కుమార్తెతో పారిశుద్ధ్య కార్మికుడి కుమార్తె మంగమ్మ
బొబ్బిలి: ఈ చిత్రంలో కనిపిస్తున్న నిరుపేద మహిళ పేరు జలగడుగుల మంగమ్మ. ఈమె పారిశుద్ధ్య కార్మికుడు గోపాలం కుమార్తె. పట్టణంలో పారిశుద్ధ్య కార్మికులెవరయినా వారి కుటుంబాల్లోని వారంతా పనులకు వెళతారు. అలానే ఈమె తన భర్త చనిపోవడంతో తండ్రి సంపాదనపైనే ఆధారపడి జీవించేది. గోపాలం చేయాల్సిన పారిశుద్ధ్యపనులన్నీ చేసేది. ఏళ్లపాటు చేశాక ఇటీవల గోపాలం చనిపోయాడు. వాస్తవానికి వారసత్వంగా అతనిపై ఆధారపడిన కుమార్తెకు పారిశుద్ధ్య కార్మికురాలిగా కౌన్సిల్ అనుమతించలేదని తనను పక్కన పెట్టేశారు. ఇప్పుడీమె బతుకు భారమైంది. మున్సిపాలిటీలో ఈమె ఒక్కతే కాదు విజయమ్మ అనే మరో పారిశుద్ధ్య కార్మికురాలు కూడా చనిపోతే ఆమె కుటుంబ సభ్యులకు ఉద్యోగమివ్వలేదు. వేరే వారికి కట్టబెట్టారు. దీంతో ఆయా కార్మికులంతా తీవ్ర మనోవేదనతో తమ కుటుంబాలను ఈడ్చలేక దీనావస్థలో ఉన్నారు.
అంగన్‌వాడీ, సబ్‌స్టేషన్ ఆపరేటర్ల పోస్టులను అమ్ముకుంటున్నారన్న ఖ్యాతి దక్కించుకుంటున్న తెలుగు తమ్ముళ్లు చివరకు పారిశుద్ధ్య కార్మికుల పోస్టులనూ అమ్ముకుంటున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పారిశుద్ధ్య కార్మికులకు ఇవ్వాల్సిన ప్రయోజనాలను పూర్తిగా కల్పించని యంత్రాంగం చివరకు వారి పోస్టులను కూడా అందనీయకుండా చేస్తోంది. పట్టణంలోని 30 వార్డులుండగా 95 మంది పారిశుద్ధ్య కార్మికులున్నారు. వారికి ఇవ్వాల్సిన ప్రయోజనాలు కల్పించడం లేదు. చేస్తున్న పనులు పారిశుద్ధ్యం కనుక ఖచ్చితంగా బజ్బులు సోకుతున్నాయనీ, వాటిని బాగు చేయించుకోలేక మంచం పట్టి ఇలా చనిపోయిన కుటుంబాలు వీధిన పడాల్సిందేనా అని వారు వాపోతున్నారు.
టీడీపీ కార్యకర్తలకు ప్రమోషన్లు..
పట్టణంలో ఇప్పటికే పారిశుద్ధ్య కార్మికులు తక్కువ మంది ఉన్నారు. అయితే వారిలో ఎవరైతే తమకు అనుకూలంగా, అనుసరులుగా ఉండి అందుబాటులో ఉంటారో వారికి సూపర్ వైజర్లుగా ప్రమోషన్లు కల్పించారనీ అందువల్లనే కార్మికుల సంఖ్య తగ్గిందనీ కార్మిక నాయకులు బ హిరంగంగా చెబుతున్నారు. కార్మికులుగా పనిచేయిస్తూ అర్హత మేరకు సూపర్ వైజర్లుగా నియమించుకునే అవకాశం ఉన్నా అలా చేయడం లేదని వారు ఆరోపిస్తున్నారు.
రూ.50వేల చొప్పున అమ్ముకున్నారు
కాంట్రాక్టు కార్మికులయితే గ్రాట్యుటీ ఇవ్వాలి. ఇవ్వడం లేదు కనుక పోస్టును కుటుంబంపై ఆధారపడిన వారికి ఇవ్వాలి. కానీ అమ్ముకుంటున్నారు. పారిశుద్ధ్య కార్మికులను పర్యవేక్షించే వారిని రిటైర్ అయినా వేల రూపాయల వేతనంతో తిరిగి నియమించుకుంటున్నారు. పారిశుద్ధ్య కార్మికుడి పోస్టును టీడీపీ నాయకులు రూ.50వేలకు అమ్ముకున్నారు. అర్హులయిన వారిని వీధిన పడేశారు. నిరుపేదలకు అన్యాయం చేస్తున్నారు.-పి శంకరరావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, పారిశుధ్య కార్మికులు, కాంట్రాక్టు కార్మికుల సంఘం
కాంట్రాక్టు పోస్టులకు ఇచ్చే అవకాశం లేదు
పర్మినెంటు కార్మికుల కుటుంబాలకే వారసత్వ ఉద్యోగ అవకాశం ఉంది. కాంట్రాక్టు కార్మికులకు లేదు. గతంలో గోపాలం రిటైర్ అయిపోయాడు. ఆయన కుటుంబానికి పెన్షన్ వస్తుంది. ఆయన కుమారుడు కూడా ఔట్‌సోర్సింగ్‌లో పనిచేస్తున్నాడు. ఒకే కుటుంబంలో అన్ని ఉద్యోగాలూ ఇచ్చే జీఓ లేదు కదా? అందుకనే గోపాలం కుమార్తెకు పోస్టు ఇవ్వలేదు.
-హనుమంతు శంకరరావు, కమిషనర్, బొబ్బిలి మున్సిపాలిటీ
Comments
Please login to add a commentAdd a comment