స్వైన్‌ఫ్లూ భయంతో పాఠశాలల్లో సైతం మాస్క్‌లు ధరించి విద్యార్థులు
తూర్పుగోదావరి, కాకినాడ సిటీ: స్వైన్‌ఫ్లూ భయం కొన్ని ప్రైవేటు ఆసుపత్రులకు కాసుల వర్షం కురిపిస్తోంది. ఇటీవల జిల్లాలో స్వైన్ ఫ్లూ కేసులు పెరుగుతుండడంతో ప్రజలు సాధారణ జలుబు, దగ్గు, జ్వరం, గొంతు నొప్పికే ప్రైవేటు ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. రోగుల్లో నెలకొన్న భయాన్ని కొన్ని కార్పొరేట్ ఆసుపత్రులు క్యాష్ చేసుకుంటున్నాయి. ‘పైసా’చికంగా వ్యవహరిస్తున్నాయి. ఎలాంటి పరీక్షలు లేకుండానే కేవలం క్లినికల్ ఎగ్జామినేషన్ ద్వారానే ప్లూను నిర్ధారించే అవకాశం ఉన్నా పలు కార్పొరేట్ ఆసుపత్రులు నమూనాలు సేకరిస్తున్నాయి. వ్యాధి నిర్ధారణ పేరుతో రోగుల నుంచి భారీగా వసూళ్లకు పాల్పడుతున్నాయి.
కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో పైసా ఖర్చు లేకుండానే చికిత్స పొందే అవకాశం ఉంది. కానీ రోగులను భయాందోళనకు గురి చేసి చికిత్సల పేరుతో అడ్డగోలుగా దోపిడీకి పాల్పడుతున్నారు. అమలాపురానికి చెందిన ఓ మహిళ తీవ్ర జ్వరంతో బాధపడుతుంటే ఆమెను భర్త, బంధువులు స్థానికంగా చూపించారు. నాలుగు రోజుల తరువాత కాకినాడ భానుగుడి సెంటర్‌లోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో చేర్చారు. అనుమానిత స్వైన్‌ఫ్లూ పేరుతో చికిత్సలు అందించి సుమారు రూ. 2.5 లక్షలకు పైగా బిల్లు వసూలు చేశారు. స్వైన్‌ఫ్లూ పేరుతో రోగుల నుంచి ఎంతలా డబ్బులు గుంజుతున్నారో చెప్పడానికి ఇదో ఉదాహరణ మాత్రమే. అదే విధంగా రాజమహేంద్రవరంలో ఇద్దరు వ్యక్తులకు వ్యాధి సోకడంతో వారి నుంచి కూడా భారీగా సొమ్ములు గుంజినట్టు తెలుస్తోంది. అంతే కాకుండా ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో స్వైన్‌ఫ్లూ కోసం ప్రత్యేక వార్డును కేటాయించినా దీనికి రక్షణ లేకపోవడంతో రోగులు, వారితో ఉన్న సహాయకులు సైతం ఇష్టానుసారంగా బయట తిరుగుతున్నారు. ఈ వ్యాధితో బాధపడుతున్న ఓ మహిళ డయాలసిస్ పేరుతో బయటకు వెళ్లిపోవడం, మళ్లీ తిరిగి వచ్చినట్టే వచ్చి కనిపించకుండా పోవడం, ఆ తరువాత అధికారులు వెతికి అల్లవరం మండలం కొమరిగిరిపట్నం కొడప నుంచి తిరిగి కాకినాడ జీజీహెచ్‌కు తీసుకురావడం తెలిసిందే. ఇది చాలా ప్రమాదకరమైన వ్యాధి అని, ప్లూ వైరస్ గాలి ద్వారా ఒకరి నుంచి మరొకరికి విస్తరించే అవకాశం ఉన్నా జిల్లా వైద్యాధికారులు దీనిపై ప్రత్యేక శ్రద్ధ చూపడంలేదు.
స్వైన్‌ఫ్లూ కేసులు జిల్లాలో నమోదు అవుతుండడంతో ఇదే అదనుగా పలు కార్పొరేట్ ఆసుపత్రులు దోపిడీకి తెర తీస్తున్నాయి. చిన్నపాటి జలుబు, దగ్గు, గొంతునొప్పినే స్వైన్‌ఫ్లూగా అనుమానించి పరీక్షలు చేసి డబ్బులు గుంజుతున్నారు. ఒక్కసారి ఆసుపత్రిలో అడుగు పెడితే చాలు పరీక్షలకు రూ.పది వేలు వరకు ఖర్చవుతోంది. ఇక స్వైన్‌ఫ్లూ ఉన్నట్టు తేలితే ఇక రోగులకు చుక్కలే. నిజానికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేకరించిన నమూనాలను కాకినాడ జీజీహెచ్‌లో ఉచితంగా పరిశీలిస్తారు. అదే ప్రైవేటు ఆసుపత్రుల్లో అయితే ఒక్కోదానికి రూ.3,500 నుంచి రూ.ఐదు వేలు వరకు చార్జీలు వసూలు చేస్తున్నారు. వైద్యపరంగా ఎవరికి అనుమానం రాకుండా ఉండేందుకు బాధితులను అనుమానాస్పద స్వైన్‌ఫ్లూ కేసుగా అడ్మిట్ చేసుకుని వైద్యం ముసుగులో దోచుకుంటున్నారు. కాకినాడలోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో చేరిన ఆమెకు రోజుకు రూ.13వేలు ఫీజు రూపంలో, రూ.12 వేలు మందుల రూపంలో దాదాపు పది రోజుల పాటు వసూలు చేశారని బాధిత కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చివరకు డబ్బులు ఖర్చు చేయలేని పరిస్థితుల్లో ‘వెంటిలేటర్ అసోసియేటెడ్ నిమోనియా’ సోకడంతో ఆమెను శనివారం సాయంత్రం కాకినాడ జీజీహెచ్‌లోని ఆర్‌ఐఎస్‌యూలో చికిత్స నిమిత్తం తరలించారు.
వారి చేతిలో మోసపోవద్దు
చాలా ప్రాంతాల్లో ప్రజలకు స్వైన్‌ఫ్లూపై సరైన అవగాహన లేదు. హైజిన్ లోపం, పిల్లలకు ఇమ్యూనైజేషన్ సరిగా చేయించకపోవడం, గాలి వెలుతురు సోకని గదుల్లో ఎక్కువ మంది నివసిస్తుండడమే ఫ్లూ విస్తరణకు కారణం. నిజానికి సాధారణ ఫ్లూ, స్వైన్‌ఫ్లూ లక్షణాలు చూడడానికి ఒకేలా కనిపిస్తాయి. కానీ తేడా ఉంది. ఎలాంటి పరీక్షలు అవసరం లేకుండానే కేవలం క్లినికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా వ్యాధిని గుర్తించే అవకాశం ఉంది. కానీ కొన్ని ఆసుపత్రులు అవసరం లేకపోయినా పరీక్షలు నిర్వహిస్తున్నాయి. కాకినాడ జీజీహెచ్‌లో ప్రత్యే క వార్డులను ఏర్పాటు చేశాం. ఇక్కడ రోగులకు అన్ని రకాల సేవలు ఉచితంగా అందిస్తుంది. జ్వ రం, జలుబుతో ఆందోళన చెంది ప్రైవేటు ఆసుపత్రుకు పరుగులు తీసి, వారి చేతిలో మోసపోవద్దు.
డాక్టర్ రాఘవేంద్రరావు, సూపరింటెండెంట్, స్వైన్‌ఫ్లూ నోడల్ అధికారి, జీజీహెచ్, కాకినాడ
Comments
Please login to add a commentAdd a comment