
ఢిల్లీ: ట్రైమాక్స్ సంస్థ అక్రమ మైనింగ్ పై సుప్రీంకోర్టులో గురువారం విచారణ జరిగింది. తమ తరఫు న్యాయవాది అందుబాటులో లేకపోవడంతో విచారణకు కేంద్ర ప్రభుత్వం వాయిదా కోరింది. విచారణను సుప్రీం కోర్టు పది రోజులకు వాయిదా వేసింది. శ్రీకాకుళం జిల్లా గార మండలం బీచ్ శాండ్ మైనింగ్‌పై తాము తనిఖీ చేశామని అణు ఇంధన పరిశోధన సంస్థ తెలిపింది. త్వరలోనే విచారణ నివేదికను అందజేస్తామని కోర్టుకు తెలిపింది. కోనేరు ప్రసాద్‌కు సంబంధించిన ట్రైమాక్స్ సంస్థ తవ్వకాలలో అవకతవకలు జరిగాయంటూ మాజీ కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి ఈఏఎస్ శర్మ పిటిషన్ దాఖలు చేశారు. ట్రైమాక్స్ తవ్వకాలలో విలువైన అణుఇంధన ఖనిజం యురేనియాన్ని అక్రమంగా తవ్వుకుని ప్రభుత్వానికి తెలియకుండా అమ్ముకున్నారని సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.
ట్రైమాక్స్‌కు రాష్ట్ర గనుల శాఖ ఇచ్చిన షోకాజ్ నోటీసులపై నిర్ణయానికి ఏపీ ప్రభుత్వ న్యాయవాది గుంటూరు ప్రభాకర్ నాలుగువారాల సమయం కోరారు. విజిలెన్స్ నివేదిక ప్రకారం అక్రమ మైనింగ్ జరుగుతుందని తేలిన తరువాత కూడా లైసెన్స్ రద్దు చేయకుండా కేవలం సస్పెండ్ చేశారని ఈఏఎస్ శర్మ తరపు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కోర్టుకు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోబోతుంది కాబట్టి కేసు విచారణ ముగించాలని, ఇప్పటికే ఖనిజ తవ్వకాలు నిలిపివేశామని కోర్టుకు ట్రైమాక్స్ తరపు న్యాయవాది తెలిపారు. కేసు వాదనను కొనసాగించాల్సిన అవసరం లేదన్న ట్రైమాక్స్ తరపు న్యాయవాది వాదనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. కేంద్రప్రభుత్వ తరపు న్యాయవాది వాయిదా కోరడంతో సుప్రీంకోర్టు విచారణ వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment