ఎన్నికల నిర్వహణపై ఈనెల 6న రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్, జేసీ, ఎస్పీ లతో కలిసి పాల్గొన్న తహసీల్దారు భాస్కర నారాయణ (వృత్తంలో)
సి.భాస్కర్‌నారాయణ...కలెక్టరేట్‌లోని ఎన్నికల విభాగంలో 15 ఏళ్లగా విధులు నిర్వర్తిస్తున్నారు. జూనియర్ అసిస్టెంట్‌గా కలెక్టరేట్‌కు వచ్చిన ఆయన అక్కడే పాతుకుపోయి తహసీల్దార్ హోదాలోనూ అదే విభాగంలో పనిచేస్తున్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో 53 మంది తహసీల్దార్లను ప్రభుత్వం బదిలీ చేసింది. అయితే భాస్కర్ నారాయణ మాత్రం తన పరపతి ఉపయోగించి బదిలీ నుంచి తప్పించుకున్నారు. కానీ ప్రభుత్వం ఆయనకు ఎన్నికలేతర విధులు అప్పగించాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం దీర్ఘకాలంగా జిల్లాలో పనిచేసిన తహసీల్దార్లకు ఎన్నికల విధులను అప్పగించకూడదు. అయితే ఎన్నికల కమిషన్ నిబంధనలను ఉల్లంఘిస్తూ... ప్రభుత్వం జారీ చేసిన బదిలీ ఉత్తర్వులను బేఖాతర్ చేస్తూ... జిల్లా ఉన్నతాధికారులు తహసీల్దార్ భాస్కరనారాయణను ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో భాగస్వామ్యం చేయడం విమర్శలకు తావిస్తోంది.
అనంతపురం అర్బన్ : ఎన్నికల కమిషన్ నిబంధనలను తప్పకుండా పాటించాలంటూ స్పష్టమైన ఆదేశాలిచ్చే జిల్లా ఉన్నతాధికారులే నిబంధనలు ఉల్లంఘించారు. ఎన్నికల కమిషన్ నిబంధనలకు తిలోదకాలు పలికారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం ఉత్తర్వులను సైతం బేఖాతర్ చేస్తూ ఒక తహసీల్దార్‌కు ఎన్నికల విధులు అప్పగించారు. ఈ ఉల్లంఘనపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేదికి ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ప్రతి జిల్లాకు వచ్చినా... ఇక్కడి అధికారులు కనీసం పరిగణలోకి తీసుకోకపోవడం వివాదాస్పదంగా మారింది.
పాతుకుపోయాడు
కలెక్టరేట్‌లోని ఎన్నికల విభాగంలో భాస్కరనారాయణ దాదాపు 15 ఏళ్లుగా నిర్వర్తిస్తున్నారు. ఆయన జూనియర్ అసిస్టెంట్‌గా, సీనియర్ అసిస్టెంట్‌గా, డిప్యూటీ తహసీల్దారుగానూ అదే చోట పనిచేస్తూ వచ్చారు. కొద్ది నెలల క్రితం ఆయనకు తహసీల్దారుగా పదోన్నతి లభించింది. అయినప్పటికీ అధికారులు ఆయన్ను ఎన్నికల విభాగంలోనే ఉంచేశారు. దీంతో ఆయన ఎన్నికల విభాగానికి తానే సర్వస్వం అన్నతీరులో విధులు నిర్వర్తించారు. అధికారపార్టీ ప్రజాప్రతినిధులతో ఉన్న తత్సంబంధాలతోనే ఉన్నతాధికారులు భాస్కరనారాయణను ఒకే స్థానంలో ఏళ్లుగా కొనసాగిస్తున్నారనీ, అందువల్లే ఎన్నికల్లో భాగంగా జరిగిన బదిలీల్లోనూ ఆయన్ను కదలించలేకపోయారన్న చర్చ రెవెన్యూ వర్గాల్లో నడుస్తోంది.
ప్రత్యేకంగా విభాగం ఏర్పాటు
వాస్తవంగా కలెక్టరేట్‌లో ఎన్నికల విభాగం అంటూ ప్రత్యేకంగా లేదు. హెచ్–సెక్షన్‌లో ఎన్నికల విధులు ఒక భాగం. ఇవి ఒక సీనియర్ అసిస్టెంట్ నిర్వర్తిస్తారు. తొలి నుంచి ఇదే విధానం అమలులో ఉంది. భాస్కర్‌నారాయణ తహసీల్దారుగా పదోన్నతి పొందిన తరువాత... హెచ్–సెక్షన్ నుంచి ఎన్నికల విధులను వేరు చేసి...ఎన్నికల నిర్వహణ కోసం ప్రత్యేకంగా ఒక విభాగం ఏర్పాటు చేశారు. దానికి తహసీల్దారుగా భాస్కర్‌నారాయణను నియమించారు. దీంతో ఆయనే అన్నీ తానై వ్యవహరిస్తూ వస్తున్నారు.
సీఈఓకు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి ఫిర్యాదు
రెవెన్యూ శాఖలో తహసీల్దారుగా ఉన్న సి.భాస్కరనారాయణ కలెక్టరేట్‌లోని ఎన్నికల విభాగంలోనే 15 ఏళ్లగా పనిచేస్తున్నారని, ఇది నిబంధనలకు విరుద్ధమని ధర్మవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఫిబ్రవరి 25న రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ధర్మవరం ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యానారాయణకు తహసీల్దార్ భాస్కర్ నారాయణ మంచి స్నేహితుడని, అంతేకాకుండా ఆయనతో కలిసి చదువుకున్నారని కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా టీడీపీ నాయకులతో ఆయనకు దగ్గర సంబంధాలున్నాయని, అవే ఆయన దీర్ఘకాలికంగా ఒకే స్థానంలో పనిచేసేందుకు ఉపయోగపడుతున్నాయని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం భాస్కరనారాయణను వేరే జిల్లాకు బదిలీ చేయాలని తన ఫిర్యాదులో కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి కోరారు.
డీటీని బదిలీ చేసి... తహసీల్దారును ఉంచేసి
బత్తలపల్లి తహసీల్దారు కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దారుగా విధులు నిర్వర్తిస్తున్న సురేష్‌ను ఫిర్యాదుల నేపథ్యంలోనే ఉన్నతాధికారులు బదిలీ చేశారు. కానీ తహసీల్దారు భాస్కర్‌నారాయణ 15 ఏళ్లగా ఒకే స్థానంలో çపనిచేస్తున్నారంటూ వైఎస్సార్ సీపీ నేత కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి సీఈఓకు ఫిర్యాదు చేసినా.. ఆ ఫిర్యాదు ప్రతి... జిల్లా అధికారికి వచ్చినా చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment