జిల్లా వ్యక్తి ముంబైలో అనుమానాస్పద మృతి
చీమకుర్తి : మండలంలోని బూదవాడ పంచాయతీ యల్లయ్యనగర్‌కు చెందిన జనరాజుపల్లి జక్రయ్య (32) ముంబైలో నాలుగు రోజుల క్రితం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతదేహాన్ని అక్కడి నుంచి యల్లయ్యనగర్‌కు అంబులెన్స్‌లో ఆదివారం తీసుకొచ్చారు. చంపేసి ఇలా శవాన్ని అప్పగిస్తారా.. అంటూ మృతుని బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరిగి ప్రయాణమైన అంబులెన్స్‌ను అడ్డుకున్నారు. బేల్దారి పనుల కోసమని మర్రిపూడి మండలం పొన్నలూరుకు చెందిన ఓ మేస్త్రీ.. యల్లయ్యనగర్‌కు చెందిన కొంతమందిని ముంబై తీసుకెళ్లాడు. అనారోగ్యంతో పనికి వెళ్లలేని జక్రయ్య ముంబైలో తాను నివాసం ఉండే ప్రాంతంలో విశ్రాంతి తీసుకుంటున్నాడు.
అక్కడే ఆయన కొడుకు మహేష్ కూడా ఉన్నాడు. కూలీలకు అన్నం ఇచ్చి రావాలని మహేష్‌ను అక్కడ ఉన్న కూలీల కాంట్రాక్టర్ పురమాయించాడు. అన్నం ఇచ్చి మహేష్ వచ్చేలోపు తండ్రి జక్రయ్య గుండెపోటుతో మరణించాడు. మృతదేహానికి అక్కడి మేస్త్రీలు పోస్ట్‌మార్టం చేయించి అంబులెన్స్‌లో శవాన్ని యల్లయనగర్ పంపించేశారు. జక్రయ్యకు భార్య లేదు. తండ్రి కూడా దిక్కులేని ప్రాంతంలో మృతి చెందటంతో కుమారుడు మహేష్ పరిస్థితి ఏమిటని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. మృతదేహాన్ని చూసిన బంధువులు.. జక్రయ్యకు గుండెపోటు రాలేదని, పనికి వెళ్లలేదని అక్కడి వారు కొట్టి చంపేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు.
జక్రయ్యను ఇక్కడి నుంచి తీసుకెళ్లిన మేస్త్రి వచ్చి సమాధానం చెప్పే వరకూ అంబులెన్స్‌ను పోనిచ్చేది లేదని కర్నూలు రోడ్డు సమీపంలో అడ్డుకున్నారు. ఈ లోపు మృతుని బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంతలో కొందరు పెద్దలు రంగంలోకి దిగి జక్రయ్యను పనికి తీసుకెళ్లిన మేస్త్రీలు, మృతుని బంధువుల మధ్య రాజీ కుదిర్చారు. మృతుడి కుటుంబానికి రూ. 2 లక్షలు ఇచ్చేటట్లు ఒప్పందం కుదిరినట్లు విశ్వసనీయ సమాచారం.