
నగరంలో ర్యాలీ నిర్వహిస్తున్న కార్మికులు
అనంతపురం న్యూసిటీ: ప్రజారోగ్యంతో ముడిపడి ఉండే పురపాలకశాఖకు కార్పొరేట్ నారాయణ మంత్రిగా ఉన్నారని, ప్రజాసేవలంటే ఆయనకేం తెలుస్తుందని సీపీఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్ విమర్శించారు. కార్మికుల సమ్మెలో భాగంగా శుక్రవారం మునిసిపల్ కార్మిక సంఘాల నేతల ఆధ్వర్యంలో నగరంలో కార్మికులు పనిముట్లతో ర్యాలీ నిర్వహించారు. ఆ ర్యాలీ నగరపాలక సంస్థ నుంచి మొదలై సుభాష్‌రోడ్డు మీదుగా టవర్‌క్లాక్ వరకు వెళ్లి అక్కడినుంచి తిరిగి నగరపాలక సంస్థకు చేరుకుంది. ఈ సందర్భంగా రాంభూపాల్ మాట్లాడుతూ కార్మికుల పొట్టకొట్టే జీఓ 279 రద్దు చేయాలని ఏడాదిన్నరగా కార్మికులు వివిధ రూపాల్లో ధర్నాలు, రాస్తారోకో, సమ్మెలు చేస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. చంద్రబాబుకు తొమ్మిదేళ్లపాటు ప్రతిపక్షంలో ఉన్నా బుద్ధి రాలేదన్నారు. ప్రజలు మళ్లీ టీడీపీని ఛీకొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. సీపీఐ నేత శ్రీరాములు మాట్లాడుతూ జీఓ రద్దు చేసే వరకు కార్మికులకు మద్దతుగా ఉంటామన్నారు. మునిసిపల్ కార్మిక సంఘాల నాయకులు గోపాల్, రాజేష్, ఉపేంద్ర మాట్లాడుతూ ప్రభుత్వం దిగివచ్చే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామన్నారు. ప్రజారోగ్యంపై ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని, కార్మికులు రెండ్రోజులుగా సమ్మెలోకి వెళ్లినా పట్టీపట్టనట్లు వ్యవహరిస్తోందని విమర్శించారు.
నగరం చెత్తమయం
కార్మికుల సమ్మెతో నగరం చెత్తమయంగా మారింది. ప్రధాన ప్రాంతాల్లోనే ఎక్కడ చూసిన చెత్తకుప్పలు కనిపిస్తున్నాయి. ఇక మురికివాడల గురించి చెప్పాల్సిన పని లేదు. రాణినగర్, అంబేడ్కర్‌నగర్, అంబారపువీధి, వినాయకనగర్‌లో చెత్తను సేకరించడం లేదు. స్థానిక ప్రజలు చెత్తను ఇంటి పరిసర ప్రాంతాల్లోనే పడేస్తున్నారు. ఎక్కడ సీజనల్ వ్యాధులు విజృంభిస్తాయోనని నగరప్రజలు ఆందోళన చెందుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment