‘సూర్యలంక’ తీరంలో దోపిడీకి పచ్చనేతలు పాగా
వాహనాలకు ఇక నేరుగా డబ్బులు వసూళ్లు
ఇక్కడకు సందర్శకుల తాకిడి ఎక్కువైనందునే దీనిపై తమ్ముళ్ల కన్ను
ఇప్పటికే చీరాలలో ఇదే రీతిలో వసూళ్లు
సాక్షి ప్రతినిధి, బాపట్ల : గత ప్రభుత్వ హయాంలో విశాఖ రుషికొండలోని బ్లూఫ్లాగ్ బీచ్‌లో ప్రవేశరుసుం వసూలుచేయాలని సంకల్పిస్తే నానా యాగీచేసిన పచ్చబ్యాచ్ ఇప్పుడు బాపట్ల సూర్యలంక బీచ్‌లో సిగ్గూఎగ్గూ లేకుండా అదే పనికి బరితెగిస్తున్నారు. ఇక్కడకు వచ్చే పర్యాటకుల నుంచి భారీగా పిండుకునేందుకు రంగం సిద్ధంచేశారు. బీచ్‌కు వచ్చే ఒక్కొక్కరి నుంచి రూ.20 చొప్పున వసూలుచేయాలని నిర్ణయించారు. అంతేకాదు.. ఇప్పటివరకూ వేలంపాట నిర్వహించి తద్వారా వాహనాల నుంచి టోల్‌గేట్‌లో డబ్బులు వసూలుచేసేవారు.
ఇప్పుడు ఆ వేలంపాట ఎత్తేసి పంచాయతీ ముసుగులో తెలుగు తమ్ముళ్లే ఈ తతంగం మొత్తం నిర్వహించి బీచ్‌ను తమ గుప్పెట్లో పెట్టుకోనున్నారు. బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ శుక్రవారం జరిగిన బాపట్ల మున్సిపల్ సమావేశంలో ఈ అంశాన్ని ప్రస్తావించగా సభ్యులు, అధికారులు చప్పట్లతో స్వాగతించారు. ఈనెలాఖరు నుంచే పచ్చబ్యాచ్ వాహనాల నుంచి డబ్బులు వసూలుచేయనుండగా ఆ తర్వాత సందర్శకుల నుంచి వసూలు చేయనున్నారు. మరోవైపు.. పక్కనే ఉన్న చీరాలలో కూడా కొద్దిరోజులుగా ఇదే రీతిలో వసూళ్ల పర్వం సాగుతుండడంతో అక్కడ పచ్చనేతల దోపిడీపై పర్యాటకులు మండిపడుతున్నారు.
వేలంపాటకు మంగళం..
నిజానికి.. ఇప్పటివరకూ వేలంపాటలో టోల్‌గేట్ నిర్వహణను దక్కించుకున్న వారు సందర్శకుల నుంచి వాహనాలకు డబ్బులు వసూలు చేసేవారు. కానీ, ఇప్పుడు గ్రామ పంచాయతీ మాటున పచ్చ మాఫియాయే నేరుగా టోల్‌గేట్ వసూళ్లతోపాటు తీరంలో టాయిలెట్లు, ఇతరత్రా రాబడి వనరులన్నింటినీ తమ గుప్పెట్లోకి తీసుకుని దందా సాగించేందుకు సిద్ధమయ్యారు. ఎందుకంటే.. వారంలో ప్రతి శని, ఆదివారాల్లో ఇక్కడికి విపరీతంగా పర్యాటకులు వస్తారు. వారాంతంలో రెండ్రోజులు దాదాపు 20 వేల మంది పర్యాటకులు వస్తుండగా.. మిగిలిన ఐదురోజుల్లో 10 నుంచి 15 వేల మంది చొప్పున నెలకు 1.20 లక్షల మందికి తగ్గకుండా పర్యాటకులు వస్తున్నారు.
ఈ లెక్కన నెలకు రూ.24 లక్షల రాబడి ఉంటుంది. దీంతో పచ్చ తమ్ముళ్లు దీనిని పాడికుండలా భావించి దీనిపై కన్నేశారు. అలాగే, టూవీలర్‌కు రూ.15, ఆటోకు రూ.30, కారుకు రూ.50, బస్సుకు రూ.100 చొప్పున ధరలు నిర్ణయించారు. గత ఏడాది ఇది వేలంపాటలో రూ.30 లక్షలు పలికింది. దీంతోపాటు ఇక్కడి కొన్ని టాయిలెట్స్, వాష్‌రూములు ఏర్పాటుచేసి నిర్వహణ కోసం వేలంపాట పెట్టగా అదీ ఏడాదికి రూ.5 లక్షలు పలికింది. ఇవికాకుండా బల్లలు, గుర్రాలు, తీరంలో పర్యాటకులను తిప్పే బైక్‌లు నడిపేవారు పంచాయతీకి పన్నులు చెల్లిస్తున్నారు. మొత్తంగా ఏడాదికి రూ.38 లక్షల వరకు తీరంపై రాబడి ఉంది. ఇలా ఇవన్నీ వేలంపాటలు కావడంతో రాబడిపై అందరికీ స్పష్టత ఉంది.
కానీ, ఇప్పుడు ఈ వ్యవహారాన్నింట్లో ఇక తెలుగు తమ్ముళ్లదే పెత్తనం కావడంతో రాబడిపై అనేక అనుమానాలు ముసురుకుంటున్నాయి. ఎందుకంటే.. ఇప్పుడు ఎంత వస్తుందో అన్నది ఎవరికీ తెలిసే అవకాశంలేదు. అధికార పార్టీ కనుక అడిగేవారూ ఉండరు. ఇదే ఆలోచనకు వచ్చిన ఎల్లోగ్యాంగ్ తీరంలో పాగా వేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక కొద్దిరోజుల్లో కార్తీక మాసం ప్రారంభమవుతుండడంతో పచ్చనేతలకు పండగే పండగ. కారణం.. ఈ మాసంలో జనం లక్షల్లో తీరానికి వస్తారు. పెద్దఎత్తున వాహనాల రానుండటంతో రూ.లక్షల్లో వసూలుచేసుకునే అవకాశముంది. ఇదిచూసి.. పచ్చనేతల సొంత లాభం కోసమే పర్యాటకుల నుంచి డబ్బులు వసూళ్లకు దిగుతున్నారని ఆ పార్టీ నేతలే వ్యాఖ్యానించడం కొసమెరుపు.
Comments
Please login to add a commentAdd a comment