విరిగిన వేలు, ప్రమాదానికి కారణమైన ఎమ్‌ఆర్‌ఐ మిషిన్
ముంబై : ప్రమాదవశాత్తు ఓ అంబులెన్స్ డ్రైవర్ ఎమ్‌ఆర్‌ఐ మిషిన్‌లో ఇరుక్కుపోయాడు. ప్రాణాపాయం తప్పి, వేలు విరగొట్టుకుని బయటపడ్డాడు. ఈ సంఘటన మహారాష్ట్రలోని ముంబైలో శుక్రవారం చోటుచేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాల మేరకు.. ముంబైకి చెందిన విక్రమ్ అబ్‌నవే అనే అంబులెన్స్ డ్రైవర్ శుక్రవారం ఓ రోగిని ఎమ్‌ఆర్‌ఐ స్కానింగ్ కోసమని ‘ప్రతామ్ ఎమ్‌ఆర్‌ఐ అండ్ సీటీ స్కాన్ సెంటర్’కు తీసుకుని వచ్చాడు. పేషంట్ పరిస్థితి బాగోలేకపోవటంతో అతడికి ఆక్సిజన్‌పై ఉంచారు. రోగిని ఎమ్‌ఆర్‌ఐ సెంటర్‌లోకి తీసుకువెళుతున్నపుడు విక్రమ్ సిలిండర్‌ను చేతిలో పట్టుకుని లోపలికి వెళ్లాడు. ఎమ్‌ఆర్‌ఐ దగ్గరకు రాగానే.. షాక్ కొట్టిన భావనతో అది విక్రమ్‌ను తనలోకి లాక్కుంది. దీంతో అతడు ఎమ్‌ఆర్‌ఐ మిషిన్‌లో ఇరుక్కున్నాడు. అప్పుడు విక్రమ్ చేతిలో ఆక్సిజన్ సిలిండర్ ఉంది. అతడి అరచేయి మొత్తం ఎమ్‌ఆర్‌ఐలోకి వెళ్లిపోయింది. అతడు తన చేతిని గట్టిగా వెనక్కులాక్కున్నాడు. ఆ వెంటనే ఎమ్‌ఆర్‌ఐ రూములోనుంచి బయటకు వచ్చాడు.
దీనిపై విక్రమ్ మాట్లాడుతూ.. ‘‘ గదిలోనుంచి బయటకు రాగానే నా అర చెయ్యి మొత్తం రక్తంతో నిండిపోయి ఉంది. బాగా నొప్పి వేసింది. అది నాకు చాలా షాకింగ్‌గా అనిపించింది. ఆ మిషిన్ నన్ను అలా లాక్కుంటుందని నేను అనుకోలేదు. నా చిటికెన వేలు విరిగిపోయింది. నేను గట్టిగా అరవటంతో సెంటర్ సిబ్బంది పరిగెత్తుకుంటూ వచ్చారు. ఆ తర్వాత ఆపరేషన్ చేసి నా వేలులో రాడ్డు వేశారు. చనిపోవాల్సిన ప్రమాదంలో గాయంతో బయటపడ్డానని సెంటర్ సిబ్బంది అన్నారు. విరిగిపోయిన వేలితో నేను ఏ పనిచేయలేకపోతున్నాను. పేదవాడిని.. నా కుటుంబాన్ని ఎలా పోషించగలను’’ అని వాపోయాడు.
Comments
Please login to add a commentAdd a comment