్గురు విటమిన్‌–డి లోపంతో బాధపడుతున్నట్లు తాజాగా గురుగావ్‌కు చెందిన టాటా గ్రూప్‌ కంపెనీ 1ఎంజీ నిర్వహించిన సర్వేలో వెల్లడైనట్లు పేర్కొంది. 

విటమిన్‌–డి ఎలా అందుతుంది?
మన శరీరానికి రెండు మార్గాల ద్వారా విటమిన్‌–డి అందుతుంది. అందులో మొదటిది సూర్యరశ్మి నుంచి, రెండోది ఆహారంగా తీసుకోవడం ద్వారా వస్తుంది. ప్రతిరోజూ ఎండలో కొంత సమయం ఉంటే చాలు మనిషి శరీరానికి అవసరమైన డి–విటమిన్‌ సహజంగానే అందుతుంది. అలాగే చేపలు, గుడ్డు­లోని పచ్చసొన, పాలు, తృణధాన్యాలు తీసుకో­వడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు. 

ప్రాముఖ్యత ఏమిటంటే..
మన దేహంలో బలమైన ఎముకలు, కండరాలు, దంతాలు ఏర్పడాలంటే విటమిన్‌–డి ఎంతో అవసరం. తగినంతగా ఈ షోషకం లేకపోతే చిన్నపిల్లల్లో ఎముకలు పటుత్వం కోల్పోయి వంకర్లు పోతాయి. పెద్దవాళ్లలో అయితే ఎముకలు గుల్లబారి ధృడత్వం పోతుంది. తర్వాత కీళ్ల నొప్పులతో మొదలై పలు ఇబ్బందులు ఏర్పడతాయి. ఫలితంగా ఏ చిన్న ప్రమాదం జరిగినా ఎముకలు విరిగి పోతుంటాయి. అందుకే ముందుగా మేల్కొని డాక్టర్‌ను సంప్రదించి సమస్య రాకుండా జాగ్రత్తపడాలి.

డి–విటమిన్‌ లోపిస్తే..
మన శరీరానికి విటమిన్‌–డి లోపిస్తే ఉదరంలోని పేగులు కాల్షియం, ఫాస్ఫరస్‌ను తగినంతగా సంగ్రహించలేవు. ఇది హైపోకాల్సిమియాకు దారితీస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. అంటే రక్తంలో కాల్షియం లెవెల్స్‌ తగ్గిపోవడం. ఫలితంగా కండరాలు బలహీనపడి.. పిక్కలు పట్టేయడం, మలబద్ధకం, నీరసం వంటి సమస్యలు వస్తాయి. తీవ్రత ఎక్కువైతే ఒక్కోసారి డిప్రెషన్‌కు గురికావచ్చు.

సమస్యకు కారణాలు
విటమిన్‌–డి లోపం నేటి కాలంలో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఉంది. గతంలో సుమారు మూడు దశాబ్దాల క్రితం వరకు స్కూళ్లలో విద్యార్థులు ఉదయం కొంతసేపు ఎండలో నిలబడి ప్రతిజ్ఞ చేసేవారు. అంతేకాకుండా సాయంత్రం డ్రిల్‌ పిరియడ్‌ ఉండేది. ఆ సమయంలో పిల్లలందరూ గ్రౌండ్‌లో ఆటలాడేవారు. ఆ విధంగా వారికి అవసరమైన మేరకు డి విటమిన్‌ సూర్యరశ్మి ద్వారా అందేది.

పెద్దలు కూడా ఎక్కువమంది ఎండలోనే కాయకష్టం చేసేవారు కాబట్టి వారికి ఈ సమస్య ఎదురుకాలేదు. కాలక్రమంలో ప్రైవేట్‌ స్కూళ్లు ఎక్కువ కావడం, వాటిలో చేరే విద్యార్థులను నాలుగు గోడల మధ్య కుక్కి చదివించడమే కానీ గౌండ్‌లో ఆటలాడించడం లేకుండా పోయింది. ధనికుల పిల్లలు ఇళ్లలో, స్కూళ్లలో కూడా ఏసీ గదుల్లోనే గడిపేస్తుండటంతో వారికి విటమిన్‌–డి లోపిస్తోంది.

అవగాహన లోపం
ఎండలో తిరిగితే నల్లబడిపోతామని, చర్మ ఛాయ తగ్గుతుందని భావిస్తూ చాలామంది ఇళ్లలోనే ఉండిపోతున్నారు. ఒకవేళబయటకు రావాల్సి వచ్చినా పూర్తిగా దుస్తులతో శరీరాన్ని కప్పేస్తున్నారు. ఇలా చేయడంతో వారికి సూర్యరశ్మి తగలకు విటమిన్‌–డి అందడం లేదు. శరీరానికి ఉదయం, సాయంత్రం వేళల్లో అయినా కొంత సమయం సూర్యరశ్మి తాకేలా చూసుకోవాలి.

గ్రామీణులే మెరుగు
సాధారణంగా పట్టణాల్లో నీడపట్టున పనిచేయడం, ఏసీ రూంలలో ఉండటం, రాత్రిళ్లు మేలుకొని విధులు నిర్వర్తించే వారు, ఇలా ఎండతగలని వారికి విటమిన్‌–డి లోపం ఉంటోంది. ఎండలో కనీసం 4 గంటలు పని చేసేవారికి విటమిన్‌–డి ఎక్కువగా వస్తుంది. తద్వారా ఎముకలు బలంగా, ధృడంగా ఉంటాయి. అందువల్లనే గ్రామీణ ప్రాంతాల్లో ఎండలో పని చేసేవారికి డి విటమిన్‌ అంది వారు ధృడంగా ఉంటారని వైద్యులు చెపుతున్నారు. 

ఇష్టానుసారంగా విటమిన్‌లు తీసుకోరాదు
ప్రస్తుతం మార్కెట్‌లో అనేక మంది డాక్టర్‌ ప్రిస్క్రిప్షన్‌ లేకుండా ఇష్టానుసారంగా విటమిన్‌–డి, కాల్షియం, ఇ విటమిన్‌ లాంటి మాత్రలు కొనుగోలు చేసి వినియోగిస్తున్నారు. ఇది సరైనది కాదు. శరీరానికి తక్కువ మోతాదులో విటమిన్లు అవసరమవుతాయి. ప్రతిరోజూ డి–విటమిన్‌ ట్యాబ్లెట్‌ తీసుకుంటే ఆ కాంపోనెంట్‌ ఎక్కువై మూత్రం ద్వారా బయటకు వెళ్లిపోతుంది.

శరీరానికి ఉపయోగపడదు. ఒక్కో దఫా అతిగా వినియోగించినందు వల్ల అర్థిమియా వచ్చి (గుండె చాలా వేగంగా కొట్టుకోవడం) గుండె ఆగిపోయే ప్రమాదం ఉంది. అందువల్ల డాక్టర్ల సలహా లేకుండా ఏ మాత్రలు వినియోగించకూడదు. 

పిల్లల్లోనూ సమస్య ఉంది
డి–విటమిన్‌ లోపం పెద్ద వారిలోనే కాకుండా పిల్లల్లోనూ ఉంది. 30 శాతం మంది పిల్లల్లో డి–విటమిన్‌¯ తక్కువ ఉన్నందువల్ల వారి శారీరక, మానసిక పెరుగుదల సరిగా ఉండటం లేదు. ఈ ప్రభావం చదువుపై పడుతోంది.  అంతేకాకుండా చిన్నపిల్లల్లో రికెట్స్‌ వ్యాధికి గురవుతున్నారు. పెద్దల్లో 40 నుంచి 45 శాతం మందికి విటమిన్‌–డి లోపం ఉంటోంది. డి–విటమిన్‌ శరీరానికి అందాలంటే ఎండవేడిమికి అలవాటు పడాలి. విటమిన్లు తగ్గితే శరీర జీవన ప్రక్రియలు సకాలంలో జరగాల్సిన తీరులో జరగవు. విటమిన్స్‌ లభించే పదార్ధాలు, ఆకుకూరలు, కాయగూరలు ఎక్కువగా తీసుకోవాలి. 
–డాక్టర్‌ మస్తాన్‌బాష, అసోసియేట్‌ ప్రొఫెసర్, ఆర్థోపెడిక్‌ స్పెషలిస్టు, జీజీహెచ్‌

అతిగా ఉపయోగిస్తే అనర్ధాలు
జీవన క్రియలు సక్రమంగా జరగాలంటే స్థూల పోషకాలతో పాటు సూక్ష్మ పోషకాలు విటమిన్లు శరీరానికి అవసరం. ఇందులో డి విటమిన్‌ శరీరంలో తక్కువగా ఉందంటే అనుబంధంగా కాల్షియం కూడా తగ్గిపోతుంది. ఇసుక–సిమెంట్‌ కలిస్తేనే గోడ బలంగా ఉన్నట్టు, డి విటమిన్, కాల్షియం సరిపడా ఉండాలి. ఇవి లోపిస్తే ఎముకలు గుల్లబారుతాయి. పెద్ద కారణం లేకుండానే ఎముకలు విరిగిపోతాయి.

40 ఏళ్లు వచ్చిన మహిళల్లో ముందస్తు మెనోపాజ్‌ దశ వల్ల కూడా విటమిన్స్‌ లోపం ఏర్పడి హార్మోన్స్‌ బ్యాలెన్స్‌ తగ్గి కాల్షియం తగ్గిపోతుంది. అప్పుడు డి విటమిన్‌ కూడా తగ్గుతుంది. మునగ ఆకు, మునగ కాయలు, రాగులు, పాలు, గుడ్డు, చేప, గుమ్మడి లాంటి ఆహార పదార్థాలు తీసుకునే వారిలో విటమిన్‌ డి తగ్గదు. 
–డాక్టర్‌ రోజారమణి, అసోసియేట్‌ ప్రొఫెసర్, జనరల్‌ సర్జన్, జీజీహెచ్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement