suryalanka coastline
-
బాపట్ల బీచ్ లో బాదుడే బాదుడు
సాక్షి ప్రతినిధి, బాపట్ల : గత ప్రభుత్వ హయాంలో విశాఖ రుషికొండలోని బ్లూఫ్లాగ్ బీచ్‌లో ప్రవేశరుసుం వసూలుచేయాలని సంకల్పిస్తే నానా యాగీచేసిన పచ్చబ్యాచ్ ఇప్పుడు బాపట్ల సూర్యలంక బీచ్‌లో సిగ్గూఎగ్గూ లేకుండా అదే పనికి బరితెగిస్తున్నారు. ఇక్కడకు వచ్చే పర్యాటకుల నుంచి భారీగా పిండుకునేందుకు రంగం సిద్ధంచేశారు. బీచ్‌కు వచ్చే ఒక్కొక్కరి నుంచి రూ.20 చొప్పున వసూలుచేయాలని నిర్ణయించారు. అంతేకాదు.. ఇప్పటివరకూ వేలంపాట నిర్వహించి తద్వారా వాహనాల నుంచి టోల్గేట్లో డబ్బులు వసూలుచేసేవారు. ఇప్పుడు ఆ వేలంపాట ఎత్తేసి పంచాయతీ ముసుగులో తెలుగు తమ్ముళ్లే ఈ తతంగం మొత్తం నిర్వహించి బీచ్‌ను తమ గుప్పెట్లో పెట్టుకోనున్నారు. బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ శుక్రవారం జరిగిన బాపట్ల మున్సిపల్ సమావేశంలో ఈ అంశాన్ని ప్రస్తావించగా సభ్యులు, అధికారులు చప్పట్లతో స్వాగతించారు. ఈనెలాఖరు నుంచే పచ్చబ్యాచ్ వాహనాల నుంచి డబ్బులు వసూలుచేయనుండగా ఆ తర్వాత సందర్శకుల నుంచి వసూలు చేయనున్నారు. మరోవైపు.. పక్కనే ఉన్న చీరాలలో కూడా కొద్దిరోజులుగా ఇదే రీతిలో వసూళ్ల పర్వం సాగుతుండడంతో అక్కడ పచ్చనేతల దోపిడీపై పర్యాటకులు మండిపడుతున్నారు.వేలంపాటకు మంగళం..నిజానికి.. ఇప్పటివరకూ వేలంపాటలో టోల్గేట్ నిర్వహణను దక్కించుకున్న వారు సందర్శకుల నుంచి వాహనాలకు డబ్బులు వసూలు చేసేవారు. కానీ, ఇప్పుడు గ్రామ పంచాయతీ మాటున పచ్చ మాఫియాయే నేరుగా టోల్గేట్ వసూళ్లతోపాటు తీరంలో టాయిలెట్లు, ఇతరత్రా రాబడి వనరులన్నింటినీ తమ గుప్పెట్లోకి తీసుకుని దందా సాగించేందుకు సిద్ధమయ్యారు. ఎందుకంటే.. వారంలో ప్రతి శని, ఆదివారాల్లో ఇక్కడికి విపరీతంగా పర్యాటకులు వస్తారు. వారాంతంలో రెండ్రోజులు దాదాపు 20 వేల మంది పర్యాటకులు వస్తుండగా.. మిగిలిన ఐదురోజుల్లో 10 నుంచి 15 వేల మంది చొప్పున నెలకు 1.20 లక్షల మందికి తగ్గకుండా పర్యాటకులు వస్తున్నారు.ఈ లెక్కన నెలకు రూ.24 లక్షల రాబడి ఉంటుంది. దీంతో పచ్చ తమ్ముళ్లు దీనిని పాడికుండలా భావించి దీనిపై కన్నేశారు. అలాగే, టూవీలర్‌కు రూ.15, ఆటోకు రూ.30, కారుకు రూ.50, బస్సుకు రూ.100 చొప్పున ధరలు నిర్ణయించారు. గత ఏడాది ఇది వేలంపాటలో రూ.30 లక్షలు పలికింది. దీంతోపాటు ఇక్కడి కొన్ని టాయిలెట్స్, వాష్‌రూములు ఏర్పాటుచేసి నిర్వహణ కోసం వేలంపాట పెట్టగా అదీ ఏడాదికి రూ.5 లక్షలు పలికింది. ఇవికాకుండా బల్లలు, గుర్రాలు, తీరంలో పర్యాటకులను తిప్పే బైక్‌లు నడిపేవారు పంచాయతీకి పన్నులు చెల్లిస్తున్నారు. మొత్తంగా ఏడాదికి రూ.38 లక్షల వరకు తీరంపై రాబడి ఉంది. ఇలా ఇవన్నీ వేలంపాటలు కావడంతో రాబడిపై అందరికీ స్పష్టత ఉంది.కానీ, ఇప్పుడు ఈ వ్యవహారాన్నింట్లో ఇక తెలుగు తమ్ముళ్లదే పెత్తనం కావడంతో రాబడిపై అనేక అనుమానాలు ముసురుకుంటున్నాయి. ఎందుకంటే.. ఇప్పుడు ఎంత వస్తుందో అన్నది ఎవరికీ తెలిసే అవకాశంలేదు. అధికార పార్టీ కనుక అడిగేవారూ ఉండరు. ఇదే ఆలోచనకు వచ్చిన ఎల్లోగ్యాంగ్ తీరంలో పాగా వేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక కొద్దిరోజుల్లో కార్తీక మాసం ప్రారంభమవుతుండడంతో పచ్చనేతలకు పండగే పండగ. కారణం.. ఈ మాసంలో జనం లక్షల్లో తీరానికి వస్తారు. పెద్దఎత్తున వాహనాల రానుండటంతో రూ.లక్షల్లో వసూలుచేసుకునే అవకాశముంది. ఇదిచూసి.. పచ్చనేతల సొంత లాభం కోసమే పర్యాటకుల నుంచి డబ్బులు వసూళ్లకు దిగుతున్నారని ఆ పార్టీ నేతలే వ్యాఖ్యానించడం కొసమెరుపు. -
మృత్యు ఒడిలోకి వెళ్లే ముందు...
-
నేటి నుంచి సూర్యలంక తీరంలో మిస్సైల్ ఫైరింగ్
బాపట్ల టౌన్: గుంటూరు జిల్లా బాపట్ల సమీపంలోని సూర్యలంక తీరంలో మంగళవారం నుంచి మిస్సైల్ ఫైరింగ్ ప్రారంభం కానుంది. డిసెంబర్ 2వ తేదీ వరకు ఇది కొనసాగుతుంది. భారతదేశంలో ఉన్న ఎయిర్‌ఫోర్స్ స్టేషన్లలో తీరప్రాంతానికి దగ్గరగా దట్టమైన అడవుల మధ్య ఫైరింగ్ చేసేందుకు అనుకూలంగా ఉండటంతో మిస్సైల్ ఫైరింగ్‌కు ఈ తీరాన్ని ఎన్నుకున్నారు. ఆకాశమార్గం గుండా దేశంలోకి చొరబడే శత్రు విమానాలను నింగిలోనే గుర్తించి ఆ విమానాలను వందల కిలోమీటర్ల దూరంలో ఉండగానే మట్టికరిపించడం ఈ మిస్సైల్ ఫైరింగ్ ముఖ్య ఉద్దేశం. ఫైరింగ్‌కు కేరాఫ్ రాష్ట్రంలోని పర్యాటక ప్రదేశాల్లో సహజసిద్ధమైన తీరంగా ఖ్యాతిని సొంతం చేసుకుంది సూర్యలంక తీరం. వైమానిక దళానికి శిక్షణ ఇవ్వడంలోనూ ప్రత్యేకత చాటుతోంది. త్రివేండ్రం కమాండ్ పరిధిలో ఉన్న వాటిలో ఫైరింగ్‌కు అనుకూలమైన స్టేషన్ సూర్యలంక ఒక్కటే. ఫైరింగ్ చేసే ప్రతిసారీ మిస్సైల్ తయారీకి ఉపయోగించే శకలాలు భూమ్మీద పడితే వాటి నుంచి వెలువడే రసాయనాలు, ఇనుప వస్తువులు, ఉక్కుసామగ్రి వల్ల ప్రజలు అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉంటుంది. అయితే, సూర్యలంక ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ సముద్రానికి ఆనుకుని ఉండటంతో మిస్సైల్ ఫైరింగ్ అనంతరం శకలాలు సముద్రంలో పడిపోతుంటాయి. దీంతో ఎవరికీ ఎలాంటి హాని వాటిల్లే అవకాశం లేదు. అందుకే దేశంలో ఉన్న అన్ని ఎయిర్‌ఫోర్స్ స్టేషన్లకంటే సూర్యలంక స్టేషన్ శిక్షణ రంగంలో ముందంజలో ఉంది. తీరప్రాంత గ్రామాల్లో హెచ్చరికలు జారీ సూర్యలంక సముద్ర తీరంలో మంగళవారం నుంచి డిసెంబర్ 2 వరకు జరిగే మిస్సైల్ ఫైరింగ్‌కు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్, రాష్ట్ర రెవెన్యూ, పోలీస్, మత్స్యశాఖాధికారులు తీరప్రాంతాల్లోని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అప్రమత్తం చేశారు. ఫైరింగ్ జరిగే ప్రాంతం నుంచి తీరం వెంబడి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ప్రజలు ఉండకూడదని, ముఖ్యంగా మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని ఆదేశాలు జారీ చేశారు. గ్రామాల్లో దండోరా వేయించి ప్రజలకు ఫైరింగ్‌పై అవగాహన కల్పించారు. సూర్యలంకకు ప్రత్యేక స్థానం భారతదేశంలో మొత్తం 7 కమాండ్లు ఉన్నాయి. వాటిలో డబ్ల్యూఏసీ (వెస్ట్రన్ ఎయిర్ కమాండ్– ఢిల్లీ), సౌత్ ఎయిర్ కమాండ్ (త్రివేండ్రం), సౌత్ వెస్ట్ ఎయిర్ కమాండ్ (గుజరాత్), మెయింటెనెన్స్ కమాండ్ (నాగపూర్), సెంట్రల్ కమాండ్ (అలహాబాద్–యూపీ), ట్రైనింగ్ కమాండ్ (బెంగళూరు), అండమాన్ నికోబార్ కమాండ్ (పోర్ట్‌బ్లెయిర్)లో ప్రధానమైన కమాండ్లు ఉన్నాయి. ఒక్కో కమాండ్ పరిధిలో పదుల సంఖ్యలో ఎయిర్‌ఫోర్స్ స్టేషన్లు ఉంటాయి. త్రివేండ్రంలో ఉన్న సౌత్ ఎయిర్ కమాండ్ (సదరన్ కమాండ్) పరిధిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు సంబంధించిన 15 ఎయిర్‌ఫోర్స్ స్టేషన్లు ఉన్నాయి. వీటిలో బంగాళాఖాతానికి ఆనుకుని ఉన్న ఏకైక ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ సూర్యలంక మాత్రమే. -
సూర్యలంక తీరం అభివృద్ధి చేస్తా
బాపట్ల: సూర్యలంక సముద్ర తీరం అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఎమ్మెల్యే కోన రఘుపతి తెలిపారు. సూర్యలంకలో ఆక్రమణలు తొలగించి నూతనంగా నిర్మించతలపెట్టిన షాపురూముల నిర్మాణ పనులను సోమవారం ఎమ్మెల్యే కోన, ఆర్డీవో నరసింహం పరిశీలించారు. తీరానికి వచ్చే పర్యాటకులు, భక్తులకు షాపులు అసౌకర్యం కలిగించకూడదనే ఉద్దేశంతో కొన్నింటిని తొలగించి వాటిస్థానంలో తాత్కాలిక షాపులు ఏర్పాటు చేయించామని ఎమ్మెల్యే కోన వివరించారు. షాపుల ద్వారా వచ్చే అద్దెలను పంచాయతీ అభివృద్ధికి ఖర్చు చేసేవిధంగా నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. నిజాంపట్నం-చీరాలకు సముద్రం వెంబడి 24కిలోమీటర్లు మేర రోడ్డు నిర్మాణం చేపడితే గన్నవరం విమానాశ్రయానికి వెళ్లేందుకు కూడా 55 కిలోమీటర్లు దూరం తగ్గిపోతుందని కోన తెలిపారు. తీరంలో రూ.15 కోట్లుతో శాశ్వత షాపింగ్‌కాంప్లెక్స్ నిర్మించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు. షాపులకు ఎదుట సిమెంటు రోడ్డు నిర్మాణం చేపట్టడం ద్వారా పర్యాటకులకు సౌకర్యంగా ఉంటుందన్నారు. అభివృద్ధి పనులకు సహకరిస్తామని ఆర్డీవో నరసింహం హామీఇచ్చారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ వడ్డిముక్కల రత్నమణి, తహశీల్దార్ టి.వల్లయ్య, సర్పంచ్ బొడ్డు సుబ్బారెడ్డి, నాయకులు వడ్డిముక్కల డేవిడ్, కౌన్సిలర్ సయ్యద్ షేక్ పీర్ ఉన్నారు.