వ్యాధి సోకకుండా ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు
పశ్చిమలో స్వైన్‌ఫ్లూ దాడి మొదలైంది. జిల్లాలో మొదటి స్వైన్‌ఫ్లూ కేసునమోదు కావటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా మంచిలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యుడిగా పనిచేస్తున్న కె.కార్తీక్‌కు ఈ వ్యాధి సోకినట్లు వైద్యులునిర్థారించారు. ప్రస్తుతం ఆయన ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో చీఫ్ డాక్టర్ శ్రీనివాస్‌పర్యవేక్షణలో వైద్యం పొందుతున్నారు. పరీక్షలు చేసిన వైద్యులు అధికారికంగా స్వైన్‌ఫ్లూ వచ్చినట్లు నిర్థారించారు. ప్రస్తుతం వాతావరణంలో చోటు చేసుకున్న మార్పులనేపథ్యంలో కేసుల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తోంది. అయితే వైద్యులు మాత్రం భయపడాల్సిన పనిలేదని, అన్ని ముందుస్తు జాగ్రత్తలు చేపట్టినట్లు చెబుతున్నారు.
ఏలూరు టౌన్: సాధారణంగా ఈ వ్యాధి వేడి వాతావరణం కలిగిన ప్రాంతాల్లో పెద్దగా కనిపించదు. జిల్లాలోనూ పగటి పూట వేడి అధికంగానే ఉంటుండగా రాత్రి వేళల్లో మాత్రం మంచు, చలి గత వారం రోజులుగా పెరిగింది. ప్రస్తుతం వాతావరణంలో మార్పులు రావటంతో ఈ వ్యాధి తీవ్రత పెరిగే అవకాశాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. ఈ వ్యాధి శరవేగంగా విస్తరించేందుకు చలి కూడా ప్రధాన కారణంగా చెప్పవచ్చు. గాలిలో తేమశాతం తగ్గటం, మంచు కురవటం ఈ వ్యాధి విస్తరించేందుకుఅనుకూలించే అంశాలుగా వైద్యులు పేర్కొంటున్నారు.
ఉచితంగా పరీక్షలు, మందులు
స్వైన్‌ఫ్లూ వ్యాధి నిర్థారణకు ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో పరీక్షలు చేస్తున్నారు. నివారణకు వాడే మందులు జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వాసుపత్రుల్లోనూ ఉచితంగా లభిస్తున్నాయి. వైద్యులకు రోగి లక్షణాలు అనుమానం వస్తే ఆర్‌టీపీసీఆర్ (రియల్ టైం పాలిమరేజ్ చైన్ రియాక్షన్) పరీక్షలను చేయించేందుకు చర్యలు చేపట్టారు. వ్యాధి సోకిన వారికి నివారణకు మందులు అందుబాటులో ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. పెద్దలకు ‘టామీ ఫ్లూ’ 75ఎంజీ మాత్రలు, చిన్న పిల్లలకు ‘టామీ ఫ్లూ’ టానిక్‌ను ఇస్తారు. అదేవిధంగా పీపీఈ (పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్‌మెంట్) కిట్స్‌ను అందుబాటులో ఉంచారు.
స్వైన్‌ఫ్లూ ఎలా వస్తుంది?
ఈ వ్యాధికి దోమలతో ఎలాంటి సంబంధం లేదు. గాలి ద్వారా ఒకరి నుంచి మరొకరికి సోకుతుంది. స్వైన్‌ఫ్లూ వ్యాధి అంటువ్యాధి లాంటిది. ఇది హెచ్1, ఎన్1 వైరస్ కారణంగా సోకుతూ.. గాలి ద్వారా ప్రయాణిస్తూ వ్యాప్తి చెందుతుంది. గతంలో సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకూ ఈ వ్యాధికి సీజన్‌గా ఉండగా, ప్రస్తుతం మారిన వాతావరణ పరిస్థితులు ఏడాది మొత్తంగా సీజన్‌గా మారటం ఆందోళన కలిగిస్తోంది.
వ్యాధి లక్షణాలు : స్వైన్ ఫ్లూ వ్యాధి సోకిన రోగి లక్షణాలు.. జలుబు, దగ్గు ఉంటుంది. వళ్ళు నొప్పులు ఉంటాయి. ఊపిరితిత్తుల్లో నెమ్ము చేరుతుంది. వాంతులు, విరేచనాలు అయ్యే పరిస్థితి ఉంటుంది. వ్యాధి తీవ్రత పెరిగితే ప్రాణాపాయం కలిగే అవకాశాలు ఉన్నాయి. ఈ వ్యాధి ముఖ్యంగా 65 సంవత్సరాలు పైబడిన వృద్ధులు, 5 ఏళ్ళ లోపు చిన్నారులు, గర్భిణులు, షుగర్, బీపీ, గుండె, కిడ్నీ తదితర దీర్ఘకాలిక వ్యాధులు కలిగిన వారికి సోకే అవకాశాలు అధికంగా ఉంటాయి.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
స్వైన్‌ఫ్లూ వ్యాధి సోకిన రోగులు తుమ్మినా, దగ్గినా ముఖానికిచేతిరుమాలు అడ్డం పెట్టుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. ఏవైనా అనారోగ్య సమస్యలు తలెత్తితే వెంటనే వైద్యులను సంప్రదించాలి.
ముందుస్తు చర్యలు చేపట్టాం
జిల్లాలో స్వైన్‌ఫ్లూ వ్యాధికి సంబంధించి ముందుస్తు చర్యలు తీసుకున్నాం. అన్ని ప్రభుత్వాసుపత్రుల్లో మందులు అందుబాటులో ఉంచాం. ఏలూరు జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రిలో స్వైన్‌ఫ్లూ నిర్థారణ పరీక్షలు ఉచితంగా చేస్తున్నారు. మందులు సైతం ప్రజలకు ఉచితంగా అందించేందుకు అన్ని చర్యలు చేపట్టాం. ప్రజలు ఈ విషయంలో భయపడకుండా, వ్యాధి లక్షణాలు గుర్తించి వెంటనే వైద్యులను సంప్రదిస్తే నివారించటం సాధ్యమవుతుంది.– డాక్టర్ బి.సుబ్రహ్మణ్యేశ్వరి, డీఎంహెచ్‌ఓ
Comments
Please login to add a commentAdd a comment