విశాఖ నుంచి ‘సాక్షి’ ప్రతినిధి: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై విశాఖ ఎయిర్‌పోర్టులో జరిగిన హత్యాయత్నం కేసును పూర్తిగా నీరుగార్చేందుకు నిందితుడు శ్రీనివాసరావుపై పిచ్చివాడనే ముద్ర వేయాలని సూత్రధారులు వ్యూహం రచించినట్లు విశ్వసనీయ సమాచారం. ప్రతిపక్ష నేతను అంతం చేయడానికే నిందితుడు కత్తితో దాడి చేశాడని స్పష్టంగా తేలిన నేపథ్యంలో అసలు కుట్రదారుల పేర్లు బయటకు రాకుండా విచారణను పక్కదారి పట్టించాలంటూ పోలీసులపై ప్రభుత్వ పెద్దలు ఒత్తిళ్లు ప్రారంభించినట్లు తెలిసింది. ‘‘నిందితుడి మానసికస్థితి సరిగ్గా లేదు. అందువల్లే జగన్‌పై దాడి చేశాడు. అంతకు మించి కుట్ర ఏమీ లేదు’’ అంటూ అందరినీ నమ్మించడానికి రంగం సిద్ధమైనట్లు సమాచారం.
నిందితుడిని జగన్ అభిమానిగా చిత్రీకరించే పర్వం పూర్తయిందని, తదుపరి అంకంలో ‘పిచ్చోడి’ నాటకం మొదలు పెట్టాలన్నది సూత్రధారుల స్కెచ్‌లో భాగమని తెలుస్తోంది. నిందితుడు పిచ్చోడని ముద్ర వేస్తే కేసు నీరుగారిపోతుందని, సూత్రధారులు, వారి కుట్ర కోణం బయటకు రాకుండా పోతాయని, న్యాయస్థానం ముందు కూడా ‘పిచ్చి’ వాదన వినిపించి బయటపడాలన్నది ‘దాడి ప్రణాళిక’లోనే ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేసు విచారణలో జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే నిందితుడు పిచ్చోడని ముద్ర వేయడానికి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయని తెలుస్తోంది.
కుట్రలో భాగంగానే ‘‘నాకు వైద్యం అక్కర్లేదు.నా అవయవాలను దానం చేయాలి’’ అని నిందితుడితో మంగళవారం ఉద్దేశపూర్వకంగానే చెప్పించారని అర్థమవుతోంది. అతడితో పొంతన లేని మాటలు చెప్పించడం, మానసిక స్థితి బాగా లేనట్లుగా పిచ్చిపిచ్చిగా మాట్లాడించడం, అర్థపర్థం లేని మాటలు చెప్పించడం... సూత్రధారుల ప్రణాళికలో భాగమని చెబుతున్నారు. నిందితుడి తీరును గమనించి వైద్యులు సహజంగానే మానసిక వైద్యుడికి చూపించాలని సిఫార్సు చేస్తారనే ఎత్తుగడ అమలుకు రంగం సిద్ధమవుతోంది.
మంగళవారం ఆసుపత్రికి తీసుకెళ్లడానికి ముందు నిందితుడిని పరీక్షించిన డాక్టర్ దేవుడుబాబు కూడా... ‘‘శ్రీనివాస్ అర్థం లేకుండా మాట్లాడుతున్నాడు. మానసిక వైద్యుడికి చూపించాలి’’ అని చెప్పారు. డాక్టర్లు సిఫార్సు చేశారనే సాకుతో నిందితుడిని సైకియాట్రిస్టుకు చూపించి, అతడి మానసిక స్థితి సరిగ్గా లేదని సర్టిఫికెట్ తీసుకుంటే కేసు మొత్తం నీరుగారిపోతుందనే సూత్రధారుల ప్రణాళికకు అనుగుణంగా పోలీసులు విచారణను పక్కదారి పట్టిస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment