సూర్యలంక తీరం అభివృద్ధి చేస్తా
బాపట్ల: సూర్యలంక సముద్ర తీరం అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఎమ్మెల్యే కోన రఘుపతి తెలిపారు. సూర్యలంకలో ఆక్రమణలు తొలగించి నూతనంగా నిర్మించతలపెట్టిన షాపురూముల నిర్మాణ పనులను సోమవారం ఎమ్మెల్యే కోన, ఆర్డీవో నరసింహం పరిశీలించారు. తీరానికి వచ్చే పర్యాటకులు, భక్తులకు షాపులు అసౌకర్యం కలిగించకూడదనే ఉద్దేశంతో కొన్నింటిని తొలగించి వాటిస్థానంలో తాత్కాలిక షాపులు ఏర్పాటు చేయించామని ఎమ్మెల్యే కోన వివరించారు. షాపుల ద్వారా వచ్చే అద్దెలను పంచాయతీ అభివృద్ధికి ఖర్చు చేసేవిధంగా నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
నిజాంపట్నం-చీరాలకు సముద్రం వెంబడి 24కిలోమీటర్లు మేర రోడ్డు నిర్మాణం చేపడితే గన్నవరం విమానాశ్రయానికి వెళ్లేందుకు కూడా 55 కిలోమీటర్లు దూరం తగ్గిపోతుందని కోన తెలిపారు. తీరంలో రూ.15 కోట్లుతో శాశ్వత షాపింగ్‌కాంప్లెక్స్ నిర్మించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు.
షాపులకు ఎదుట సిమెంటు రోడ్డు నిర్మాణం చేపట్టడం ద్వారా పర్యాటకులకు సౌకర్యంగా ఉంటుందన్నారు. అభివృద్ధి పనులకు సహకరిస్తామని ఆర్డీవో నరసింహం హామీఇచ్చారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ వడ్డిముక్కల రత్నమణి, తహశీల్దార్ టి.వల్లయ్య, సర్పంచ్ బొడ్డు సుబ్బారెడ్డి, నాయకులు వడ్డిముక్కల డేవిడ్, కౌన్సిలర్ సయ్యద్ షేక్ పీర్ ఉన్నారు.