శ్రీకాకుళం అర్బన్:గతంలో మాదిరిగా తపాలా శాఖ సేవలు ప్రజలకు చేరువ కాలేకపోతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అనేక పథకాలపై ప్రచారం కొరవడుతోంది. దీంతో ప్రైవేట్ సంస్థల ఆధిపత్యం పెరిగి తపాలా ఆదాయానికి గండి పడుతోంది. ప్రజలు కూడా అధిక చార్జీల భారాన్ని మోయాల్సి వస్తోంది. జిల్లాలో తపాలాశాఖకు సంబంధించి మూడు ప్రధాన తపాలా కార్యాలయాలు, 65 సబ్ పోస్టాఫీసులు, 424 బ్రాంచి ఆఫీసులు ఉన్నాయి. వీటి పరిధిలో సుమారు 1300 మంది పనిచేస్తున్నారు. తక్కువ చార్జీలకే పోస్టాఫీసుల సేవలు అందుబాటులో ఉన్నా ప్రజలు ఎందుకు అటువైపు మొగ్గు చూపడంలేదన్నది తెలుసుకునేందుకు శ్రీకాకుళం తపాలాశాఖ సూపరింటెండెంట్ జనపాల ప్రసాద్‌బాబు ఒక ప్రయత్నం చేశారు. ‘సాక్షి’ తరఫున వీఐపీ రిపోర్టర్‌గా వినియోగదారులను, ఏజెంట్లను, సిబ్బందిని కలుసుకొని లోపాలు తెలుసుకున్నారు. వివిధ వర్గాలతో ఆయన సంభాషణ యథాతథంగా..
సూపరింటెండెంట్ : తపాలాశాఖ అందిస్తున్న సౌకర్యాలు ఎలా ఉన్నాయి
రామారావు(నిరుద్యోగి, లోలుగు): సేవలు బాగున్నాయి. అయితే కొంత జాప్యం జరుగుతోంది. ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకునేందుకు వచ్చాను.
సూపరింటెండెంట్ : తపాలాశాఖలో సీనియర్ సిటిజన్స్‌కు సేవలు ఎలా ఉన్నాయి
పి.వీరభద్రరావు: సీనియర్ సిటిజన్స్‌కు సేవలు బాగానే అందుతున్నాయి. సిబ్బంది కూడా ఇబ్బంది లేకుండా చూస్తున్నారు.
సూపరింటెండెంట్ : ఆన్‌లైన్ సేవలు ఎలా ఉన్నాయి
ఎన్.వి.శేషాచ లం(ఏజెంట్): ఆన్‌లైన్ సేవలు బాగున్నాయి. అయితే కొన్ని సమయాల్లో మాత్రం ఇబ్బందులు పడుతున్నాం. ముఖ్యంగా ఎస్‌బీ, ఆర్డీ, సేవింగ్స్ పథకాలకు సంబందించి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వాటిని తొలగించాలి.
సూపరింటెండెంట్ : తపాలాశాఖ సిబ్బంది ఏమైనా ఇబ్బంది పెడుతున్నారా?
శేషాచలం: సిబ్బంది ఎటువంటి ఇబ్బంది పెట్టడం లేదు.
సూపరింటెండెంట్ : ఏజెంట్ల పరంగా ఎటువంటి సమస్యలు ఉన్నాయి?
ఎస్.వైకుంఠరావు(ఏజెంట్): మూడు నెలల క్రితం వరకూ ఖాతాదారులు కట్టిన డిపాజిట్లు కాలపరిమితి ముగిసిన వెంటనే నగదు చెల్లించేవారు. ఇపుడు నెల రోజులు ఆలస్యం అవుతోంది.
సూపరింటెండెంట్ : ఏజెంట్లు, ఖాతాదారులు పడుతున్న ఇబ్బందులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చారా?
హెచ్.సత్తిబాబు(ప్రధాన తపాలాశాఖ పోస్ట్‌మాస్టర్): ఖాతాదారులు, ఏజెంట్లు పడుతున్న ఇబ్బందులను గుర్తించాం. సమస్యను తపాలాశాఖ సూపరింటెండెంట్ దృష్టికి తీసుకురాలేదు.
సూపరింటెండెంట్ : సిబ్బందికి ఏమైనా సమస్యలు ఉన్నాయా?
పోస్ట్ మాస్టర్: సిబ్బందికి ఎటువంటి సమస్యలూ లేవు.
సూపరింటెండెంట్ : ఖాతాదారులకు మౌలిక సదుపాయాలు ఎలా ఉన్నాయి?
పోస్ట్‌మాస్టర్: అన్ని సదుపాయాలు కల్పించాం. కూర్చునేందుకు
కుర్చీలు, మంచినీటి సౌకర్యార్థం లయన్స్ క్లబ్ సహకారంతో తాగునీటి కులాయి ఏర్పాటు చేశాం.
సూపరింటెండెంట్ : కొత్త పథకాలు గురించి చెప్పండి?
పోస్ట్‌మాస్టర్: తపాలాశాఖ సుకన్య సమృద్ధి యోజన పథకం ప్రవేశపెట్టింది. కనీసం రూ.1000 నుంచి గరిష్టంగా రూ.1.50 లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చు.
సూపరింటెండెంట్ : ఈ పథకం గూర్చి ప్రజలకు, ఖాతాదారులకు తెలియదనే విమర్శ ఉంది. ఏమైనా ప్రచారం కల్పించారా?
పోస్ట్‌మాస్టర్: ప్రచారం కల్పిస్తున్నాం. ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులకు ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుంది.
సూపరింటెండెంట్ : ఆర్డీ కాలపరిమితి ముగిసిన తరువాత నగదు చెల్లింపులో ఒక నెల ఆలస్యం జరుగుతోందని ఖాతాదారులు చెబుతున్నారు. దీనిపై మీ సమాధానం?
ఎ.కృష్ణారావు(అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్): ఆర్డీ కాలపరిమితి ముగిసిన తరువాత ఒక నెల ఆలస్యం అయిన మాట వాస్తవమే. సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తా.
మెరుగైన సేవలకు కృషి
తపాలాశాఖ సేవల గురించి ఖాతాదారులు, సిబ్బంది అభిప్రాయాలు తెలుసుకున్నాను. కొన్ని విభాగాల్లో చిన్న చిన్న పొరపాట్లను గుర్తించాను. వాటిని త్వరితగతిన పరిష్కరించేందుకు కృషిచేస్తా. తపాలాశాఖ పలు కొత్త పథకాలను అందుబాటులోకి తెస్తోంది. వీటిపై ప్రజలకు మరింత లోతుగా అవగాహన కల్పిస్తాం. ఖాతాదారులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు కృషిచేస్తా. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మరింత చేరువై సేవలందిస్తాం. తపాలాశాఖ ఆదాయం కంటే సేవలకే ప్రాధాన్యత ఇస్తుంది. ఆర్డీ(రికరింగ్ డిపాజిట్) కాలపరిమితి ముగిసిన తరువాత నెలరోజులు ఆలస్యంగా ఖాతాదారులకు నగదు ఇస్తున్నట్లు గుర్తించాను. ఇక ముందు ఆలస్యం కాకుండా చూస్తాం. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సుకన్య సమృద్ధి యోజన, పీఎల్‌ఐ పథకాలు ఖాతాదారులకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తాయి. వీటిపై పూర్తి అవగాహన కల్పిస్తాం. అదేవిధంగా టీటీడీ దర్శనం కోసం రూ.300 టికెట్లను అన్ని ప్రధాన తపాలా కార్యాలయాల వద్ద విక్రయిస్తున్నాం. ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. అమ్మకాలు బాగున్నాయి. తపాలాశాఖలో 16 ప్రింటర్లకు మరమ్మతు చేయించాం. కొత్తగా 24 కంప్యూటర్లను కొనుగోలు చేశాం. జిల్లా వ్యాప్తంగా 76 కొత్త కంప్యూటర్లు, 54 ప్రింటర్లు కావాల్సి ఉండగా వాటికి ఆర్డర్ ఇచ్చాం.
- జె.ప్రసాద్‌బాబు,
తపాలాశాఖ సూపరింటెండెంట్
కొంచెం బాగు.. కాస్త జాగు!
Published Sun, Mar 1 2015 12:27 AM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM
Advertisement
Advertisement