చర్చలు విఫలం | Talks fail | Sakshi
Sakshi News home page

చర్చలు విఫలం

Published Sat, Nov 1 2014 4:23 AM | Last Updated on Sat, Sep 2 2017 3:39 PM

చర్చలు విఫలం

చర్చలు విఫలం

కడప కార్పొరేషన్:
 కార్మిక ప్రతినిధులతో అధికారులు, భారతి సిమెంట్ యాజమాన్య ప్రతినిధులు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ఓ వైపు యాజమాన్యం సమస్యను పరిష్కరించాలని శతవిధాలుగా ప్రయత్నిం చినా కార్మిక ప్రతినిధులు కాలికేస్తే మెడకు, మెడకు వేస్తే కాలికి అన్న చందంగా తెగేదాకా లాగారు.  

  భారతి సిమెంట్ పరిశ్రమకు సంబంధించి ఆందోళన చేస్తున్న కార్మిక ప్రతినిధులతో శుక్రవారం ఆర్డీఓ లవన్న, డీఎస్పీ రాజేశ్వర్‌రెడ్డి, పరిశ్రమల శాఖ మేనేజర్ గోపాల్ సమక్షంలో భారతి సిమెంట్ డెరైక్టర్  జేజే రెడ్డి, హెచ్‌ఆర్ మేనేజర్ అనిల్‌కుమార్‌రెడ్డి, భార్గవరెడ్డి  సుమారు  మూడు గంటలపాటు చర్చలు జరిపారు.

ఔట్ సోర్సింగ్ కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని, అన్ని గ్రామాలను సమానంగా అభివృద్ధి చేయాలని, భూములు కోల్పోయిన వారందరికీ ఉద్యోగాలు ఇవ్వాలని...సిమెంట్ ఫ్యాక్టరీ వల్ల కాలుష్యం అధికంగా వస్తోందని దాన్ని నివారించాలని కార్మిక ప్రతినిధులు కోరారు. ఈ డిమాండ్లపై కంపెనీ ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు. ఫ్యాక్టరీ కోసం భూములు సేకరించిన అన్ని గ్రామాలను దత్తత తీసుకొని అబివృద్ధి చేస్తామని, ఫ్యాక్టరీ పక్కన ఉన్న చెరువును పూడిక తీయించి నీరునిల్వ ఉండేలా చర్యలు తీసుకుంటామని చర్చల్లో స్పష్టం చేశారు.

తాము 2006-07లో 650 మంది రైతుల వద్దనుంచి ఎకరా రూ. 1.05 లక్షల చొప్పున 11వేల ఎకరాల భూమిని సేకరించామన్నారు. అయితే 2011లో వైఎస్ జగన్  భూములు కోల్పోయిన ప్రతి రైతుకు మొదట ఇచ్చిన రూ. 1.05 లక్షలకు అదనంగా  అగ్రిమెంట్‌లో లేకపోయినా ఉదారంగా ఎకరాకు మరో రెండు లక్షలు ఇస్తామని ప్రకటించారన్నారు. ప్రస్తుతం తమ వద్ద పనిచేస్తున్న 94 మంది కార్మికుల్లో 21 మందిని పర్మినెంట్ చేశామని, 15 మందిని చేయబోతున్నామని, మిగిలిన 44 మందికి తగిన విద్యార్హతలు లేనందున ఉద్యోగ భద్రత కల్పిస్తామని హమీ ఇచ్చారు. దీన్ని రికార్డు చేసుకోవచ్చని అధికారులకు సూచించారు.

అ తర్వాత  చివరగా కొత్తగా ఎన్ని ఉద్యోగాలిస్తారనే దానిపై చర్చ జరిగింది. వివిధ కారణాలతో రాజీనామా చేసిన వారి స్థానంలో ఏ ఒక్కరినీ తాము  తీసుకోలేదని, ఔట్ సోర్సింగ్‌కార్మికులతోనే ఆ ఖాళీలను భర్తీ చేస్తామన్నారు. అలాగే  బీఏ చదివిన వారిని పర్మినెంట్ చేసే విషయాన్ని పరిశీలిస్తామని, 20 మందికి కొత్తగా ఉద్యోగావకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు.

అంతలోనే కార్మిక నాయకులు 300 మందికి ఉద్యోగాలివ్వాలని డిమాండ్ చేయగా, ఆర్డీఓ జోక్యం చేసుకుని అంత మందికి ఇవ్వడం సాధ్యం కాదని, కనీసం 50 మందికైనా ఇవ్వాలని కంపెనీ ప్రతినిధులను కోరారు. మధ్యే మార్గంగా 30 మందికి కొత్తగా ఉద్యోగాలు ఇస్తామని యాజమాన్యం తరుపున ప్రతినిధులు హామీ  ఇచ్చారు. అయినప్పటికీ కార్మిక ప్రతినిధులు 44 మంది కార్మికులను పర్మినెంటు చేయాల్సిందేనంటూ మధ్యలోనే లేచి వెళ్లిపోయారు.

 ఇది సరైన పద్ధతి కాదు : జేజే రెడ్డి
 కార్మికుల సమస్యలపై మూడు గంటలపాటు చర్చిస్తూ సమస్యల పరిష్కారానికి చొరవ చూపితే మధ్యలో లేచి వెళ్లిపోవడం సరైన పద్ధతి కాదని భారతి సిమెంటు ఫ్యాక్టరీ డెరైక్టర్ జేజే రెడ్డి పేర్కొన్నారు. అధికారులపై గౌరవంతో చర్చలకు హాజరై మూడు గంటలపాటు కార్మిక ప్రతినిధులు వేసిన ప్రతి ప్రశ్నకు తాము ఓపికగా సమాధానాలు చెప్పినా చివరి నిమిషంలో కావాలనే కార్మికులు లేచి వెళ్లిపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement