పేదల ఇళ్లకు స్విస్‌ టెక్నాలజీ  | Swiss technology for Poor Peoples Homes | Sakshi
Sakshi News home page

పేదల ఇళ్లకు స్విస్‌ టెక్నాలజీ 

Published Mon, Mar 23 2020 4:48 AM | Last Updated on Mon, Mar 23 2020 4:48 AM

Swiss technology for Poor Peoples Homes - Sakshi

సాక్షి, అమరావతి: పేదల కోసం నిర్మించే ఇళ్లకు ఇండో–స్విస్‌ సాంకేతికతతోపాటు ఇంధన సామర్థ్య టెక్నాలజీని అందుబాటులోకి తేవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల విద్యుత్‌ ఆదాతోపాటు కొత్తగా నిర్మించే ఇళ్లల్లో ఉష్ణోగ్రతలు గరిష్టంగా 8 డిగ్రీల వరకు తగ్గుతాయని గుర్తించారు. ఈ ప్రాజెక్టు గురించి వివరించేందుకు బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ ఎఫిషియన్సీ (బీఈఈ) అధికారులు ఇటీవల రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌ జైన్‌తో భేటీ అయ్యారు. రాష్టంలో బిల్డింగ్‌ ఎనర్జీ ఎఫిషియన్సీ ప్రాజెక్ట్‌ (బీప్‌) అమలు చేసేందుకు వారు సుముఖత వ్యక్తం చేశారు. దేశంలో తొలిసారిగా ఎనర్జీ కన్జర్వేషన్‌ బిల్డింగ్‌ కోడ్‌ రెసిడెన్షియల్‌ (ఈసీబీసీఆర్‌) ప్రకారం.. ఇండో స్విస్‌ ఇంధన సామర్థ్య సాంకేతికతను బలహీనవర్గాల గృహాలకు అందజేస్తామని తెలిపారు. హౌసింగ్, రాష్ట్ర ఇంధన పొదుపు సంస్థ, బీప్‌ అధికారులతో అజయ్‌ జైన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ వివరాలను రాష్ట్ర ఇంధన పొదుపు సంస్థ సీఈవో ఎ.చంద్రశేఖర్‌రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో మీడియాకు వెల్లడించారు.  

గృహ నిర్మాణ వ్యయం తగ్గుతుంది: బీఈఈ
ఈసీబీసీఆర్‌ వినియోగించడం వల్ల గృహ నిర్మాణ వ్యయం కూడా కొంత వరకు తగ్గుతుందని బీఈఈ పేర్కొంది. 30 లక్షల ఇళ్లలో ఎల్‌ఈడీ లైట్లు, అత్యుత్తమ ఇంధన సామర్థ్యం కలిగిన ఫ్యాన్లు, ఇతర ఎనర్జీ సామర్థ్య ఉపకరణాలను అమర్చేందుకు సహకరించాల్సిందిగా ఏపీ స్టేట్‌ ఎనర్జీ ఎఫిషిఎన్సీ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీ సీడ్కో) కోరినట్టు చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. దేశంలో ఈసీబీసీ రెసిడెన్షియల్‌ కోసం కేంద్ర ప్రభుత్వం మూడు రాష్ట్రాలను నామినేట్‌ చేయగా, వాటిలో ఆంధ్రప్రదేశ్‌ కూడా ఉంది.   
అసలేంటీ ప్రాజెక్ట్‌?
- పేదలు, బలహీనవర్గాలకు 14,097 జగనన్న కాలనీల పేరుతో 30 లక్షల ఇళ్లు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్‌లో ప్రారంభమయ్యే ఈ గృహ నిర్మాణ పథకం దేశంలోనే అతిపెద్దది.  
- నిర్మించే ఇళ్లల్లో పెద్ద హాల్, బెడ్‌ రూమ్, కిచెన్, వరండా, టాయిలెట్‌ వంటి సౌకర్యాలు ఉంటాయి. ఇంటి మొత్తం విస్తీర్ణంలో 16.66 శాతం ఓపెన్‌ ఏరియా ఉంటుంది. ఇంటి నిర్మాణంలో కొన్ని రకాల మెటీరియల్స్‌ వాడటం, సాంకేతిక చర్యలు చేపట్టడం ద్వారా ఇంట్లోని ఉష్ణోగ్రతలు 4 డిగ్రీల నుంచి 8 డిగ్రీల వరకు తగ్గుతాయి. సీలింగ్‌ దగ్గరలో గ్లాస్‌ ఫిట్టింగ్‌ ఉండే కిటికీలు, ఇంటి పైకప్పు, గోడలను పర్యావరణహితంగా నిర్మించడం ఇండో–స్విస్‌ టెక్నాలజీలో ముఖ్యాంశాలు.  
- ఇండో–స్విస్‌ టెక్నాలజీతో ఇళ్లు కట్టడం వల్ల పగటిపూట ఇంటి లోపల సహజసిద్ధమైన వెలుతురు పెరుగుతుంది. కానీ చల్లదనం మాత్రం ఉంటుంది.  
- అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన ఇంధన ఆదా చేయగల విద్యుత్‌ ఉపకరణాలనే అమరుస్తారు. ఇల్లు చల్లగా ఉండటం, ఇంకోవైపు వాడే ఉపకరణాలు విద్యుత్‌ను ఆదా చేయడం వల్ల తక్కువ విద్యుత్‌ బిల్లులు వచ్చే వీలుంది.  
- స్విట్జర్లాండ్‌ ప్రభుత్వ సహకారంతో కేంద్ర ప్రభుత్వ సంస్థ.. బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ) ఈ సాంకేతికతను ఆంధ్రప్రదేశ్‌కు అందిస్తుంది. 

ఏంటీ స్విస్‌ టెక్నాలజీ?
స్విస్‌ టెక్నాలజీలో భాగంగా ప్రకృతిసిద్ధమైన గాలి, వెలుతురు విస్తారంగా లోనికి ప్రవేశించేలా ఇళ్లను డిజైన్‌ చేస్తారు. పై కప్పు, గోడల నిర్మాణంలో చల్లదనం ఎక్కువగా ఉండేలా, వేడిని లోనికి రానివ్వకుండా ప్రత్యేక పదార్థాలు వాడతారు. కిటికీలకు వాడే అద్దాలను కూడా ప్రత్యేకంగా రూపొందిస్తారు. దీంతో కాంతి మరింత ఎక్కువగా ప్రసరిÜ్తుంది. మరోవైపు ఇంధన సామర్థ్యం గల పరికరాలు, అతి తక్కువ కరెంట్‌ను వినియోగించుకునే ఉపకరణాలకు ప్రాధాన్యం ఇస్తారు. ఎల్‌ఈడీ బల్బులు, స్టార్‌ రేటెడ్‌ ఫ్యాన్లు వంటివి వాడటం వల్ల 20 శాతం కరెంట్‌ ఆదా అవుతుంది. స్విస్‌ టెక్నాలజీ వల్ల ఇంట్లో ఉష్ణోగ్రత 4 నుంచి 8 డిగ్రీల వరకు తగ్గుతుంది. కాబట్టి ఏసీలు, కూలర్లు అంతగా వాడాల్సిన అవసరం ఉండదు. ఈ మేరకు స్విట్జర్లాండ్‌ కంపెనీలు అక్కడి సాంకేతిక పరిజ్ఞానాన్ని మనకు అందిస్తాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement